కవితక్క మరింత లోతుగా ఇరుక్కుంటున్నదా?

Wednesday, January 22, 2025

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ తన, ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే రెండుసార్లు ఈడీ విచారణకు హాజరయ్యారు. మొదటి విడత విచారణకు పిలిచినప్పుడే.. ఆమెను అరెస్టు చేస్తారని అందరూ అనుకున్నారు. స్వయంగా కేసీఆర్ కూడా, మహా అయితే అరెస్టు చేస్తారు..అంతే.. కానీ మేం అరెస్టులకు భయపడం అని డాంబికంగా ప్రకటించారు. కానీ రెండు విడతల విచారణ జరిగినప్పటికీ అరెస్టు మాత్రం జరగలేదు. అరెస్టు తప్పదని, బిఆర్ఎస్ నాయకులే ఎదురుచూస్తున్నప్పటికీ ఈడీ ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టు పలువురు భావించారు.
అయితే తాజా పరిణామాలను గమనిస్తోంటే.. కవితక్క అరెస్టు తప్పదేమో అని అనిపిస్తోంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టు అయి ఇప్పటికే జైలులో ఉన్న కీలక వ్యక్తి సుఖేష్ చంద్రశేఖర్ ఇటీవల తన లాయరు ద్వారా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఉద్దేశించి ఒక లేఖ విడుదల చేశారు. తన ఫోనునుంచి 703 వాట్సప్ చాట్ లను త్వరలోనే తాను బయటకు విడుదల చేసేస్తానని ఆ లేఖలో ఆయన హెచ్చరించారు. ఒక సీనియర్ బీఆర్ఎస్ నేతతో సహా పలువురితో చేసిన చాట్ వివరాలు అందులో ఉంటాయని పేర్కొన్నారు. టిఆర్ఎస్ ఆఫీసుకు 15 కోట్లు డెలివరీ చేయాల్సింది మీ సూచనల ప్రకారం చేసి, మీరు చెప్పినట్లుగా సదరు టీఆర్ఎస్ నేత నుంచి ధ్రువీకరణ మీకు ఇస్తాను.. లాంటి వాక్యాలు ఆ లేఖలో ఉన్నాయి.

త్వరలో విడుదల చేస్తానని అన్నట్టుగానే సుఖేష్ చంద్రశేఖర్ తాజాగా బుధవారం మరో లేఖ విడుదల చేశారు. తన వాట్సప్ చాట్ ను ఆయన బయటపెట్టారు. కల్వకుంట్ల కవితతో చేసిన చాట్ గా భావిస్తున్నది ఆరుపేజీల చాట్ వివరాలను ఆయన బయటపెట్టారు.
ఏకె, ఎస్‌జె, ఘీ, సిస్టర్, ఏపీ లాంటి కోడ్ పేర్లతో చాట్ చేసినట్టుగా అందులో ఉంది. ఏకే అంటే అరవింద్ కేజ్రీవాల్, ఎస్‌జె అంటే ఆప్ లీడర్ సత్యేంద్ర జైన్ అయి ఉంటుందని పలువురు భావిస్తున్నారు.
98101 54102 నెంబరుతో చాట్ చేసినట్టుగా ఉంది. ఆ నెంబరు ఢిల్లీ లోని షాకూర్ బస్తీ ఎమ్మెల్యేది అని ట్రూకాలర్ ద్వారా తెలుస్తుంది. అక్కడి ఎమ్మెల్యే ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన సత్యేంద్ర జైన్ కావడం గమనార్హం. సుఖేష్ తన ఇతర చాట్ లలో ఎస్‌జె అనే పేరుతో వ్యవహరించినది కూడా ఆయననే అని అనుకుంటున్నారు.
సుఖేష్ చంద్రశేఖర్ బీఆర్ ఎస్ నేతలతో జరిపిన వాట్సప్ చాట్ బయటపెట్టాడు.
కవితక్క-టీఆర్ఎస్ అని ఫీడ్ అయి ఉన్న నెంబరుగా చాట్ వివరాలు ఉన్నాయి.
ఏహెచ్ కు పంపమంటారా అని సుఖేష్ అడగ్గా, ఆఫీసుకు పంపు అని అటువైపు నుంచి సమాధానం వచ్చినట్టుగా వాట్సప్ చాట్ లో ఉంది. ఆ చాట్ లో సుఖేష్ పదేపదే అక్కా అని సంబోధించినట్టుగా కూడా ఉంది. కవితక్క-టీఆర్ఎస్ అని సేవ్ చేసుకున్న నెంబరుతోపాటు, ఇంకా ఇతర బీఆర్ఎస్ నాయకులతో చేసిన చాట్ ను కూడా సుఖేష్ బయటపెట్టారు.
15కిలోల నెయ్యి డెలివరీ చేశానని కోడ్ లాంగ్వేజీలో సుఖేష్ చాట్ చేసినట్టుగా ఉంది. ఇది కేజ్రీవాల్ కు రాసిన లేఖలో పేర్కొన్న 15 కోట్ల రూపాయలకు సంబంధించిన కోడ్ భాష అని పలువురు భావిస్తున్నారు. ఆ చాట్లో మీ నాన్నకు ఆరోగ్యం ఎలా ఉంది అని కవిత విచారించినట్టుగానూ ఉంది. అలాగే మరో నెంబరు సంభాషణల్లో కేసీఆర్ గారికి నా నమస్కారాలు తెలియజేయండి అని సుఖేష్ పేర్కొన్నట్టుగా కూడా ఉన్నాయి.

ఈ చాట్ వివరాలు బయటకు వచ్చిన నేపథ్యంలో ఇక రెండు మూడు రోజుల ఈ చాట్ సంభాషణల్ని భారాస నాయకులు అందరూ వరుసగా ఖండించే పర్వం ఉంటుంది. కానీ మొత్తానికి ఈడీ విచారణ ఇంకాస్త ముందుకు సాగితే.. కవిత ఇంకా లోతుగా కేసులో ఇరుక్కుంటారేమోనని పలువురు భావిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles