మరో ఎనిమిది నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో వరుసగా మూడోసారి పార్టీని విజయం వైపు నడిపించి, కుమారుడు కేటీఆర్ కు ముఖ్యమంత్రి పదవిని అప్పచెప్పి తాను జాతీయ రాజకీయాలపై దృష్టి సారించాలని ఎదురు చూస్తున్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఒక వంక కుమార్తె, మరోవంక కుమారుడు వివాదాలలో చిక్కుకోవడంతో ఉక్కిరి, బిక్కిరి అవుతున్నారు.
రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలా పేర్లు వస్తున్నా వారు ఎన్నికలలో పార్టీ నిధులకోసం ముడుపులు స్వీకరించినట్లు మాత్రమే కేంద్ర దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. వ్యక్తిగతంగా ఎటువంటి ప్రయోజనం పొందుతున్నట్లు మాత్రం చెప్పడం లేదు.
కానీ, కవిత మాత్రం కేవలం స్వార్థం కోసం ఈ కుంభకోణంలో కీలక పాత్ర వహించారని, మొత్తం ఆదాయంలో దాదాపు మూడోవంతు ఆమె వాటానే అని దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. బిఆర్ఎస్ ద్వారా జాతీయ రాజకీయాలలో కీలక పాత్ర వహించేందుకు ప్రయత్నిస్తున్న కేసీఆర్ కు కవితపై వచ్చిన ఆరోపణలు ఇబ్బందికరంగా తయారైనట్లు తెలుస్తున్నది. ఇతర పార్టీలలో ఆయన ప్రతిష్టకు దెబ్బతగిలిన్నట్లే అని పలువురు భావిస్తున్నారు.
మరోవంక, టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీక్‌కు సంబంధించి ప్రతిపక్షాలు కేటీఆర్ ను కేంద్రంగా చేసుకొని తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నాయి. ఇప్పటికే తొమ్మిదేళ్లుగా ఉద్యోగ నియామకాలు చేపట్టడం లేదని యువత కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న సమయంలో ఎన్నికలకు ముందు కొందమందికైనా ఉద్యోగాలిచ్చే సంతృప్తి పరచే ప్రయత్నం చేస్తున్న కేసీఆర్ కు ఈ పేపర్ లీక్ తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది.
పైగా, కేటీఆర్ ఈ మొత్తం వ్యవహారంలో దోషిగా ఆరోపణలు ఎదుర్కోవడం ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని కేసీఆర్ ఆందోళన చెందుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో కీలక సూత్రధారిగా భావిస్తున్న రాజశేఖర్ బిజెపి వ్యక్తి అంటూ కేటీఆర్ చేసిన ఆరోపణలను ఎవ్వరు పెద్దగా పట్టించుకోవడం లేదు.
అధికార పార్టీలోని కీలక వ్యక్తుల అండదండలు లేకుండా అంత ధైర్యంగా ఇంతటి భారీ అక్రమాలకు పాల్పడే అవకాశాలు లేవని భావిస్తున్నారు. వాస్తవాలు ఏవిధంగా ఉన్నప్పటికీ ఎన్నికల సమయానికి కవిత, కేటీఆర్ ఈ విధమైన ఆరోపణలతో ఉండటం అధికార పక్షానికి తీవ్రమైన చిక్కులు కలిగించే అంశంగా స్పష్టం అవుతుంది.