ఒక వంక కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణ కాంగ్రెస్ లో జోష్ కనిపిస్తుంది. ఈ నెలాఖరుకల్లా తొలి విడత అభ్యర్థుల ప్రకటనకు సహితం కసరత్తు చేస్తున్నారు. ఏఐసీసీ ఇప్పటికే ఎన్నికల కమిటీలు నియమించింది. అయితే, అందరూ కలిసి పనిచేస్తేనే అధికారంలోకి వస్తామని ఏఐసీసీ నేతలు స్పష్టం చేస్తున్నారు. కానీ సీనియర్ల పంచాయతీలు తేలడం లేదు.
ఎవ్వరికీ వారుగా తామే ముఖ్యమంత్రి అభ్యర్థి అన్నట్లు పంచాయతీలు పెట్టుకొంటున్నారు. ఇతరులపై వీలు చిక్కిన్నప్పుడల్లా ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ కుమ్ములాటలతో విసుగు చేసిన ఏఐసీసీ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ ను పంపింది.
శనివారం హైదరాబాద్ వచ్చిన ఆయన సీనియర్ల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గాంధీభవన్‌లో జరిగిన సమావేశంలో ఆయన సీనియర్ నాయకులను తీవ్రంగా మందలిస్తూ హితోక్తులు చెప్పే ప్రయత్నం చేశారు. సీనియర్ నేతలు ఒకరిపై ఒకరు నిందారోపణలు చేసుకోకుండా, సమష్టిగా కలిసికట్టుగా పనిచేయాలని హితవు పలికారు.
కెసి వేణుగోపాల్ సమక్షంలోనే మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తనకు వ్యతిరేకంగా జరుగుతున్న దుష్పచారంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొందరు సీనియర్ నేతలు తనను టార్గెట్ చేశారని మరోసారి ఫిర్యాదు చేశారు. మండల కమిటీలపైనా వేణుగోపాల్ సమక్షంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నాయకుల మధ్య మాటల యుద్ధం జరిగినట్లు తెలిసింది. దాదాపు అరగంట సేపు నేతల మధ్య పరస్పర నిందారోపణలు, దూషణలు జరిగాయని తెలిసింది.
దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు కెసి వేణుగోపాల్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కొద్దీ రోజుల క్రితం పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే వద్ద జరిగిన సమావేశంలో సహితం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇదే పంచాయతీ పెట్టారు. ఆ మధ్య ఆయన పార్టీ మారుతున్నట్లు విశేష ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారం అంతా పార్టీలోని కొందరి సృష్టి అంటూ పరోక్షంగా టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఆక్రోశం వెళ్లగక్కారు. అయితే అభ్యర్థుల స్క్రీనింగ్ కమిటీలో రేవంత్, భట్టి విక్రమార్కలతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా వేయడం పార్టీ వర్గాలలో రగడ చెలరేగుతుంది.
సాధారణంగా పిసిసి అధ్యక్షుడు, సీఎల్పీ అధ్యక్షులను ఈ కమిటీలో నియమించడం పరిపాటి. కానీ మాజీ పిసిసి అధ్యక్షునిగా ఉత్తమ్ కుమార్ ని నియమించారు అనుకుంటే పొన్నాల లక్ష్మయ్యను కూడా నియమించాలి గదా? అనే ప్రశ్న తలెత్తుతుంది. ఉత్తమ్ ను నియమించి తనను పక్కన బెట్టడం సహజంగానే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తట్టుకోలేక పోతున్నాను.
ఏదేమైనా వచ్చే నెల రోజుల పాటు క్షేత్రస్థాయిలో ఉండాలని వేణుగోపాల్ వారి ముందో కార్యక్రమం ఉంచారు. ఈ సమయంలో నాలుగు చోట్ల బహిరంగసభలు జరపాలని కూడా చెప్పారు. ఈ సభలలో జాతీయ నాయకులు పాల్గొంటారని తెలిపారు. పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కొనుగోలు ఇచ్చిన సర్వే నివేదికలో ఇప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ కేవలం 41 సీట్లలో మాత్రమే గెలిచే అవకాశం ఉందని చెప్పిన్నట్లు తెలుస్తున్నది. ఈ గ్రాఫ్ పెంచుకోవాలంటే ఉమ్మడిగా పనిచేయాల్సిన తరుణంలో సీనియర్ నేతల పంచాయతీలు ప్రశ్నార్థకంగా మారాయి.