ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వంకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందిస్తున్న మద్దతు వ్యూహాత్మకమే తప్ప, శాశ్వతం కాబోదని తాజాగా వైసిపి పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి చేస్తున్న వాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. అవసరమైతే, అధికారంకు దగ్గరలోకి వస్తే కాంగ్రెస్ కు సహితం మద్దతు ఇచ్చేందుకు జగన్ వెనుకాడబోరనే సంకేతం ఇచ్చినట్లయింది.
2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మంగళవారం ఒకవంక బెంగుళూరులో ప్రతిపక్షాలు, మరోవంక ఢిల్లీలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే పక్షాలు భేటీ జరుపుతున్న సమయంలో ఈసారి 2024లో ఢిల్లీకి వెళ్లే మార్గం ఏపీ గుండా వెళుతుందని విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పైగా, వైయస్సార్సీపి మద్దతుతోనే ప్రభుత్వం ఏర్పాటు చేయడం కేంద్రంలో సాధ్యమవుతుందని స్పష్టం చేస్తూ ట్వీట్ చేశారు. అంటే, కేంద్రంలో హంగ్ పార్లమెంట్ ఏర్పడే అవకాశం ఉందని, వైసిపి `కింగ్ మేకర్’ పాత్ర వహించబోతుందనే ధృడమైన విశ్వాసం వ్యక్తం చేసినట్లయింది.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆశీర్వాదాలు, ప్రజాదరణ పొందిన ఓటు బ్యాంక్ ఉందని చెబుతూ జాతీయ మీడియాతో సహా ఇప్పటివరకు చేసిన అన్ని సర్వేలు వైఎస్సార్‌సీపీ మళ్లీ ఘనవిజయం సాధిస్తుందని సూచిస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. అంటే, ఒక విధంగా దేశంలో స్థిరమైన రాజకీయ ఆధిపత్యం గల పార్టీ తమదే అని చెప్పిన్నట్లైనది.
దేశ రాజకీయాలను కీలక మలుపు తిప్పడంలో వైసీపీ పాత్ర తప్పనిసరిగా ఉంటుందని, ఏ కూటమి కైనా వైసిపి అవసరం ఉందని, అంతగా వైసిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎదిగిందని విజయ సాయి రెడ్డి ట్వీట్ చేశారు. ప్రస్తుతం సాయి రెడ్డి చేసిన ఈ ట్వీట్ రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చకు కారణంగా మారింది.
కేంద్రంలో తమకు సొంతంగా మెజారిటీ రాలేని పక్షంలో అండగా ఉంటారనే ఉద్దేశ్యంతోనే వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి సిబిఐ కేసుల విషయంలో, ఇతరత్రా మోదీ ప్రభుత్వం అండగా అంటూ వస్తున్నది. ఒక విధంగా `అప్రకటిత’ మిత్రపక్షంగా బీజేపీలో అసలు మిత్రపక్షాలకన్నా ఎక్కవ రాచమర్యాదలు వైఎస్ జగన్ పొందుతున్నారు. బిజెపి ముఖ్యమంత్రులకు మించి ప్రధాని మోదీ, హోమ్ మంత్రి అమిత్ షాల వద్ద జగన్ పలుకుబడి కొనసాగుతుంది.
అయితే, అంతమాత్రం చేత తాము ఎప్పటికి ఆ పార్టీకి మద్దతుగా ఉంటామని అనుకోవచ్చనే సున్నితమైన హెచ్చరిక సహితం విజయసాయిరెడ్డి ట్వీట్ లో వ్యక్తం అవుతుంది. గతంలో ముఖ్యమంత్రి పదవి ఇవ్వకుండా అవమానించినందుకు కాంగ్రెస్ పై తిరుగుబాటు చేసి పార్టీ ఏర్పాటు చేసి, అధికారంలోకి వచ్చిన జగన్ అప్పటి నుండి ఆ పార్టీతో ఎటువంటి సంబంధాలు పెట్టుకోవడం లేదు.
అయితే, బిజెపితో పాటు ప్రతిపక్షాల కూటమి కూడా వచ్చే ఎన్నికలలో సీట్లు గెల్చుకొంటే బిజెపి కన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు జగన్ సుముఖత వ్యక్తం చేసే అవకాశం లేకపోలేదని అభిప్రాయం ఈ సందర్భంగా బలపడుతుంది. కేవలం మైనారిటీలు, ఎస్సిల మద్దతు తగ్గుతుందనే భయంతోనే బిజెపితో నేరుగా పొత్తు పెట్టుకొని, ఎన్డీయేలో భాగస్వామిగా చేరేందుకు వైఎస్ జగన్ వెనుకడుగు వేస్తున్నారు.
కర్ణాటక ఎన్నికల్లో 1989 తర్వాత మొదటిసారిగా మైనారిటీలు మూకుమ్మడిగా కాంగ్రెస్ కు ఓటు వేశారు. ఆ ప్రభావం ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరిస్తుందా అన్నది 2024 ఎన్నికల్లో గాని తెలియదు. అదే జరిగితే బిజెపితో కన్నా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం రాజకీయంగా జగన్ కు ఉపయోగకారిగా ఉండే అవకాశం ఉంది.
మరోవంక, క్రైస్తవ వర్గాలతో జగన్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి సహితం వారు అండగా ఉంటున్నారు. ఈ అంశం కూడా జగన్ ను కాంగ్రెస్ కు దగ్గరకు తీసుకు రావచ్చని పలువురు భావిస్తున్నారు. ఇప్పటికే జగన్ సోదరి వైఎస్ షర్మిల సోనియా కుటుంభంకు దగ్గరవుతూ ఉండటం గమనార్హం.