ఢిల్లీ మద్యం కుంభకోణంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు వేగంగా కదులుతూ, వరుసగా అరెస్టులు చేస్తుండడంతో సీఎం కేసీఆర్ కుమార్తె, బిఆర్ఎస్ ఎమ్యెల్సీ కవితను ఇప్పుడు అరెస్ట్ భయం వెంటాడుతున్నట్లు కనిపిస్తున్నది. ఆదివారం రాష్ట్ర శాసనమండలిలో ఆమెను చూసిన వారందరికీ ఆమె ఎంతో దిగులుగా, అన్యమనస్కంగా, ఆందోళనకరంగా ఉన్నట్లు స్పష్టం అవుతుంది.
ఆమెను సిబిఐ లేదా ఈడీ ఎప్పుడైనా మరోసారి దర్యాప్తుకు పిలవచ్చని, ఈ సారి నేరుగా ఢిల్లీకే పిలిచి, ఆ సమయంలోనే అరెస్ట్ చేయవచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. తాజాగా అరెస్ట్ అయినా వైసిపి ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కుమారుడు రాఘవ రెడ్డి, ఆమె మాజీ ఆడిటర్ బుచ్చిబాబు వంటి వారిని ఆ విధంగా విచారణకు పిలిచి, ఆ తర్వాత అరెస్ట్ చేయడం గమనార్హం.
ఇప్పటికే ఛార్జ్ షీట్ లలో, రేమండ్ రిపోర్టులలో ఈ మొత్తం కుంభకోణంలో, ముఖ్యంగా గోవా ఎన్నికల ప్రచారం కోసం ఆప్ కు సౌత్ గ్రూప్ నుండి రూ 100 కోట్లు చేరవేయడంలో కవిత సహితం కీలక పాత్ర వహించిన్నట్లు కేంద్ర దర్యాప్తు సంస్థలు స్పష్టం చేశాయి. అయితే ముందుగానే అరెస్ట్ చేసి, కేంద్రం రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నదని ప్రచారం చేసుకొనే అవకాశం ఇవ్వకుండా చేయడం కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నది.
కీలక నిందితులుగా భావిస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా వంటి వారిని సహితం ఇంకా అరెస్ట్ కు తొందరపడక పోవడంకు అదే కారణంగా చెబుతున్నారు. ఈ ఏడాదే తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా కవిత అరెస్ట్ ను రాజకీయ అంశంగా మలచుకొని బిఆర్ఎస్ లబ్ది పొందకుండా నివారించేందుకు ఆచి తూచి అడుగులు వేస్తున్నట్లు స్పష్టం అవుతుంది.
ఇప్పటికే హైదరాబాద్‌కు చెందిన అభిషేక్ బోయిన్‌పల్లి, కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబులను సీబీఐ అరెస్టు చేసింది. వీరిలో అభిషేక్ బోయినపల్లి కూడా గతంలో కవితకు పీఏగా వ్యవహరించారని, ఆమె వ్యవహారాలు చూసే వారనే ప్రచారం జరిగింది. వీరి అరెస్టులు కేసులో కవిత ప్రమేయాన్ని మరింత బలపరచేవిధంగా ఉన్నట్లు భావిస్తున్నారు.
ఈ విషయంలో కేసీఆర్ సహితం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు శాసనసభలో ఆదివారం ఆయన చేసిన ప్రసంగం వెల్లడి చేస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకు పడిన ఆయన కుమార్తె కవిత అరెస్ట్ జరిగితే ప్రజల `సానుభూతి’ పొంది రాజకీయ అస్త్రంగా మలచుకొనేందుకు ఎత్తుగడ వేస్తున్నట్లు కనిపిస్తున్నది. అయితే, కేసీఆర్ కు అటువంటి అవకాశం ఇవ్వకుండా చేయడం కోసం మొన్నటి వరకు కవిత నేడో, రేపో అరెస్ట్ ఖాయం అంటూ ప్రకటనలు చేస్తూ వచ్చిన రాష్ట్ర బీజేపీ నేతలు ఈ మధ్య ఈ అంశంపై మౌనం దాలుస్తుండటం గమనార్హం.