కవిత అరెస్ట్ భయంతో కేసీఆర్ మహారాష్ట్ర దాటి వెళ్లడం లేదా!

Sunday, December 22, 2024

బీఆర్ఎస్ ను దేశవ్యాప్తంగా విస్తరిస్తానని, పలు రాష్ట్రాల్లో ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్ గత డిసెంబర్ లో గుజరాత్ ఎన్నికలలో అక్కడ తెలుగువారున్న నియోజకవర్గాలున్నా అటువైపు కన్నెత్తి చూడలేదు. కర్ణాటక నుండి తమ జైత్ర యాత్ర ప్రారంభం అవుతుందని, కర్ణాటక ఎన్నికలలో పోటీ చేస్తామని ప్రకటించిన ఆయన ఇప్పుడు అక్కడ ఎన్నికలు జరుగుతుంటే అటువైపే వెళ్లడం లేదు.

కర్ణాటకలో జేడిఎస్ తో కలసి పోటీ చేస్తున్నామని, ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని స్వయంగా కేసీఆర్ ప్రకటించారు.  కానీ ఒక్క అభ్యర్థిని కూడా నిలబెట్టలేదు. కేవలం మహారాష్ట్ర పైన మాత్రమే దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే అక్కడ రెండు బహిరంగసభలలో ప్రసంగించిన కేసీఆర్ సోమవారం శంభాజీనగర్ (ఔరంగాబాద్‌) లో బీఆర్ఎస్ మూడో బహిరంగ సభ జరుపుతున్నారు.

ఇప్పటికే ఫిబ్రవరి 5న నాందేడ్‌లో, మార్చి 26న చిన్న తాలుకా కేంద్రమైన లోహలో జరిగిన బహిరంగ సభలలో కేసీఆర్ ప్రసంగించారు.  జాతీయ పార్టీగా పలు రాష్ట్రాలకు వెళ్లతామన్న కేసీఆర్ కేవలం మహారాష్ట్రకు పరిమితం కావడం పలువురికి విస్మయం కలిగిస్తోంది.

పైకి, బిజెపిపై తన పోరాటం అని, రైతు-వ్యతిరేకి నరేంద్ర మోదీ సర్కార్ ను దించి `కిసాన్ సర్కార్’ తెస్తానని అంటూ ఎన్ని మాటలు చూపినా బిజెపికి వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధంగా లేరని స్పష్టం అవుతుంది. రాజకీయంగా బిజెపికి నష్టం కలిగించేటట్లు చేస్తే ఇప్పటికే ఢిల్లీ మద్యం కేసులో నిండా మునిగిన కుమార్తె కవితను ఎక్కడ అరెస్ట్ చేస్తారో అనే భయంతో ఉన్నట్లు పలువురు భావిస్తున్నారు.

కర్ణాటకలో పోటీచేస్తే కాంగ్రెస్ వ్యతిరేక ఓట్లలో చీలిక తీసుకొచ్చి, బిజెపికి  నష్టం కలిగించవచ్చనే ఎన్నికలకు దూరంగా ఉన్నట్లు కనిపిస్తున్నది. ఈ విషయంలో బిజెపి వత్తిడులకు కేసీఆర్ లొంగిపోయి ఉంటారనే అభిప్రాయం బలపడుతుంది. మరోవంక, మహారాష్ట్రలో కేసీఆర్ కేవలం గ్రామీణ ప్రాంతాలకు, వ్యవసాయ వర్గాలపైననే దృష్టి సారిస్తున్నారు.

ఈ వర్గాలలో బిజెపి పట్ల వ్యతిరేకత ఉంది. వారి ఓట్లను కేసీఆర్ ఎంతగా చీలిస్తే బిజెపికి అంతగా ప్రయోజనం. అందుకనే బీజేపీ వ్యతిరేక ఓట్లను చీల్చడం కోసమే కేసీఆర్ మహారాష్ట్రపై దృష్టి సారిస్తున్నట్లు స్పష్టం అవుతుంది. ఏదో విధంగా అసెంబ్లీ ఎన్నికల వరకు కవిత అరెస్ట్ కాకుండా చూస్తే, ఆ తర్వాత రాజకీయాలు వేరుగా అంటాయిలే అని అభిప్రాయంలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తున్నది.

కర్ణాటకలో నామినేషన్ల ఘట్టం ముగిసి, ఎన్నికల ప్రచారం ప్రారంభమైనా, మిత్రపక్షమైన జేడీఎస్ అధినేత హెచ్ డి కుమారస్వామి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినా ఇప్పటివరకు కేసీఆర్ కనీసం ఎటువంటి ప్రకటన చేయక పోవడం, కనీసం ఫోన్ లో పరామర్శించే ప్రయత్నం చేయక పోవడం, జేడీఎస్ కు మద్దతు ప్రకటించక పోవడం గమనార్హం.

బిఆర్ఎస్ ప్రారంభించక ముందు నుండే  కేసీఆర్ తో రాజకీయంగా కలిసి తిరుగుతున్న ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ సహితం ఈ మధ్య కేసీఆర్ తో గాని, బిఆర్ఎస్ లో గాని ఎక్కడా కనిపించడం లేదు. కేసీఆర్ అవకాశవాదం అర్థం కావడంతో వీరంతా దూరంగా ఉంటున్నారా? అనే అనుమానం కలుగుతుంది.

తెలంగాణాలో అధికారంలోకి వస్తామని బిజెపి నేతలు ఎంతగా ప్రగల్భాలు పలుకుతున్నప్పటికీ ప్రస్తుతం ఉన్న నాలుగు ఎంపీ సీట్లను కాపాడుకోవడమే కాశమనే అభిప్రాయం ఉంది. అందుకనే బిఆర్ఎస్ కు ప్రత్యామ్న్యాయం బిజెపి మాత్రమే అనే అభిప్రాయం కలిగించడం ద్వారా కాంగ్రెస్ బలపడకుండా అడ్డుకొనేందుకు రెండు పార్టీల నేతలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని అభిప్రాయం కూడా బలంగా ఉంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles