కాంగ్రెస్ కట్టడి కోసం కవితపై చర్య తప్పదా!

Friday, November 22, 2024

కర్ణాటక ఎన్నికల అనంతరం తెలంగాణాలో రాజకీయ పరిస్థితులు తలకిందులయ్యాయి. అంతర్గత కుమ్ములాటలతో  ఉనికి ప్రశ్నార్థకంగా మారిన కాంగ్రెస్ లో ఒకేసారి జోష్ వచ్చింది. మొన్నటి వరకు బీజేపీలో చేరేందుకు క్యూ కట్టిన ఇతర పార్టీల నేతలు ఇప్పుడు ఆ పార్టీ వైపు చూస్తున్నారు. అంతేకాదు బీజేపీలో ఇంకెవ్వరు మిగులుతారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ పరిస్థితులలో ఖంగారు పడిన బిజెపి అగ్రనాయకత్వం వరుసగా `అసమ్మతి’ నేతలను పిలిచి మాట్లాడుతుంటే వారికి ఒకే ఒక మాట వినిపిస్తున్నది. బిజెపి- బిఆర్ఎస్ కుమ్ముక్కు రాజకీయాలు నడుపుతోందని సామాన్య జనం అనుకొంటున్నారని చెబుతున్నారు. అందుకు ప్రధాన కారణం ఢిల్లీ మద్యం కుంభకోణంలో నిండా మునిగినదని చెప్పిన, రేపో-మాపో అరెస్ట్ కాబోతుందని ప్రచారం జరిపిన కేసీఆర్ కుమార్తె కవితను కేంద్ర దర్యాప్తు సంస్థలు వదిలివేయడం.

ఈ అంశాన్ని కాంగ్రెస్ పెద్ద ప్రచార అస్త్రంగా మార్చుకుంటుంది. ఈ రెండు పార్టీలది ఫెవికాల్ బంధమని, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవిత  అరెస్ట్ అవ్వకపోవడమే ఇందుకు నిదర్శనమంటూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నది. ఇటువంటప్పుడు మొదటిసారిగా స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కేసీఆర్, కవిత పేర్లను ప్రస్తావించడం తెలంగాణ రాజకీయాలలో కలకలం రేపుతోంది.

ఇదివరకు తెలంగాణ పర్యటనలలో కేసీఆర్ పై విమర్శలు కురిపించినా ఎప్పుడూ పేరును నేరుగా ప్రస్తావించలేదు. ఇప్పుడు కేసీఆర్ బిడ్డ గెలవాలంటే బీఆర్ఎస్‌కు ఓటు వేయండి అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశ ప్రజలు గెలవాలంటే బీజేపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. పైగా, ఈ వాఖ్యాలను తెలంగాణ పర్యటనలో కాకుండా ఎక్కడో భోపాల్ లో జరిగిన బీజేపీ కార్యక్రమంలో చేశారు.

మరోకొద్దీ నెలలో తెలంగాణ ఎన్నికలు ఉన్నందున ప్రధాని ఉద్దేశ్యపూర్వకంగా తెలంగాణ ప్రజలకు ఓ సందేశం పంపేందుకు ఈ విమర్శలు చేసిన్నట్లు స్పష్టం అవుతుంది. బిఆర్ఎస్ తో లోపాయికారి సంబంధం ఉందంటే ఒక్క సీటు కూడా గెలుపొందలేమని మూడు రోజుల క్రితం అమిత్ షా, జేపీ నడ్డలను కలిసిన ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి స్పష్టం చేయడం గమనార్హం.

మరోవంక, ఇదే సమయంలో మహారాష్ట్రలో ఓ బహిరంగభలో మాట్లాడుతున్న బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ తమ పార్టీ ఎవ్వరికి `ఎ టీం లేదా బి టీం’ కాదంటూ, తాము `రైతుల టీం’ అని ప్రకటించడం గమనార్హం. బిజెపితో తమకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేందుకే ఆయన ఈ వాఖ్య చేశారు.

అయితే, ప్రధాని మోదీ తెలంగాణాలో బిజెపి పుంజుకోవాలని కేసీఆర్ కుమార్తెను లక్ష్యంగా చేసుకొని మాట్లాలేదని తెలుస్తున్నది. అదేవిధంగా, బిజెపిని ఎండగొట్టడం కోసం కేసీఆర్ కూడా ఆ పార్టీ ప్రస్తావన తీసుకోలేదు. వీరిద్దరూ తెలంగాణాలో కాంగ్రెస్ బలపడకుండా చేసేందుకు మైనారిటీ ప్రజలకు సందేశం పంపేందుకు `కూడబలుక్కున్నట్లు’ ఒకేరోజు ఇటువంటి వాఖ్యలు చేశారని పరిశీలకులు భావిస్తున్నారు.

ఇప్పటికే ఎక్కువ సీట్లకు పోటీచేస్తామని మజ్లీస్ నేత అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించడంతో ముస్లింల ఓట్లు ఎక్కడ జారిపోతాయనే ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇటీవల కర్ణాటక ఎన్నికలలో హాంగ్ అసెంబ్లీ ఏర్పడితే ఎన్నికల అనంతరం పరస్పరం మద్దతు ఇచ్చుకొనేందుకు బిజెపి – జేడీఎస్ ల మధ్య ఒప్పందం కుదిరిందని ప్రచారం జరిగింది. దానితో ఆ పార్టీకి మద్దతుగా ఉన్న ముస్లింలు సహితం మూకుమ్మడిగా కాంగ్రెస్ కు ఓటు వేశారు.

కర్ణాటక ఫలితాలు తెలంగాణాలో సహితం ముస్లిం వర్గాలను కాంగ్రెస్ కు సానుకూలంగా మార్చే అవకాశం ఉందని భయపడుతున్నారు. అందుకనే కేసీఆర్ బిజెపితో కుమ్మక్కయ్యారని అంటే మొత్తం ముస్లింలు కాంగ్రెస్ కు మూకుమ్మడిగా ఇక్కడ కూడా ఓటు వేసే ప్రమాదం ఉంది. అటువంటి ప్రమాదం బిఆర్ఎస్ కు ఏర్పడకుండా చేసేందుకే మోదీ కేసీఆర్ కుమార్తె ఇరుక్కున్న ఢిల్లీ మద్యం కుంభకోణం గురించి ప్రస్తావించారని ప్రచారం జరుగుతుంది. అవసరమైతే కవితను ఎన్నికల ముందు అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles