టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ విషయమై ఉమ్మడిగా పోరాటం చేద్దామని ప్రతిపాదిస్తూ వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వై ఎస్ షర్మిల స్వయంగా టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లకు ఫోన్ చేయడం ఆ రెండు ప్రతిపక్ష పార్టీలను ఇప్పుడు ఆత్మరక్షణలో పడవేసిన్నట్లు కనిపిస్తున్నది.
వారిద్దరూ సానుకూలంగా స్పందించినట్లు ఆమె సంకేతం ఇవ్వడం, ఆమె ప్రతిపాదనకు వారిద్దరూ వెంటనే తిరస్కరించలేదనే సమాచారం మీడియాకు ఇవ్వడంతో అధికార బిఆర్ఎస్ కు బలమైన రాజకీయ ఆయుధం సమకూరి నట్లయింది.
కాంగ్రెస్, బీజేపీలతో పాటు షర్మిల తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా గూడుపుఠాణి ఇప్పటివరకు తెరవెనుక చేసుకొంటూ వస్తున్నారని, ఇప్పుడది బైటపడినదని ప్రజలకు చెప్పే అవకాశం వచ్చినట్లు బిఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ జాతీయ స్థాయిలో ప్రధాన రాజకీయ ప్రత్యర్ధులైనప్పటికీ తెలంగాణాలో మాత్రం పలు అంశాలపై ఒకేవిధంగా మాట్లాడుతూ ఉండటాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.
తాజాగా పేపర్ లీకేజి విషయంలో ఈ రెండు పార్టీల మాటలు ఒకే విధంగా ఉంటున్నాయి. లీకేజికి సూత్రధారి మంత్రి కేటీఆర్ అంటూ ఆరోపణలు చేస్తూ ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని అధికార పక్షం నేతలు ఆరోపిస్తున్నారు. ఒక వంక, జాతీయ స్థాయిలో బిజెపి ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను తన రాజకీయ ప్రయోజనాలకోసం ప్రతిపక్ష నేతలపై దుర్వినియోగం చేస్తున్నట్లు కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తున్నది.
కానీ, పేపర్ లీకేజి పై సిబిఐ, ఈడీ దర్యాప్తులు జరపాలని రేవంత్ రెడ్డి స్వయంగా కోరుతున్నారు. బండి సంజయ్ సహితం అటువంటి డిమాండ్లు చేయడం గమనార్హం. తెలంగాణపై కాంగ్రెస్, బీజేపీ, షర్మిల ఇంతకాలం తెరవెనక సాగిన మంతనాలు.. లోపాయికారి ఒప్పందాలు ఇప్పుడు బహిర్గతమయ్యాయని బిఆర్ఎస్ నేత ఒకరు విమర్శించారు.
తెలంగాణకు కేంద్రం విభజన హామీలు అమలు చేయకున్నా, ఒక్క కొత్త పధకం ఇవ్వకున్నా, నిధుల కేటాయింపులో అన్యాయం చేస్తున్నా బిజెపి నేతలు నోరు విప్పలేక పోయినా కనీసం రాష్ట్ర కాంగ్రెస్ నేతలు, షర్మిల ఒక్కనాడు కూడా విమర్శించక పోవడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.
ఇంతకాలం తెరవెనక సహకరించుకుంటూ, ఫోన్లు చేసుకుంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రదిష్ఠకు గురిచేసేందుకు కుట్రలు చేసిన వీరు ఇప్పుడు బాహాటంగా మాట్లాడుకోవడంలో బయటపడినట్లు స్పష్టం చేస్తున్నారు. దానితో షర్మిల ఫోన్ రాజకీయంగా తమకు ఇబ్బందికరమని ఆలస్యంగా గ్రహించిన బండి సంజయ్ సాయంత్రం కాంగ్రెస్ తో కలిసే ప్రసక్తి లేదంటూ ప్రకటించారు. షర్మిల ఫోన్ చేసిన్నప్పుడే ఉమ్మడి కార్యాచరణకు తిరస్కరించినట్లు చెప్పుకొచ్చారు.