కాంగ్రెస్ వైపు అడుగులేస్తున్న బిఆర్ఎస్ ఎమ్యెల్సీ!

Thursday, November 14, 2024

కర్ణాటక ఎన్నికల జోష్ తెలంగాణ కాంగ్రెస్ లో కొనసాగుతున్నది. ఇప్పటికే బిఆర్ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు బిజెపిని కాదని కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధమవుతుండగా, మరో బిఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు తెలుస్తున్నది.

బిజెపిలోకి ఇతర పార్టీల వలసలు దాదాపు ఆగిపోగా, ఇప్పటికే వలస వచ్చిన నేతలను కాపాడుకోవడం ఆ పార్టీకి సమస్యగా మారింది. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి కూడా కాంగ్రెస్ గూటికి చేరేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నట్లు వెల్లడవుతుంది.పలువురు కాంగ్రెస్ నేత‌లు ఆయ‌నతో సంప్రదింపులు ప్రారంభించడం జరుగుతుంది.

టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవితో దామోదర్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సంద‌ర్బంగానే దామోద‌ర రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సిందిగా మల్లు రవి ఆహ్వానించగా, అందుకు ఆయ‌న సూత్ర‌ప్రాయంగా అంగీక‌రించిన‌ట్లు చెబుతున్నారు.

దీంతో త్వరలో దామోదర్ రెడ్డి, ఆయన కుమారుడు రాజేష్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. అయితే దామోదర్ రెడ్ నాగర్ కర్నూలు నియోజకవర్గం నుంచి తన కుమారుడు రాజేష్‌కు టికెట్ ఆశిస్తున్నారు. అయితే ఇప్పటికే ఆ నియోజకవర్గంలోని సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి ఉండటంతో ఆ విషయంపైనే మల్లు రవితో చర్చలు జరిపినట్టుగా తెలుస్తున్నది.

గతంలో కాంగ్రెస్ లో సర్పంచ్ గా,  ఎంపిపిగా,జెడ్పిటిసిగా, జిల్లా పరిషద్ చైర్మన్ గా ఉన్న ఆయన బిఆర్ఎస్ లో చేరి ఎమ్యెల్సీ అయి, రెండో సారి ఎమ్యెల్సీగా ఉంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ లో చేరి కుమారుడిని ఎమ్యెల్యేగా చేయాలని చూస్తున్నారు.

మరోవంక, కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకొంటున్న  జూపల్లి కృష్ణరావు పలువురు కాంగ్రెస్ నేతలతో భేటీ అవుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత జగదీశ్వరరావులతో వేర్వేరుగా సమావేశం అయ్యారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరిక, రాష్ట్రంలోని, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని తాజా రాజకీయ అంశాలపై వారితో చర్చించారు. రెండు గంటలకు పైగా ఈ సమావేశాలు జరిగాయి. కాంగ్రెస్‌లో చేరితే కొల్లాపూర్ పార్టీ కోసం ఇంత కాలం పనిచేసి టికెట్ ఆశిస్తున్న నేతలతో కలిసి ముందుకు సాగాలనే భావనలో జూపల్లి కృష్ణారావు ఉన్నట్లు చెబుతున్నారు.

ఈ చేరికలతో ఇప్పటికే కాంగ్రెస్ బలంగా ఉన్న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బిఆర్ఎస్ కు ఎదురు దెబ్బలు తగలడం అనివార్యమని స్పష్టమవుతుంది. పైగా, డి కె అరుణ, జితేందర్ రెడ్డి వంటి సీనియర్ నేతలతో ఈ జిల్లాలో ప్రభావం చూపాలి అనుకొంటున్న బిజెపికి సహితం పరిస్థితులు గడ్డుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles