కాంగ్రెస్ భయం మీదనే కమలదళం ఫోకస్!

Tuesday, November 5, 2024

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏ అంశం అయితే తమ పార్టీని పతనం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ భయపడుతూ వస్తున్నదో అదే అంశం మీద కమలదళం మరింత ఎక్కువగా ఫోకస్ పెడుతోంది. కాంగ్రెస్ పార్టీలో చాలా కాలం నుంచి ఉన్న భయానికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద తెలంగాణ ప్రజలకు ఉన్న అనేకానేక అనుమానాలకు తగిన విధంగా బిజెపి ఇప్పుడు తమ ప్రచార వ్యూహాన్ని మార్చుకుంటోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుత అధికార భారత రాష్ట్ర సమితి బీ టీమ్ గా మాత్రమే వ్యవహరిస్తుందని, ఈ రెండు పార్టీలు భవిష్యత్తులో కలుస్తాయని.. వీరిలో ఎవరికి ఓటు వేసినా కూడా అది రెండోవారికి కూడా మేలు చేయడానికి మాత్రమే అని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్ ఆరోపిస్తున్నారు.

తెలంగాణలో ప్రస్తుతం త్రిముఖ పోటీ ఉంది. అయితే ప్రతి పార్టీ కూడా మిగిలిన రెండు పార్టీల మధ్య అక్రమ సంబంధం ఉంటుందనే ప్రచారంతోనే మనుగడ సాగిస్తుంది. కాంగ్రెస్ బిజెపిల మధ్య అవగాహన ఉందని భారాస అంటుంది. బిజెపి స్కెచ్ ప్రకారమే కేసీఆర్ నడుస్తారని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. కాంగ్రెసుకు బీఆర్ఎస్ బీ టీం అని బిజెపి దెప్పిపొడుస్తుంది. ఈ మూడు పార్టీలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కాలం గడుపుతున్నాయి. 

భారతీయ జనతా పార్టీ పట్ల అపరిమితమైన వ్యతిరేకత, కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కారును గద్దించాలనే సంకల్పం.. లాంటి ఉమ్మడి లక్ష్యాలు ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య కనీసం తెలంగాణ శాసనసభ ఎన్నికల తర్వాత అయినా సరే పొత్తు బంధం ఏర్పడుతుందనే ప్రచారం బాగా ఉంది. ఈ ప్రచారం గురించిన భయం కాంగ్రెసుకే ఎక్కువ. అసలే గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను నమ్మి ప్రజలు ఓట్లు వేస్తే గెలిచిన తర్వాత 12 మంది- అధికార గులాబీ దళంలోకి ఫిరాయించారు. ఆ రకంగా కాంగ్రెస్ నాయకులకు ప్రజల దృష్టిలో క్రెడిబిలిటీ పోయింది. ఇప్పుడు కూడా టిఆర్ఎస్ తో కలుస్తారనే ప్రచారం వలన తమ పార్టీ నష్టపోతుందనే భయం కాంగ్రెస్ అగ్ర నాయకులలో కూడా ఉంది. అందుకే ఇటీవల రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలతో సమావేశం అయినప్పుడు టిఆర్ఎస్ తో పొత్తు ఉండదనే సంగతిని స్పష్టంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని రాహుల్ గాంధీ వారిని పురమాయించారు. ప్రత్యేకంగా ఆ ప్రచారం మీదనే ఆయన దృష్టి పెడుతున్నారు అంటే దాని గురించి భయపడుతున్నారని అర్థం.

సరిగ్గా ఈ భయం మీదనే కమలదళం మరింతగా శ్రద్ధ పెట్టింది. అదే ప్రచారాన్ని ముమ్మరంగా చేయాలని… తద్వారా నిజాయితీగల రాజకీయాలు చేయడం లేదని, ఈ రెండు పార్టీల మీద ప్రజలలో అపనమ్మకాన్ని ప్రోది చేయాలని బిజెపి భావిస్తున్నది. రెండు పార్టీలు కలిస్తే, తాను కాంగ్రెస్ నుంచి బయటకు వస్తానని ప్రకటించిన పీసీసీ సారధి రేవంత్ రెడ్డి అందుకు ఇప్పటినుంచే తయారు కావాలని కూడా బిజెపి తరుణ్ చుగ్ ఎద్దేవా చేస్తున్నారు. ఎవరి మాటలు ప్రజల నమ్మకాన్ని చూరగొంటాయో.. ఎవరికి ప్రజలు పట్టడం కడతారో వేసి చూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles