కాంగ్రెస్ లో చేరేందుకు వైఎస్ షర్మిల సిద్ధం!

Thursday, December 19, 2024

సొంతంగా తెలంగాణాలో వైఎస్సార్ టిపిని ఏర్పాటు చేసుకొని, విస్తృతంగా పాదయాత్ర జరిపి, అధికారంలో వచ్చేస్తున్నామంటూ చెప్పుకొచ్చిన దిగవంత ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖరరెడ్డి తనయురాలి వైఎస్ షర్మిల ఇప్పుడు తన పార్టీ జెండాను పీకేసి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తున్నది.

తండ్రికి సన్నిహితులైన మాజీ ఎంపీ డా. కెవిపి రామచంద్రరావు, కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ల సలహామేరకు ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబతున్నారు. వారిద్దరే కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడి, ఆమె చేరికకు మార్గం సుగమం చేస్తున్నారని తెలుస్తున్నది. ఇప్పటికే షర్మిల రెండు పర్యాయాలు శివకుమార్ ను కలిశారు.

అయితే మర్యాదకోసమే కలిశానని, మరో పార్టీలో కలపడం కోసమా పార్టీ పెట్టుకోండి అంటూ షర్మిల మీడియా వద్ద పౌరుషంగా మాట్లాడారు. ఈ విషయంలో డా. కెవిపి రామచంద్రరావు కీలక పాత్ర వహిస్తున్నట్లు చెబుతున్నారు. ఆయన ప్రోద్భలం కారణంగానే కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేసేందుకు షర్మిల సుముఖత వ్యక్తం చేసిన్నట్లు తెలిసింది.

పైగా, ఆమె ఇప్పటికే పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన పాలేరు సీట్ ను కాంగ్రెస్ పార్టీ ఆమెకు ఇవ్వాలని సిద్ధంగా ఉన్నట్లు కూడా చెబుతున్నారు.  అన్నింటికన్నా విశేషం ఏమిటంటే ఆమెను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొనే విషయం ఢిల్లీ స్థాయిలో జరుగుతుంది. టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో సహా రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అందరిని ఈ విషయంలో ప్రేక్షక పాత్రకు పరిమితం చేస్తున్నారు.

రెండేళ్లుగా ఎంతగా కష్టపడుతున్నా క్షేత్రస్థాయిలో షర్మిల తన పార్టీకి చెప్పుకోదగిన బలం చేకూర్చుకోలేక పోతున్నారు. ఎన్నికల్లో పోటీకి బలమైన అభ్యర్థులు కాగలిగిన వారు సహితం పార్టీలో కనిపించడం లేదు. దానితో మీడియా హైప్ ఎక్కువగా ఉన్నట్లు స్పష్టం అవుతుంది. ఆమె సహితం నిత్యం కేసీఆర్ నో, మరొకరినో ఘాటుగా విమర్శిస్తూ మీడియాలో కనిపించే ప్రయత్నంకే  పరిమితం అవుతున్నారు.

ఎన్నికల్లో ప్రభావం చూపలేని పక్షంలో తెలంగాణాలో రాజకీయంగా మనుగడ సాగించడం దుర్లభం కాగలదు. అందుకనే కాంగ్రెస్ వంటి బలమైన పార్టీలో చేరితే రాజకీయ ఉనికి కొనసాగే అవకాశం ఉంటుందని ఆమె అంచనా వేస్తున్నట్టు కనిపిస్తున్నది. మరోవంక, ఆమె కాంగ్రెస్ లో చేరితే ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రచారంకు ఆమెను ఉపయోగించుకోవడం ద్వారా పరోక్షంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఒత్తిడి తేవచ్చని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.

వైఎస్ జగన్ ఇప్పటిలో కాంగ్రెస్ కు దగ్గరయ్యే అవకాశాలు లేకపోయినా 2024 ఎన్నికల అనంతరం అవసరమైతే కాంగ్రెస్ వైపు తిప్పుకునేందుకు ఆమెను అస్త్రంగా ఉపయోగించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, మొదటి నుండి రాజకీయంగా అన్నతో నేరుగా తలబడేందుకు విముఖంగా ఉన్న షర్మిల కాంగ్రెస్ ఎత్తుగడలకు ఏమాత్రం ఉపయోగ పడగలదో చూడాల్సి ఉంది.

షర్మిలతో పాటు ప్రొఫెసర్ కోదండరాం వంటి `ఏకవ్యక్తి పార్టీలు’ను కూడా కలుపుకు పోవడం ద్వారా కేసీఆర్ వ్యతిరేక ఓట్లలో చీలిక లేకుండా చూసుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు ప్రారంభించింది. కాంగ్రెస్ లో విలీనంపై కోదండరాం వ్యతిరేకత వ్యక్తం చేసినా, కేసీఆర్ ను ఓడించడంకోసం ఉమ్మడి ప్రయత్నాలకు తనకు సిద్దమని ప్రకటించారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles