బిఆర్ఎస్ నుండి సస్పెన్షన్ కు గురైనప్పటి నుండి తమ భవిష్యత్ రాజకీయ ప్రణాళికల గురించి స్పష్టత ఇవ్వకుండా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అనిశ్చితకు దోహదపడుతున్నారు. మొదట్లో బీజేపీలో చేరబోతున్నారనే సంకేతం ఇచ్చి, ఆ పార్టీ వారిలో ఎన్నో ఆశలు కలిగించారు.
తీరా భారీ ఆఫర్లతో వారిని చేర్చుకునేందుకు బిజెపి నేతలు సిద్ధం కాగా, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాగానే తోకముడిచారు. కాంగ్రెస్ లో చరడమా లేక సంతంగా పార్టీ పెట్టడమా అనే సందిగ్థతకు లోనయ్యారు. చివరకు కాంగ్రెస్ లో చేరేందుకు నిర్ణయించుకున్న తర్వాత కూడా ఆ విషయం బైట చెప్పేందుకు సందేహిస్తున్నారు.
కాంగ్రెస్ లో పలువురు బృందాలతో, పలు దఫాలుగా భేటీలు జరిపి తమ డిమాండ్ ను వివరించి, స్పష్టమైన హామీలు తీసుకున్నారు. చివరకు టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలసి బుధవారం వారిద్దరిని కలిసి, లాంఛనంగా కాంగ్రెస్ లో చేరమని ఆహ్వానించారు. వెంటనే వారు తమ నిర్ణయం ప్రకటిస్తారని, రాహుల్ గాంధీతో కలిపేందుకు గురువారమే వారిద్దరిని ఢిల్లీకి తీసుకెళ్లాలని ప్లాన్ వేసుకున్నారు.
ఈ భేటీ తరువాత కాంగ్రెస్‌లో చేరబోతోన్న విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారని భావించినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో చేరికపై ఇప్పటికిప్పుడు స్పష్టత ఇవ్వలేమని పొంగులేటి- జూపల్లి తేల్చి చెప్పడంతో రేవంత్, కోమటిరెడ్డి ఒక విధంగా షాక్ తిన్నారు. కాంగ్రెస్‌లో చేరికపై చాలావరకు నిర్ణయం తీసుకున్నామని చెబుతూనే కాకపోతే.. అంటూ పొంగులేటి ట్విస్ట్ ఇచ్చారు.
తామిద్దరం తమ తమ అనుచరులతో మరో దఫా సమావేశం కావాల్సి ఉందని, ఇంకా చాలా విషయాలు మాట్లాడాల్సి ఉందని పొంగులేటి చెప్పారు. పార్టీ వివరాలు, చేరిక, తేదీ, సమయం తరువాత ప్రకటిస్తామని చెబుతూ మూడు లేదా నాలుగు రోజుల్లోనే తేల్చేస్తామనీ స్పష్టం చేశారు. ఈ విషయంలో జాప్యం జరుగుతున్నందుకు క్షమించమని యావత్ తెలంగాణ బిడ్డలను కోరారు.
అదే సమయంలో, తెలంగాణ ప్రజల కోసం కేసీఆర్ ను తరిమికొట్టేందుకే అందరం ఏకమవుతున్నామని చెప్పడం గమనార్హం. “ఏ పార్టీలో చేరాలో నిర్ణయం తీసుకున్నాం… పార్టీ వివరాలు, చేరికలపై మూడు నాలుగు రోజుల్లో మా నిర్ణయం ప్రకటిస్తాం” అంటూ తెలిపారు.
కర్ణాటక ఫలితాలతో మంచి జోష్ లో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి వచ్చేలా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకుంటోంది. బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయాన్ని నిలువరించడానికి సర్వశక్తులను ఒడ్డుతోంది. కర్ణాటక ఫార్ములాను అనుసరించేలా వ్యూహాలపై కసరత్తు సాగిస్తోంది. ఈ క్రమంలో చేరికలకూ అధిక ప్రాధాన్యత ఇస్తోంది.
ఇందులో భాగంగా మొదటగా పొంగులేటి, జూపల్లిపై దృష్టి సారించగా, వారిద్దరూ ఎప్పడికప్పుడు నిర్ణయం వాయిదా వేస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ లో చేరేందుకు `అదృశ్య శక్తులు’ ఏవైనా వారిని వారిస్తున్నాయా? అనే అనుమానం ఈ సందర్భంగా పలువురికి కలుగుతుంది.