న కార్తికసమో మాసో న కృతేన సమం యుగమ్,
న వేదసదృశం శాస్త్రం న తీర్థం గంగయా సమమ్!
కార్తీకమాసానికి సమానమైన మాసము, సత్యయుగంతో సమానమైన యుగము , వేదములతో సమానమైన శాస్త్రము, గంగానది వంటి నది, మరేమియు లేవు.
పౌర్ణమి కృత్తిక నక్షత్రముతో కూడినది కావున, ఈ మాసమునకు కార్తీకమాసముగా వ్యవహరించబడుతుంది. తెలుగు మాసములలో, కార్తీక మాసం 8వ మాసం. ఆశ్వయుజబహుళ అమావాస్య మారుసటి రోజు నుండి కార్తీకమాసం ప్రారంభమై, కార్తీక బహుళ అమావాస్య రాత్రి, పోలి స్వర్గారోహణ కార్యక్రమముతో ముగుస్తుంది. కార్తీకమాసం శివకేశవులిద్దరికీ ప్రీతికరమైనది. కావున, శివకేశవులిద్దరిని, కార్తికదామోదర అను నామముతో భక్తితో కొలుస్తారు.
విశేషించి, కార్తీకమాసం ప్రాతఃకాలముననే పుణ్యనదులలో స్నానములకు, శివాలయములందు దీపారాధనకు, శివారాధనకు, మహన్యాసపూర్వక రుద్ర, నమక, చమకములతో రుద్రాభిషేకములకు, పవిత్ర కార్తీక సోమవార, కార్తీక శుక్ల ఏకాదశీ, కార్తీక పౌర్ణిమ, కార్తీక బహుళ ఏకాదశీ ఉపవాస నియములకు, సాలగ్రామ, యజ్ఞోపవీత, అమలక (ఉసిరి), దీప, స్వయంపాకం, రజిత (వెండి) సువర్ణ (బంగారం) గోదానా, వస్త్ర, మొదలగు దానములకు ప్రతీతి. విశేషించి, సాలగ్రామ, యజ్ఞోపవీత, అమలక (ఉసిరి), దీప దానములను భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. ప్రసిద్ధ దేవాలయములలో కార్తీకమాసంలో హరికథ, పురాణ ప్రవచనములు, కార్తీక వనభోజనాలు, ఆర్ధిక వనరులుండి, ఓపిక ఉన్నవాళ్లు, వారణాసిలో 9 రాత్రుల నిద్ర, కార్తీక మాసంలో సర్వసాధారణం. కార్తీక శుద్ధ పాడ్యమి మొదలు, కార్తీక బహుళ అమావాస్య వరకు, అన్ని శివాలయములలో, ఆకాశదీపం వెలిగించించడం అనాదిగా ఆచరిస్తున్న ఆచారం. ఆలయ ద్వజస్థంభమునకు వేలాడదీసిన ఆకాశదీపాన్ని, సంధ్యాసమయమున క్రిందకు దించి, ప్రమిదలో ఆవునెయ్యి వేసి, అందులో వత్తి ఉంచి, వెలిగించి, తిరిగి ధ్వజస్తంభ శిఖరాగ్రమునకు వేలాడదీస్తారు. శివాలయమునకు వచ్చే భక్తులు, ఆకాశదీపాన్ని దర్శించి, నమస్కరించి, ఆ తరువాత ఆలయంలో దీపాలు వెలిగించి, పరమేశ్వరునకు నివేదన సమర్పించడం సాంప్రదాయకంగా వ్యవహరించబడుతున్నది. కార్తీకమాసమంతా దేవాలయములలోను, ఇంట్లోని తులసి మొక్క దగ్గర, సింహద్వారమునకు ఇరువైపులా, ఉభయ సంధ్యలందు దీపాలు వెలిగించడం, కార్తీకపౌర్ణమికి జ్వాలాతోరణం దాటడం, ఆచారం.
కావున, స్త్రీ పురుష బేధం లేకుండా, ప్రతి ఒక్కరు, కార్తీక మాస నియమములను పాటించి, కార్తీక దామోదరుని అనుగ్రహమునకు పాత్రులు కావాలని ఆకాంక్షిస్తున్నాము.