కాంగ్రెస్ మూడడుగులు ముందుకు, ఆరడుగులు వెనుకకు!

Sunday, January 12, 2025

తెలంగాణా రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ అనే సెంటిమెంట్ లో రాష్ట్రంలో పాగా వేయడం కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. తెలంగాణాలో ఇప్పటికి ప్రతి గ్రామంలో నమ్మకమైన కార్యకర్తలున్న రాజకీయ పార్టీ కాంగ్రెస్ మాత్రమే. అయితే నాయకత్వలోపం కారణంగా, నాయకుల మధ్య సఖ్యత లేని కారణంగా ఎప్పటికప్పుడు నవ్వులపాలవుతున్నది.

అందరిని సంతృప్తి పరచడంకోసం జాబో కార్యవర్గాలు ఏర్పాటు చేసినా, ఎవరిదారి వారిదిగా ఉంటున్నది. కనీసం పార్టీ సమావేశాలకు కూడా హాజరు కావడం లేదు. తెలంగాణ పిసిసిలో వందమంది ప్రధాన కార్యదర్శులు ఉన్నారు. పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఆదివారం గాంధీభవన్‌లో పిసిసి విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తే ఆ వంద మందిలో ఏ ఒక్కరు కూడా హాజరు కాలేదు.

దానితో పిసిసి ప్రధాన కార్యదర్శుల తీరుపై తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే మండిపడ్డారు. ఇది మంచి పద్ధతి కాదని, ఇలా సమావేశానికి గైర్హాజరైతే ఎలా అని ఆయన ప్రశ్నించారు. సమావేశానికి రాని, అప్పగించిన బాధ్యతలు నేరవేర్చని నేతలను తొలగిస్తామని హెచ్చరించారు. ప్రధాన కార్యదర్శి ఎవరూ ఇప్పటివరకు నివేదిక లు ఇవ్వకపోవడంతో ఠాక్రేతో పాటు ఎఐసిసి కార్యదర్శి బోసురాజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

గతంలో కూడా ఇటువంటి హెచ్చరికలు జారీచేసిన ప్రయోజనం కనిపించడం లేదు. దానితో, ఇక నుంచి పార్టీ మీటింగ్‌లు, కార్యక్రమాలకు ఐదు సార్లు రాకపోతే పార్టీ నుంచి చర్యలు ఉంటాయని అంటూ మాణిక్‌రావ్ ఠాక్రే ప్రకటించారు. కార్యకర్తల నుంచి లీడర్ల వరకు ఈ రూల్ వర్తిస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ లో ఈ విధమైన రూల్స్ పెట్టడమే గాని, వాటిని అమలు పరచడం మాత్రం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది.

పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా తెలంగాణ పర్యటనకు వచ్చిన్నప్పుడు పార్టీ ఎంపీగా ఉంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గైరాజరైనా, మునుగోడు ఉప ఎన్నికల సమయంలో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన్నట్లు ఆరోపణలు వచ్చినా షోకాజ్ నోటీసు ఇచ్చి సరిపెట్టుకున్నారు. అంతేగాని ఎటువంటి చర్యలు తీసుకోలేదు. నేరుగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై బహిరంగంగా విమర్శలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు.

రేవంత్ రెడ్డి పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోందని, ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని,  30 నియోజక వర్గాలలో హాథ్ సే హాథ్ జోడో పాదయాత్ర విజయవంతంగా నిర్వహించారని సమావేశంలో అభినందించిన ఆ యాత్రకు పలువురు సీనియర్ నాయకులు ఎందుకు దూరంగా ఉంటూ వస్తున్నారో తేల్చుకోలేకపోతున్నారు.

జనగామ కాంగ్రెస్ లో లొల్లి

ఇలా ఉండగా, జనగామ జిల్లా మాజీ డిసిసి అధ్యక్షుడు జంగా రాఘవ రెడ్డికి పిసిసి క్రమశిక్షణా కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లో వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. పిసిసి విస్తృత స్థాయి సమావేశానికి జంగా రాఘవ రెడ్డితో పాటు నాయిని రాజేందర్ రెడ్డిలు డుమ్మాకొట్టారు. దీంతో పార్టీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీనిలో భాగంగా జంగా రాఘవరెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇకపోతే జంగా రాఘవరెడ్డి తీరుపై హన్మకొండ డిసిసి అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి ఏకంగా ప్రెస్‌మీట్ పెట్టి బహిరంగంగా విమర్శలు గుప్పించడం ఇటీవల కలకలం రేగింది. జనగామ జిల్లాకు రాఘవరెడ్డి డిసిసి అధ్యక్షుడు కాదని విపక్షాలకు లాభం కలిగిలా జంగా పనిచేస్తున్నాడని ఆయన ఆరోపించారు.

బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ దాస్యం వినయ్ భాస్యర్‌తో కలిసి తనకు వ్యతిరేకంగా వాల్‌పోస్టర్లు అతికించాడని నాయిని ఆగ్రహం వ్యక్తం చేశారు.తన అనుమతి లేకుండా హన్మకొండ జిల్లాలో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడని, తనకే టికెట్ వస్తుందని అంటున్నాడని జంగాపై రాజేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనూ జంగాపై ఫిర్యాదు చేశామని, ఆయనకు పార్టీ పెద్దలు షోకాజ్ నోటీ సులు కూడా ఇచ్చారని నాయిని గుర్తుచేస్తున్నారు.పార్టీ నాయకత్వం ఏమిచర్య తీసుకొంటుందో చూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles