ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అవినీతి కేసులలో అరెస్ట్ చేయబోతున్నారని అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు, గత ఎన్నికలలో ఆమెను ఓడించిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంవత్సరంకు పైగా హడావిడి చేస్తున్నారు.
ఇంతలో ఢిల్లీ మద్యం కుంభకోణం వెలుగులోకి రావడం, దాని మూలాలు హైదరాబాద్ లోనే ఉండడంతో కవిత సూత్రధారి అని, ఈ కేసులో ఆమె అరెస్ట్ తధ్యం అంటూ తెలంగాణ బీజేపీ నేతలు ప్రచారం చేశారు. పైగా, ఈ కేసులో కవిత పిఎతో పాటు ఆమెకు సన్నిహితులైన పలువురిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు సోదాలు చేయడం, ప్రస్తుతం అరెస్ట్ అయినా బోయినపల్లి అభిషేక్ సహితం ఆమెకు సన్నిహితుడే అనే ప్రచారం సాగింది.
మధ్యలో ఆమె కొన్ని రోజులు కనిపించక పోవడం, టీఆర్ఎస్ ను జాతీయ పార్టీ బిఆర్ఎస్ గా మార్చిన కీలక సమావేశంలో సహితం ఆమె కనిపించకపోవడంతో అరెస్ట్ తప్పించుకోవడం కోసం ఆమె ఎక్కడెక్కడో తిరుగుతున్నారని కూడా చెప్పుకొచ్చారు. మునుగోడు ఉపఎన్నిక సమయంలోనే ఆమె అరెస్ట్ కానున్నారని పలువురు భావించారు.
అయితే, సీబీఐ ఢిల్లీ మద్యం కుంభకోణంలో శుక్రవారం ఢిల్లీ కోర్టులో దాఖలు చేసిన 10,000 పేజీల తొలి ఛార్జ్ షీట్ లో కవితకు సంబంధించిన ప్రస్తావన ఎక్కడ లేకపోవడం, కనీసం ఇప్పటి వరకు ఆమెను విచారణకు కూడా పిలవక పోవడంతో ఈ మొత్తం కేసును పర్యవేక్షిస్తున్న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఇప్పుడే ఆమెను అరెస్ట్ చేయడం రాజకీయంగా దుష్ఫలితం కలిగించగలదని వేనుకడుగు వేస్తున్నారా? అనే అనుమానాలకు దారితీస్తున్నది.
కేసీఆర్ ప్రభుత్వం దూకుడుగా ముందుకు పోతున్న ఎమ్యెల్యేల కొనుగోలు కేసు ఢిల్లీ మద్యం కుంభకోణం కన్నా రాజకీయంగా ప్రమాదకారి కాగలదని బిజెపి కేంద్ర నాయకత్వం భావిస్తూ ఉండడమే కవిత విషయంలో తొందరపాటు ప్రదర్శింప పోవడానికి కారణంగా పలువురు భావిస్తున్నారు. పైగా, ఈ కేసులో కీలక లక్ష్యమైన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా పేరు సహితం ఛార్జ్ షీట్ లో లేకపోవడం గమనార్హం.
తనను అరెస్ట్ చేసి, గుజరాత్ ఎన్నికలలో ప్రచారంకు వెళ్లకుండా చేయాలనీ బిజెపి చూస్తున్నాడని సిసోడియా విచారణకు పిలిచినప్పుడు ఎంతో హడావుడి చేశారు. అయితే ఛార్జ్ షీట్ లో నిందితుల జాబితాలో ఆయన పేరు లేదు. సిసోడియాతో పాటు కవితను కూడా నిందితులుగా చేర్చడంకు ప్రస్తుతం ఉన్న సాక్ష్యాధారాలు సరిపోవని న్యాయనిపుణులు భావించడమే కారణంగా తెలుస్తున్నది.
ఎమ్యెల్యేల కొనుగోలు కేసులో ఇప్పటికే బీజేపీ కీలక నేత బిఎస్ సంతోష్ ను నిందితునిగా పేర్కొనడం, ఆయనను అరెస్ట్ చేయడం కోసం తెలంగాణ హైకోర్టు అనుమతిని రాష్ట్ర ప్రభుత్వం కోరడంతో ఈ పరిణామం ఎటువైపు వేయుదుతుందో అని బిజెపి కేంద్ర నాయకత్వం వేచిచూసే ధోరణి ఆవలంభిస్తున్నట్లు స్పష్టం అవుతున్నది. ఆగష్టు 5 వరకు సిట్ ఇచ్చిన సమన్లపై సంతోష్ హైకోర్టు నుండి స్టే ఉత్తరువు పొందగలిగిన, ఈ లోగా తెలంగాణ పోలీసులు ఎటువంటి చర్యకు ఉపక్రమిస్తారో అన్నది అంతుపట్టకుండా ఉంది.
సంతోష్ అరెస్ట్ ను వాయిదా చేయించగలం గాని, నివారింపలేమనే ఆందోళన బిజెపి నేతలలో కనిపిస్తున్నది. ఇటువంటి సమయంలో కవితను అరెస్ట్ చేసే `కక్షసాధింపు’ చర్యగా జనంలో ప్రచారం జరిగే అవకాశం ఉన్నదని, అదే జరిగితే టిఆర్ఎస్ కు రాజకీయంగా ప్రయోజనం కలిగించే అవకాశం లేకపోలేదనే సందేశం వారిలో వ్యక్తం అవుతున్నది.
అందుకనే, మొన్నటి వరకు మద్యం కేసు గురించి మౌనంగా, ఆత్మరక్షణ ధోరణిలో కనిపించిన కవిత గత వారం న్యాయపరంగా ఆ కేసును ఎదుర్కొంటానని ధైర్యంగా చెప్పడం గమనార్హం. మరోవంక, ఈ కేసులో కవితను కనీసం విచారణకైనా పిలవని పక్షంలో ఇప్పటి వరకు తాము కేసీఆర్ ప్రభుత్వంపై చేస్తున్న అవినీతి ఆరోపణలు పసలేని వనే సంకేతం ప్రజలకు వెళ్లే ప్రమాదం ఉందని తెలంగాణ బీజేపీ నేతలు ఆందోళన చెందుతున్నారు.
అంతేకాకుండా, టిఆర్ఎస్ – బిజెపి తోడు దొంగలని, ఒకరికొక్కరు ఆరోపణలు చేసుకోవడమే గానీ ముందుకు వెళ్లారని కాంగ్రెస్ చేస్తున్న విమర్శలకు బలం చేకూర్చే అవకాశం ఉందని సహితం భయపడుతున్నారు.