గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చంద్రబాబునాయుడు 2019లో అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లు చట్టబద్ధమేనని కేంద్రం స్పష్టం చేయడం, పైగా, రాష్ట్ర జాబితాలో ఉన్న కాపులకు రిజర్వేషన్లు కల్పించడంలో కేంద్రం అవసరం లేదని, ఇందులో తమ పాత్ర ఏమీ లేదని రాజ్యసభలో కేంద్ర సామాజిక, న్యాయశాఖ సహాయ మంత్రి ప్రతిమ భౌమిక్ స్పష్టం చేయడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఇరకాటంలో పడవేసిన్నట్లయింది.
అధికారంలోకి వచ్చినప్పటి నుండి కాపు రేజర్వేషన్లపై జగన్ ప్రభుత్వం దాటవేత వైఖరి అవలంభిస్తోంది. ఈ అంశం కోర్టులో ఉన్నదనో, కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్నదానో సాకులు చెబుతూ వస్తున్నది. రాజకీయంగా కూడా కాపుల మద్దతు లేకుండా, గతంలో టిడిపికి మద్దతుగా ఉంటూ వస్తున్న బిసిలను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. కాపు కార్పొరేషన్ పనితీరును సహితం నిర్వీర్యం చేశారు.
కాపులపైకి బిసిలను ఎగదోసే విధంగా వ్యవహరిస్తున్నారు. పైగా, కాపులు ఎక్కువగా అభిమానించే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముగ్గురు మహిళలను వివాహం చేసుకొని అన్యాయం చేశారని అంటూ వ్యక్తిగత విమర్శలకు సహితం వెనుకాడలేదు. అంతే కాకుండా, `చంద్రబాబు దత్త పుత్రుడు’ అంటూ స్వయంగా ముఖ్యమంత్రి ఎద్దేవా చేస్తున్నారు.
తన మంత్రివర్గంలోని ఐదుగురు కాపులతో పవన్ కళ్యాణ్ పై నిత్యం వ్యక్తిగత విమర్శలు చేయిస్తున్నారు. దానితో కాపుల మద్దతు రాజకీయంగా అసంభవమని పరిస్థితి ఎదురైంది. అటువంటప్పుడు ఈ విధమైన స్పష్టత కేంద్రం నుండి రావడంతో కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. రాజకీయంగా రేజర్వేషన్లు కాపులకు అమలు చేయడానికి ఏమాత్రం ఇష్టపడటం లేదని ఆయన ధోరణి స్పష్టం చేస్తున్నది.
కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ 2019లో టీడీపీ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కోటా 10 శాతం కాగా, ఇందులో 5 శాతం కాపులకు, మిగతా 5 శాతం ఇతర అగ్రవర్ణాలకు కల్పిస్తూ బిల్లులో పేర్కొంది.
కొన్ని నెలల క్రితం కాపు రిజర్వేషన్ అంశాన్ని బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహారావు రాజ్యసభ జీరో అవర్లో ప్రస్తావించారు. ఏపీ ప్రభుత్వం కాపులకు ఓబీసీ రిజర్వేషన్‌ను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీలో కాపులు సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడ్డారని, కావున వారికి రిజర్వేషన్ అమలు చేయాల్సిన అవసరముందని ఆయన తెలిపారు.
ఏపీ జనాభాలో 18 శాతం ఉన్న కాపులకు అభివృద్ధి ఫలాలు అందడం లేదని, రాష్ట్ర అభివృద్ధిలో కాపులు విశేషంగా కృషి చేశారని ఆయన చెప్పారు. బ్రిటిష్ పాలనలో, కాపులను వెనుకబడిన తరగతులుగా పరిగణించారు (1915 జిఓ నెం.67 ప్రకారం) కానీ 1956లో నీలం సంజీవ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ జాబితా నుండి వారిని తొలగించారని పేర్కొన్నారు.
1956 నుంచి రాజకీయంగా అధికారం లేదన్న కారణంగా అన్ని ప్రభుత్వాలు కాపులకు అన్యాయం చేశాయని జీవీఎల్ ధ్వజమెత్తారు. విద్యాపరంగా, సామాజికంగా ఆర్థికంగా బలహీనంగా ఉన్న కాపులు రిజర్వేషన్ల కోసం ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారని, ముఖ్యంగా గత రెండు దశాబ్దాలుగా ఏపీలో కాపు రిజర్వేషన్ల కోసం రాజకీయ ఆందోళనలు చేస్తూనే వున్నారని తెలిపారు.