ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కల్వకుంట్ల కవిత అరెస్టు కావడం తథ్యం అని గులాబీ పార్టీ డిసైడ్ అయిపోయింది. అరెస్టును అడ్డుకోవడానికి తాము ఏం చేయగలం? అనే ఆలోచనలనుంచి, కసరత్తునుంచి ఆ పార్టీ బయటకు వచ్చింది. అరెస్టు అయిన తర్వాత.. సదరు అరెస్టు ద్వారా.. దేశవ్యాప్తంగా తమ జాతీయ పార్టీకి ఏ రకంగా మైలేజీ సంపాదించుకోగలం అనే దిశగానే ఇప్పుడు మధనం నడుస్తోంది. ఇలాంటి వ్యూహరచనను సిద్ధం చేయడానికి, లేదా సిద్ధం చేసిన వ్యూహరచనకు పార్టీలో అందరి ఆమోదముద్ర వేయించుకోవడానికి అన్నట్టుగా.. కేసీఆర్ శుక్రవారం పార్టీ విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటుచేశారు.
అరెస్టు గ్యారంటీ అని అర్థమైన తర్వాత.. కవిత డిమాండ్లు కూడా భిన్నంగా వినిపిస్తున్నాయి. మహిళలను విచారించేప్పుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాత్రమే విచారించాలని ఆమె కొత్త తరహా డిమాండ్లను తెరమీదికి తెస్తున్నారు. ఇలా అలవాటు చేయడం మొదలైతే.. ప్రతి ఒక్కరూ.. ఒక్కొక్క కొత్త మినహాయింపు కోసం డిమాండ్ చేయగలరు. విచారణ విషయంలో సోనియా గాంధీ అయినా సరే.. స్వయంగా ఈడీ కార్యాలయానికే వెళ్లి వివరణ ఇచ్చారని, సీబీఐ ఇంటికి వచ్చి విచారిస్తుంది గానీ, ఈ డీ విషయంలో వాళ్లే ఈడీ కార్యాలయానికి వెళ్లి విచారణ ఎదుర్కోవాల్సిందే అని నిపుణులు చెబుతున్నారు. కవిత విచారణకు వెళ్లేలోగా ఆమెతో కలిపి విచారించడానికి ఆమె బినామీగా చెబుతున్న అరుణ్ రామచంద్ర పిళ్లై ప్రస్తుతం ఈడీ కస్టడీలోనే ఉన్నారు. అదే సమయంలో ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాను గురువారం సాయంత్రం అరెస్టు చేసిన ఈడీ .. కస్టడీలోకి తీసుకోనంది. కవిత వెళ్లి తన వివరణ/ వాదన చెప్పే సమయానికి ఎంతో కీలక నిందితులైన ఆ ఇద్దరూ ఈడీ వద్దనే ఉంటారు. ముగ్గురినీ విడివిడిగా ఏకకాలంలో విచారించడం ద్వారా ఈడీ ఈ కేసులోని అనేక చిక్కుముడులకు ఆరోజున పరిష్కారం చెప్పేయగలదనే విశ్వాసం పలువురిలో వ్యక్తం అవుతోంది.
కవిత అరెస్టు తథ్యమే. అయితే.. దానినుంచి తమ పార్టీకి పొలిటికల్ మైలేజీని పిండుకోవడం ఎలా అనేది గులాబీ బ్యాచ్ కు అర్థం కావడం లేదు. అసలు నిందితుడు సిసోడియా అరెస్టు తర్వాత.. ఆమ్ ఆద్మీ పార్టీ మరీ అంత యాగీ చేసిందేమీ లేదు. అలాంటి కవిత పాత్ర కూడా దాదాపుగా ఉన్నట్టే అని అంతా అనుకుంటుండగా.. ఆమె అరెస్టును రాజకీయ మైలేజీకి ఎన్నిరకాలుగా క్యాష్ చేసుకోవడానికి భారాస కసరత్తు చేస్తున్నదో తెలియడం లేదు. పార్టీ విస్తృత సమావేశంలో ఒక క్లారిటీ రావొచ్చునని పలువురు భావిస్తున్నారు.
కవితక్క అరెస్టును క్యాష్ చేసుకోవడం ఎలా?
Saturday, November 16, 2024