తెలంగాణ అభివృద్ధికి కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నదని, కేంద్రం నిధులతో తప్ప రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఇక్కడ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ఏవీ అమలు జరగడం లేదని తరచూ బిజెపి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఏపీ విభజన చట్టంలో చేయవలసిన పనులు సహితం తెలంగాణకు ఏమీ చేయలేదని బిఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తుంటే మాయమాటలతో కాలం గడుపుతున్నారు.
వాటిల్లో ముఖ్యమైన కాజీపేటలో రైల్ కోచ్ ఫ్యాక్టరీ హామీని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా తుంగలో తొక్కింది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం స్థలం చూపడం లేదనో, మరేదో సాకు చెబుతూ రాష్ట్ర ప్రభుత్వమే అందుకు కారణం అన్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితరులు చెబుతూ వస్తున్నారు. కానీ, ఇప్పుడు తెలంగాణకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం లేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా స్పష్టం చేసింది. తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అంశాన్ని బీఆర్ఎస్ ఎంపీ సురేశ్ రెడ్డి రాజ్యసభలో శుక్రవారం లేవనెత్తారు.
కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ లిఖితపూర్వకంగా బదులిస్తూ ఈ విషయం పేర్కొన్నారు. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలంటే దేశంలో రైల్వే కోచ్‌లకు తగినంత డిమాండ్ ఉండాలని చెప్పుకొచ్చారు. కానీ దేశంలో ఇప్పటికే ఉన్న కోచ్ ఫ్యాక్టరీలు, ప్రస్తుత అవసరాలతో పాటు సమీప భవిష్యత్తు అవసరాలను సైతం తీర్చగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో కొత్తగా కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు.
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని తెలంగాణ నుండి మోదీ ప్రభుత్వం అస్సాంకు తరలిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ఆరోపించిన రెండు రోజులకే పార్లమెంట్ లో కేంద్ర మంత్రి ఈ ప్రకటన చేయడం గమనార్హం. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని తెలంగాణ నుంచి ఎన్నిసార్లు విజ్ఞప్తులు వెళ్లినా కేంద్రం బుట్టదాఖలు చేసింది. పార్లమెంట్‌లో నిలదీసినా నిస్సిగ్గుగా సమాధానం దాటవేశారే కానీ ఒక్కసారి కూడా సమాధానం చెప్పిన పాపాన పోలేదు. దేశంలో ఎక్కడా రైల్ కోచ్ ఫ్యాక్టరీలు పెట్టాల్సిన అవసరం లేదని 2017లో కేంద్రం ప్రకటించింది.
విచిత్రం ఏంటంటే ఆ తర్వాత పలు రాష్ట్రాల్లో రైల్ కోచ్ ఫ్యాక్టరీలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణకు మాత్రం మొండిచేయి చూపించింది. మహారాష్ట్రలోని లాతూర్‌లో రైల్ కోచ్ ఫ్యాక్టరీ కోసం కేంద్రం నిధులు విడుదల చేసింది. తాజాగా అసోంలోని కొక్రాజార్‌లో రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్టు పార్లమెంట్‌లో కేంద్రం ప్రకటించింది.
తెలంగాణాలో అధికారంలోకి రావాలని ఆత్రుతతో ఉన్న బిజెపి రాష్ట్రానికి చెప్పుకోదగిన ఒక ప్రాజెక్ట్ కూడా తీసుకు రాలేక పోవడంతో రాష్ట్ర ప్రజల పట్ల వివక్షత చూపుతున్నారనే బిఆర్ఎస్ నాయకుల విమర్శలకు ఆజ్యం పోసినట్లు అవుతుంది. కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాలనే పట్టించుకొంటున్నట్లు స్పష్టం అవుతుంది.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం – 2014 ప్రకారం ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానితో హైదరాబాద్ నగరాన్ని అనుసంధానిస్తూ ఏర్పాటు చేయాల్సిన రైల్వే లైన్ల గురించి కూడా కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. 2017-18 బడ్జెట్లో విజయవాడ నుంచి అమరావతి మీదుగా గుంటూరు వరకు సింగిల్ లైన్‌తో రైల్వే లైన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని తెలిపారు.
అయితే, అందులో భాగంగా ఎర్రుపాలెం – నంబూరు మధ్య 56.53 కి.మీ రైల్వే లైన్ ఏర్పాటుకు రూ. 1,732.56 కోట్ల అంచనాలతో సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధం చేశామని, కానీ ఈ లైన్ మీదుగా రైల్వే ట్రాఫిక్ తగినంత ఉండే అవకాశం లేదని, పెట్టిన ఖర్చుకు తగినంత ఆదాయం తిరిగొచ్చే పరిస్థితి లేదని కేంద్ర ప్రభుత్వం అంచనాలు వేసిందని రైల్వే మంత్రి అసలు విషయం చెప్పేసారు.
ఈ క్రమంలో ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత భరించాలని కోరడంతో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు అంగీకరించలేదని, ఫలితంగా ఈ ప్రాజెక్టు చేపట్టలేకపోయామని అశ్వని వైష్ణవ తేల్చి చెప్పారు.
అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజా ప్రతినిధుల నుంచి పదే పదే వస్తున్న విజ్ఞప్తుల నేపథ్యంలో ఈ ప్రాజెక్టును మరోసారి పరిశీలించి, తాజా రేట్లతో కొత్త డీపీఆర్ సిద్ధం చేయాలని జోనల్ రైల్వేకు సూచించామని, జోనల్ రైల్వే విభాగం ఆ పని చేపట్టిందని తెలిపారు.