కాంగ్రెస్ లో జోష్ తో ఉత్తమ్ కుమార్ అసహనంగా ఉన్నారా!

Wednesday, December 18, 2024

కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం తెలంగాణ కాంగ్రెస్ లో జోష్ పెరగడం, వచ్చే ఎన్నికలలో బిఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తుండటం, పైగా, ఇతర పార్టీల నుండి కూడా పార్టీలో పలువురు చేరే సూచనలు కనిపిస్తుండడంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సుదీర్ఘకాలం టిపిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అసహనంతో ఉన్నట్లు కనిపిసిస్తున్నది.

ఆయన నాయకత్వంలో తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ ఒకవిధంగా పడకవేసింది. వరుసగా ఎన్నికలలో పార్టీ పరాజయం మూటగట్టుకోగా, పార్టీ ఎమ్యెల్యేలను దగ్గరుండి ఆయనే బిఆర్ఎస్ లోకి పంపారనే ఆరోపణలున్నాయి. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వంలో హోసింగ్ మంత్రిగా పనిచేసిన ఆయన హయాంలో భారీ కుంభకోణాలు చోటుచేసుకున్నాయి. వాటిల్లో ఆయన పాత్రకు సంబంధించి కేసీఆర్ వద్ద కీలకమైన ఆధారాలున్నట్లు ప్రచారం జరిగింది.

ఆ కుంభకోణంకు సంబంధించి తగు చర్యలు తీసుకొంటానని పలుసార్లు ప్రకటించిన కేసీఆర్ తర్వాత ఏమీ చేయలేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డితో కుదిరిన అవగాహనమేరకే ఆ కుంభకోణాన్ని కేసీఆర్ ఆటకెక్కించారనే పేరుంది. అందుకనే, తన స్థానంలో టిపిసిసి అధ్యక్షుడిగా వచ్చిన రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తూ, కేసీఆర్ పై సై పోరాటాలకు దిగుతూ ఉంటె అడుగడుగునా అడ్డంకులు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.

కొద్దిరోజుల క్రితం పార్టీలో సీనియర్లు అందరిని దగ్గరకు చేర్చి,  రేవంత్ కు `సహాయనిరాకరణ’ కూడా ప్రకటించారు. అయితే, ఏఐసీసీ జోక్యం, కొత్త రాష్ట్ర ఇన్ ఛార్జ్ రావడంతో పరిస్థితులు సద్దుమణిగాయి. ఎంతగా అడ్డంకులు కల్పిస్తున్నా రేవంత్ కు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మద్దతుగా అంటూ ఉండడంతో ఏమీ చేయలేక పోతున్నారు.

తాజాగా, సోషల్ మీడియాలో తమపై దుష్ప్రచారం చేస్తూ పెట్టిన పోస్టింగుల వెనుక కాంగ్రెస్ పార్టీ ముఖ్యులే ఉన్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడం ఒక విధంగా రేవంత్ రెడ్డి ప్రాబల్యాన్ని కట్టడి చేసేందుకే అనే ప్రచారం జరుగుతుంది. ఈ విషయమై హైద్రాబాద్ సిపి సివి ఆనంద్‌కు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో హైద్రాబాద్ లో యూత్ కాంగ్రెస్ వార్ రూమ్‌పై సోమవారం రాత్రి పోలీసులు దాడికి దిగారు.

యూత్ కాంగ్రెస్ వార్ రూమ్ లోని కంప్యూటర్లను తీసుకెళ్లారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు నిఘా ఏర్పాటు చేయడంతో బంజారాహిల్స్ లో యూత్ కాంగ్రెస్ వార్ రూమ్ నుండి ఈ పోస్టింగ్ లు పెడుతున్నారని గుర్తించారు. ఈ విషయమై యూత్ కాంగ్రెస్ నేత ప్రశాంత్ పై సస్పెన్షన్ వేటు పడింది.

ఈ కేసులో సస్పెన్షన్‌కు గురైన యూత్ కాంగ్రెస్ నేత ప్రశాంత్ పోలీసుల విచారణకు హాజరయ్యారు. అయితే, ఈ విషయమై ఉత్తమ్ కుమార్ రెడ్డి తన దృష్టికి తేవడంతో తాను ఎక్కడ ఏమి జరిగిందో తెలుసుకొనే లోపుగానే పోలీసులు ప్రవేశించారని ప్రశాంత్ మీడియాకు చెప్పారు. అయితే కమ్యూనికేషన్ గ్యాప్ కారణంగానే ఇదంతా జరిగిందని చెప్పారు.

అంతకు ముందే కాంగ్రెస్ వ్యూహకర్త కనుగోలు సునీల్ కార్యాలయంపై సిఐడి పోలీసులు దాడి చేశారు. కీలకమైన ఎన్నికలకు సంబంధించిన డాటాను తస్కరించారని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ఆరోపించారు. కాంగ్రెస్ ఐటి విభాగంపై నిఘా ఉంచేవిధంగా తెలంగాణ పోలీసుకు సహకరించే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవహరిస్తున్నారనే విమర్శలు చెలరేగుతున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles