త్వరలోనే తిరిగి తాను రాజకీయాలలోకి ప్రవేశించడం గురించి ప్రకటిస్తానని వెల్లడించిన కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కాకినాడ లోక్ సభ స్థానం నుండి పోటీకి సిద్దమవుతున్నట్లు తెలుస్తున్నది. వైసిపి అభ్యర్థిగా అక్కడి నుండి పోటీచేయడం కోసం నిర్ణయించుకున్నారని చెబుతున్నారు.
గోదావరి జిల్లాలో కాపు సామాజికవర్గం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలనపై తీవ్ర ఆగ్రవేశాలతో ఉన్నారని, ముఖ్యంగా కాపు రిజర్వేషన్ విషయంలో ఈ ప్రభుత్వం తమను దగా చేసిందని ఆగ్రవేశాలతో ఉన్నారని ఇటీవల జరిగిన పలు సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి. అందుకనే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన నేత పవన్ కళ్యాణ్ ఈ జిల్లాలలో పర్యటిస్తున్నప్పుడు అనూహ్యంగా ప్రజా స్పందన లభిస్తోంది.
ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో పాత ఉమ్మడి గోదావరి జిల్లాలో వైసీపీ దాదాపు తుడిచిపెట్టుకుపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ప్రమాదం నుండి బయటపడేందుకు 2009 నుంచి క్రియాశీలక రాజకీయాలను దూరంగా ఉన్న ముద్రగడను రంగంలోకి దించుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది.
తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ చేపట్టిన ఉద్యమం మహోధృతమైంది. అంతకు ముందే విజయవాడలో కాంగ్రెస్ ఎమ్యెల్యే వంగవీటి మోహనరంగారావు దారుణంగా హత్యకు గురికావడంతో కాపు సామాజికవర్గంలో పెబుల్లికిన ఆగ్రవేశాలను ముద్రగడ రాజకీయంగా మలచుకొని, ఆ సామాజికవర్గంలో పెద్ద నాయకుడిగా ఎదిగారు. 1989లో టిడిపి ప్రభుత్వ ఓటమికి ఒక విధంగా దోహదపడ్డారు.
తిరిగి 2014లో విభజిత ఆంధ్ర ప్రదేశ్ లో ఏర్పడిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై కాపులలో ఆగ్రవేశాలను కలిగించడంలో సహితం తునిలో ఆయన జరిపిన సభ హింసాత్మకంతా మారడం సహకరించింది. వైసీపీ నాయకత్వం వ్యూహం ప్రకారమే ఆయన అప్పుడు మరోసారి కాపు రిజర్వేషన్ సమస్యను తీసుకువచ్చారని అభిప్రాయం పలువర్గాలలో నెలకొంది.
కాపు ఉద్యమం సమయంలో తునిలో జరిగిన హింసాత్మక ఘటనల నేపధ్యంలో అప్పట్లో రాష్ట్ర, రైల్వే పోలీసులు ముద్రగడపైన కూడా కేసులు నమోదు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చాక ముందు రాష్ట్ర పోలీసులు పెట్టిన కేసులు మాఫీ చేయడం గమనార్హం. ఇటీవలే రైల్వే కేసుల్లో కూడా కాపు నేతలకు క్లీన్‌చిట్ లభించింది. దానితో తాజాగా ముద్రగడ అస్త్రాన్ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రయోగించేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తున్నది.
ముద్రగడను పోటీకి దింపితే గోదావరి జిల్లాల్లో కొంతవకైనా కాపుల ఆగ్రహాన్ని నివారింపవచ్చని వైఎస్ జగన్ ఎత్తుగడగా కనిపిస్తున్నది. అందుకోసం, ప్రస్తుతం కాకినాడ ఎంపీగా ఉన్న వంగవీటి గీతను పిఠాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేయించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని చెబుతున్నారు. ఆమె కూడా ఎమ్యెల్యేగా ఎన్నికైతే మంత్రిపదవి దక్కుతుందని ఉత్సాహంగా ఉన్నట్టు కనిపిస్తున్నది. 2009లో ప్రజారాజ్యం అభ్యర్థిగా ఆమె ఇక్కడినుండి శాసనసభకు ఎన్నికయ్యారు.