ఎన్నికలు దగ్గర పడుతున్నా తెలంగాణ కాంగ్రెస్ లో కుమ్ములాటలు మాత్రం తగ్గడం లేదు. సందు దొరికినప్పుడల్లా సీనియర్ నేతలు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై అంతెత్తున ఎగురుతున్నారు. సహాయనిరాకరణ ప్రకటిస్తున్నారు. కాంగ్రెస్‌లో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి.
తాజాగా, రాష్త్ర వ్యాప్తంగా చేపట్టాల్సిన నిరుద్యోగ నిరసన దీక్షలను మొదటగా నల్గొండలో ఈ నెల 21న జరుపుతున్నట్లు స్వయంగా రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే ఇద్దరు పార్టీ ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కన్నెర్ర చేయడంతో దానిని వాయిదా వేసుకోవలసి వచ్చింది.
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అంశంపై పోరాటంకై 21న నల్గొండలో, 24లో ఖమ్మం, ఏప్రిల్ 26వ తేదీన ఆదిలాబాద్ జిల్లాలో నిరసన దీక్షలు చేపట్టి, మే 4 లేదా 5న హైదరాబాద్ లోని సరూర్ నగర్ లో ప్రియాంక గాంధీతో భారీ కార్యక్రమం చేపట్టాలని టిపిసిసి నిర్ణయించింది. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డిలు ఎదురు తిరగడంతో మొదటి కార్యక్రమంకే చుక్కెదురైంది.
అయితే సీనియర్లు కన్నెర్ర చేయడంతో ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. నల్లగొండ ఎంపీగా ఉన్న తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కార్యక్రమం ఉంటుందంటూ ఎలా ప్రకటిస్తారని మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయంపై ఆయన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్ రావ్ ఠాక్రేకు ఫిర్యాదు చేశారని సమాచారం.
ఉమ్మడి నల్గొండ జిల్లా నేత అయిన మరో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహితం ఆ సమయంలో ఢిల్లీలో తనకు వేరే పనులు ఉన్నాయని, రాలేనని ప్రకటించారు. అభివృద్ధి పనులపై కేంద్రంతో చర్చించేందుకు ఢిల్లీలో ఉన్నానని… అందుకే రాలేకపోతున్నానని ఆయన చెప్పుకొచ్చారు. దానితో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టు టీపీసీసీ వెల్లడించవలసి వచ్చింది.
మరోవంక, ఇటీవల జగ్గారెడ్డి ఇచ్చిన ఇఫ్తార్ విందుకు రేవంత్ రెడ్డి మినహా కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి రేవంత్ రెడ్డిని జగ్గారెడ్డి ఆహ్వానించలేదు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా అంగీకరించారు. ఇక్కడ కూడా సీనియర్లు రేవంత్ రెడ్డి ఉనికి పట్ల ఎంత అసహనంగా ఉన్నారో వెల్లడవుతుంది. రేవంత్ రెడ్డిని పిలవకుండా ఉత్తమ్, జీవన్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వంటి వారిని ఈ కార్యక్రమానికి పిలిచారు. దీంతో ఈ ఇఫ్తార్ విందు కాస్త రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గం కార్యక్రమంగా మారింది.