కాంగ్రెస్ ను వదిలివేసి కేసీఆర్ కుటుంబంపై మోదీ దాడి

Saturday, January 18, 2025

కొద్ది రోజుల క్రితం ఖమ్మం వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బిఆర్ఎస్ ను బీజేపీ బి-టీమ్ గా అభివర్ణించారు. ఈ రెండు పార్టీలు ఢిల్లీలో దోస్తీ, గల్లిలో కుస్తీ మాదిరిగా వ్యవహరిస్తున్నాయని కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రచారం రానున్న తెలంగాణ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తున్నది.

అందుకనే, తెలంగాణ బీజేపీ నేతలు సహితం ఢిల్లీ మద్యం కుంభకోణంలో సీఎం కేసీఆర్ కుమార్తె కవితను అరెస్ట్ చేస్తే గాని కేసీఆర్ పై బీజేపీ పోరాటాన్ని ప్రజలు నమ్మరని ఢిల్లీలో పార్టీ పెద్దలకు స్పష్టం చేసినట్లు వార్తలు వచ్చాయి.  దానికి తోడు, కర్ణాటక ఎన్నికల అనంతరం సీఎం కేసీఆర్ సహితం బీజేపీ, ప్రధాని మోదీలపై విమర్శలను తగ్గించి, కాంగ్రెస్ పైననే గురి పెడుతున్నారు.

ఈ పరిణామాలతో తెలంగాణాలో రెండు స్థానంలో ఉన్న బిజెపి మూడే స్థానంలోకి జారిపోయింది. అందుచేత వరంగల్ బహిరంగసభలో కేసీఆర్ కుటుంబాన్ని లక్ష్యం చేసుకొని ప్రధాని మోదీ విమర్శలు గుర్తించారు. కాంగ్రెస్ పేరు ఒకటి, రెండు చోట్ల ప్రస్తావించినా ఆ పార్టీ గురించి పట్టించుకున్నట్లు వ్యవహరించారు. బిఆర్ఎస్ కు ప్రధాన రాజకీయ ప్రత్యర్థి బిజెపి మాత్రమే అనే సంకేతం ఇచ్చే ప్రయత్నం చేశారు.

కొద్దీ రోజుల క్రితం ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం అని అమిత్ షా, జెపి నడ్డా విమర్శలు గుప్పిస్తే, ఇప్పుడు మోదీ సహితం కేసీఆర్ ప్రభుత్వంపై అటువంటి విమర్శలే చేశారు. కేసీఆర్ కు మోదీని తిట్టడం తప్ప మరో పని లేదని చెప్పుకొచ్చారు. 

ఇటీవల కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్ నేత హెచ్ డి కుమారస్వామిపై కూడా అటువంటి విమర్శలు గుప్పించిన ప్రధాని ఇప్పుడు ఆ పార్టీని ఎన్డీయేలోకి చేర్చుకొని ప్రయత్నం చేయడం గమనార్హం. కొద్దీ రోజుల క్రితం మంత్రి కేటీఆర్ సహితం కాంగ్రెస్ నేతలు బిఆర్ఎస్ ను తిడుతున్నారు గాని బిజెపిని, ప్రధాని మోదీని విమర్శించడం లేదే? అని ప్రశ్నించడం గమనార్హం.

తెలంగాణలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటివరకు నాలుగు పనులే చేసిందని ప్రధాని ఎద్దేవా చేశారు. మొదటిది..ఉదయం లేచింది మొదలు మోదీని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు.. మిగతా ఏ పనులు చేయటం లేదని చెప్పారు. ఇక రెండోది.. కుటుంబ పార్టీని పోషించడం. కుటుంబ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు. అన్ని పదవులు కేసీఆర్ కుటుంబానికే ఉన్నాయని చెప్పారు. 

 మూడోది.. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారు. మిగులు నిధులతో ఉన్న తెలంగాణను అప్పుల తెలంగాణ చేశారని ధ్వజమెత్తారు. ఇక నాలుగోది.. బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. ప్రతి పనిలోనూ అవినీతి జరుగుతోంది. అవినీతి ఆరోపణలు లేని ప్రాజెక్టు ఒక్కటి కూడా లేదని తీవ్ర విమర్శలు చేశారు. తన 9 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ చేసింది ఈ నాలుగు పనులే అని ఆరోపించారు.

దాదాపు ప్రతి రాష్ట్రంలో అక్కడున్న బీజేపీయేతర ప్రభుత్వంపై ప్రధాని ఇటువంటి విమర్శలే చేస్తుండటం గమనార్హం. ఒక విధంగా ఆయనకు పడికట్టు పదాలుగా మారాయి. తెలంగాణాలో ఒక వంక బిజెపి, మరోవంక కాంగ్రెస్ తామే బిఆర్ఎస్ ను ఓడించగలిగిన ప్రత్యర్థులమని చెప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల దృష్టిలో ఎవ్వరు కేసీఆర్ ను ఓడిస్తారని ఉంటె వారికే జనం పట్టం కట్టే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ప్రధాని మోదీ సహితం ఈ దిశలో ప్రయత్నాలు ప్రారంభించినట్లు కనిపిస్తుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles