కాంగ్రెస్ సీట్ కావాలంటే పార్టీ మారనని బాండ్ వ్రాసివ్వాలి

Sunday, December 22, 2024

కర్ణాటక ఎన్నికల జోష్ లో ఉన్న కాంగ్రెస్ నేతలలో పొరుగునే ఉన్న తెలంగాణాలో కూడా అధికారంలోకి రాబోతున్నామనే ధీమా పెరుగుతున్నది. మొదటిసారిగా ఇటీవల కాలంలో తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు అనేకమంది ఉత్సాహం కూడా చూపుతున్నారు. అయితే, ఎన్నికలలో పోటీ చేసేందుకు కాంగ్రెస్ సీట్ కావాలంటే ఒక బాండ్ వ్రాయించుకోవాలని పార్టీ అధిష్టానం చూస్తున్నట్లు తెలుస్తున్నది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి కాంగ్రెస్ నుండి అసెంబ్లీ, లోక్ సభలకు గెలుపొందిన వారిలో అత్యధికులు అధికార పార్టీలో చేరుతున్నారు. కనీసం ఎమ్యెల్యేగా రాజీనామా చేయకుండానే మంత్రి పదవులు కూడా పొందుతున్నారు. దానితో కాంగ్రెస్ ను గెలిపిస్తే, వారు బిఆర్ఎస్ లో చేరిపోతారంటూ బీజేపీ ప్రచారం కూడా చేస్తున్నది.

అందుకనే ఈ సారి అసెంబ్లీ టికెట్ కావాలంటే బాండ్ రాసివ్వాలని కాంగ్రెస్ షరతు పెడుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత పార్టీ మారను. ఒక వేళ మారాల్సి వస్తే రాజీనామా చేస్తానని బాండ్ పేపర్ మీద రాస్తేనే టికెట్లు ఇస్తానని టిపిసిసి ఖరాఖండీగా చెబుతున్నట్టుగా సమాచారం. అసెంబ్లీ టికెట్లు ఆశిస్తున్న వారు బాండ్ పేపర్ రాసిస్తేనే వారి అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తామని కూడా టిపిసిసి స్పష్టం చేసినట్టుగా తెలిసింది.

హైకమాండ్ ఆదేశాల మేరకే ఈ బాండ్ పేపర్ పద్ధతిని తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. ఇదే విషయమై ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు ఆదేశాలు వెళ్లాయని, బాండ్ పేపర్ పద్ధతిపై స్పష్టమైన సూచనలు చేసినట్టుగా తెలుస్తోంది. అధిష్టానం సూచించినట్టుగానే టి -కాంగ్రెస్ నాయకులు సైతం ఈ బాండ్ పేపర్ పద్ధతికి ఓకే చెప్పినట్లుగా సమాచారం.

వాస్తవానికి జీహెచ్‌ఎంసి ఎన్నికల సమయంలో కార్పొరేటర్ టికెట్ల ఆశించిన వారు కూడా బాండ్ పేపర్లపై సంతకం పెట్టినట్లుగా తెలుస్తున్నది. అయితే జీహెచ్‌ఎంసి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది కేవలం 2 డివిజన్లు మాత్రమే కావడంతో ఈ బాండ్ పేపర్ల వ్యవహారం బయటకు రాలేదు. అయితే ఈ సారి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం కచ్చితంగా దీనిని అమలు చేయాలని టిపిసిసి నిర్ణయించినట్టుగా తెలిసింది.

ఎవరైనా బాండ్ పేపర్ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహారిస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని టిపిసిసి ఆ బాండ్‌లో స్పష్టంగా రాయించుకుంటోంది. ఈ బాండ్ల వ్యవహారాన్ని పరిశీలించేందుకు ప్రత్యేకంగా లీగల్ సెల్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. కేవలం కొత్తగా పార్టీలో చేరేవారికే కాకుండా పాత నాయకులకు కూడా ఈ బాండ్ పేపర్ పద్ధతి అమల్లో ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles