ప్రభుత్వం నిజంగా మంచి పనిచేస్తూన్నట్లయితే.. దానిమీద బురద చల్లడానికి ఎందరు ప్రయత్నించినా సరే ప్రజలే తిప్పి కొడతారు. ప్రభుత్వం నిజంగా మంచి చేస్తున్నప్పుడు.. అదే పనిగా అబద్ధపు నిందలు వేస్తే ప్రతిపక్షాలే నవ్వులపాలు అవుతాయి తప్పదాని వలన వేరే ఫలితం ఉండదు. కాబట్టి ప్రభుత్వం పాలకపక్షం కంగారు పడే పనేలేదు. కానీ.. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మాత్రం ప్రతిపక్షాల విమర్శలంటే విపరీతమైన కంగారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలన్నా, ఏబీఎన్, టీవీ5 చానెల్స్ అన్నా విపరీతమైన భయం. వారు చూపించే వార్తలంటే భయం. తమ ప్రభుత్వం అపరిమితమైన సంక్షేమం చేపడుతున్నదని నిజంగా నమ్ముతున్ననప్పుడు.. వీరిగురించి ఆయన ఆందోళన చెందే పనిలేదు. కానీ.. నిత్యం పేర్లు ప్రస్తావించి మరీ జగన్ దుమ్మెత్తి పోస్తుంటారు. పార్టీ నాయకులందరితోనూ పదేపదే తిట్టిస్తుంటారు. ఇప్పుడు తన పార్టీ వాళ్లు తిడుతున్న తిట్లన్నీ సరిపోవడం లేదని అనుకుంటున్నారేమో గానీ.. కలెక్టర్లను కూడా రెచ్చగొడుతున్నారు. కలెక్టర్లు ప్రెస్ మీట్లు పెట్టి మరీ.. పత్రికల్లో వచ్చే నెగటివ్ వార్తల మీద మీడియాను గట్టిగా తిట్టాలని మార్గనిర్దేశం చేస్తున్నారు.
కలెక్టర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జగన్ ఎంత ఊగిసలాట ధోరణిలో ఉంటారో చాలా స్పష్టంగా కనిపించింది. ప్రభుత్వ వైఫల్యాలు, పెన్షన్ల తొలగింపు వంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై జగన్ ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. విమర్శలను ఏమాత్రం సహించలేకపోతున్నారు. ప్రజలకు వాస్తవాలు తెలుస్తున్నాయని గందరగోళానికి గురవుతున్నారు. అందుకని తాను చేస్తున్న ఎదురుదాడి చాలదని, ఆ ఎదురుదాడిలో ఇప్పుడు కలెక్టర్లను కూడా ఇన్వాల్వ్ చేయాలని అనుకుంటున్నారు.
పత్రికలు అబద్ధాలు చెబుతున్నాయనే అనుకుందాం. జగన్ చేస్తున్న ఆరోపణలన్నీ నిజమే అనుకుందాం. అయితే అబద్ధాలతో ప్రజలను పత్రికలు ఎలా నమ్మించగలవు? క్షేత్రస్థాయిలో జరుగుతున్నదేమిటో ప్రజలకు తెలుస్తుంది కదా? ఏ అమెరికాలోనో కాశ్మీరులోనో జరుగుతున్న సంగతి గురించి ఒక అబద్ధాన్ని ప్రచారంలో పెడితే.. ప్రజలను బురిడీ కొట్టించవచ్చు. సోషల్ మీడియా బలంగా తయారవుతున్న ఈ రోజుల్లో అది కూడా కష్టమే. అలాంటిది.. ఏపీలో గ్రామాల్లో, పెన్షన్ల విషయంలో, అభివృద్ధి పనుల విషయంలో, వైసీపీ నేతల కబ్జాల విషయంలో, దందాల విషయంలో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో పత్రికలు అబద్ధాలు చెబితే ప్రజలు ఆ మాత్రం గ్రహించకుండా ఉంటారా? అప్పుడు వారు ఆ పత్రికలనే ఛీత్కరించుకుంటారు కదా. మరి జగన్ కు భయమెందుకో అర్థం కాదు. మీడియాను తిట్టాల్సిందిగా.. కలెక్టర్లకు కూడా ఆయన చేస్తున్న హితోపదేశం గమనించి.. ఉన్నమాటంటే ఉలుకెక్కువ అనే సామెత జగన్ విషయంలో నూటికి నూరుపాళ్లు నిజం అని జనం నవ్వుకుంటున్నారు.