కాంగ్రెస్ తో పొత్తుకై కేసీఆర్ తహా, తహా!

Wednesday, January 22, 2025

టిపిసిసిలో రేవంత్ రెడ్డి నాయకత్వంపై సీనియర్లు `తిరుగుబాటు’ ప్రకటించడానికి అసలు కారణం కేసీఆర్ తో దోస్తీకి అడ్డుగా ఉండటమే అని వెల్లడవుతుంది. పడిపోతున్న తన గ్రాఫ్ ను కాపాడుకోవడం కోసం కాంగ్రెస్ తో పొత్తుకోసం కేసీఆర్ తీవ్రంగా చేస్తున్న ప్రయత్నాలకు ఈ సీనియర్లు వత్తాసు పలుకుతుండగా, రేవంత్ బృందం ససేమిరా అంటుండటమే వారి మధ్య నెలకొన్న అగాధంకు కారణంగా చెబుతున్నారు. 

కొంత కాలం క్రితం కేసీఆర్ పాట్నా వెళ్లి, సీఎం నితీష్ కుమార్ ను కలిసింది కూడా కాంగ్రెస్ తో రాయబారం కోసమే అని, కేసీఆర్ కోర్కె మేరకే ఆ తర్వాత నితీష్ ఢిల్లీ వెళ్లి, రాహుల్ గాంధీని కలసి కేసీఆర్ తో పొత్తుకోసం ఒప్పించే ప్రయత్నం చేశారని తెలుస్తున్నది. అయితే అందుకు రాహుల్ అంతగా ఆసక్తి చూపకపోవడంతో, ఆ ప్రయత్నాలు ముందు వెళ్ళలేదు. 

సీనియర్ల ఒత్తిడి మేరకు ఈ విషయమై కాంగ్రెస్ అధిష్ఠానం రేవంత్ అభిప్రాయం అడిగితే, అందుకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేయడంతో అతని పట్ల ఆగ్రహంతో ఉన్నారని వెల్లడవుతుంది. మొన్నటి వరకు తెలంగాణ ఇన్ ఛార్జ్ గా ఉన్న మాణిక్ ఠాకూర్ సహితం ఏఐసీసీకి ఇచ్చిన నివేదికలో కేసీఆర్ తో పొత్తు గురించి ప్రస్తావించినట్లు చెబుతున్నారు. 

 తెలంగాణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ బిఆర్ఎస్- కాంగ్రెస్ ల మధ్య తెరవెనుక జరుగుతున్న ఈ కుమ్మక్కు రాజకీయాలను స్వయంగా బహిర్గతం చేశారు.  తెలంగాణ కాంగ్రెస్‌లోని కొంతమంది సీనియర్లు తొమ్మిది నెలల క్రితం బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు ప్రతిపాదనను ఏఐసీసీ ముందు పెట్టారని ఆయన తెలిపారు.

 బీఆర్ఎస్‌తో పొత్తుపై ఏఐసీసీ తమ అభిప్రాయాలను అప్పట్లో కోరిందని, అప్పట్లో తాము వద్దని చెప్పినట్లు చెప్పారు.  అంటే బిఆర్ఎస్ తో పొత్తుకు అడ్డంకిగా ఉన్నాడనే సీనియర్ కాంగ్రెస్ నేతలు పలువురు అతను టిపిసిసి అధ్యక్షుడుగా చేపట్టే ఎటువంటి కార్యక్రమంలో పాల్గొనబోమని అంటూ భీష్మ ప్రతిజ్ఞ చేసిన్నట్లు స్పష్టం అవుతుంది. 

ఇప్పటివరకు రాష్ట్రంలో కేసీఆర్ ఓడిపోతే తామే అధికారంలోకి వస్తామని ఆశతో కాంగ్రెస్ నేతలు కాలం నెట్టుకొంటూ వస్తున్నారు. అయితే, ఇప్పుడు కాంగ్రెస్ ను పక్కకు నెట్టి,  ప్రధాన ప్రతిపక్ష స్థాయికి ఎదగడమే కాకుండా, కేసీఆర్ ను సహితం గద్దె దించేందుకు బిజెపి బృహత్తర ప్రయత్నాలు చేస్తుండడంతో నిరాశ, నిస్పృహలకు గురవుతున్న కాంగ్రెస్ నేతలు కేసీఆర్ తో చేతులు కలిపేందుకు సిద్ధపడినట్లు వెల్లడి అవుతుంది. 

తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని గతంలో హామీ ఇచ్చిన కేసీఆర్ ఆ తర్వాత మాటమార్చడమే కాకుండా, తెలంగాణాలో కాంగ్రెస్ నుండి పెద్ద ఎత్తున ఫిరాయింపులను ప్రోత్సహించి, రాష్ట్రంలో కాంగ్రెస్ మనుగడను ప్రశ్నార్ధకం చేయడంతో రాహుల్ కొంత అయిష్టంగా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, కాంగ్రెస్ లో పలువురు పెద్దలు మాత్రం తరచుగా బిజెపికి వ్యతిరేకంగా కేసీఆర్, కాంగ్రెస్ ఒకటి కావాలని అంటూనే ఉన్నారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles