భోగాపురంలో విమానాశ్రయం నిర్మించడానికి చంద్రబాబు నాయుడు ఏనాడో శంకుస్థాపన చేశారు. ‘అసలు ఇక్కడ విమానాశ్రయం అవసరమే లేదంటూ’ అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి డాంబికంగా పలికారు. ఇవన్నీ చరిత్రలోంచి చెరిపేస్తే చెరిగిపోని విషయాలు, వాస్తవాలు! జగన్ రెండు నాలుకల ధోరణికి ప్రతిబింబాలు!! రెండోసారి శంకుస్థాపన చేసిన తర్వాత జగన్ మాటలు, అప్పట్లోని వ్యతిరేకత జనంలో వైరల్ అవుతున్నాయి. నిజానికి మాట మార్చే తన వైఖరిని ప్రజలు గుర్తించడం గురించి జగన్మోహన్ రెడ్డికి పెద్దగా దిగులు లేదు. కాకపోతే, తాను ప్రేమగా చూసుకుంటున్న కమల నాయకులు కూడా తన వ్యవహారాన్ని దుమ్మెత్తి పోస్తుండడం ఆయనకు మింగుడు పడడం లేదు!
నరేంద్ర మోడీని భజన చేస్తూ ఉంటే బిజెపితో తన పార్టీకి సత్సంబంధాలు ఉన్నట్లుగానే ప్రపంచం మొత్తం పరిగణిస్తుందని జగన్మోహన్ రెడ్డి అనుకోవడంలో తప్పులేదు. అందుకోసమే ఆయన మోడీతో తారసిల్లిన ప్రతిసారీ ఆయన పాదాలను స్పృశించడమూ, ఆయనను అనేక రకాల అతిశయోక్తులతో కీర్తించి ఆకాశానికి ఎత్తేయడమూ చేస్తుంటారు. మోడీని అతి భయంకరంగా కీర్తిస్తూ ఉంటే రాష్ట్రంలోని బిజెపి నాయకులు తన చేతలపట్ల నిశిత విమర్శలు చేయకుండా నోరు మూసుకుని కూర్చుని ఉంటారనే ఆశ కూడా జగన్మోహన్ రెడ్డికి ఉన్నట్టుంది. అయితే ప్రాక్టికల్ గా చూసినప్పుడు అదంతా జరిగే పని కాదు. కమలదళంలోని జగన్మోహన్ రెడ్డి తొత్తులు తైనాతీలు ఆయన వ్యవహారాల పట్ల మౌనం పాటిస్తూ ఉండవచ్చు గాని, సీనియర్ నాయకులు చాలామంది మాత్రం ఆయన వ్యవహారాలను నిరసిస్తున్నారు.
తాజాగా ‘మా చెల్లికి మళ్లీ పెళ్లి’ అని ఒక సినిమాలో కమెడియన్ చెప్పిన డైలాగు మాదిరిగా భోగాపురం విమానాశ్రయానికి మళ్లీ శంకుస్థాపన చేసి నాయకుడుగా ఒక గొప్ప విలక్షణ కీర్తిని సంపాదించుకున్నారు జగన్. తిట్టేవాళ్లు తిడుతున్నారు, నవ్వుకునేవాళ్లు నవ్వుకుంటున్నారు. అందరి విమర్శల కంటె బిజెపి వాళ్లు కూడా విమర్శించడం ఆయనకు ఇబ్బందిగా ఉంది.
ఆల్రెడీ శంకుస్థాపన అయిన భోగాపురం విమానాశ్రయానికి మళ్ళీ శంకుస్థాపన ఏమిటి అంటూ బిజెపి జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్ ఎద్దేవా చేయడం ఇక్కడ గమనార్హం. బిజెపి నేతల నుంచి కూడా విమర్శలు వస్తూ ఉండేసరికి జగన్ సహించలేకపోతున్నారు. తన దృష్టిలో అప్రకటిత మిత్రపక్షం అనుకుని నెత్తిన పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా తన వైఖరిని విమర్శించడం జగన్ కు మింగుడు పడడం లేదు. కమలం పార్టీ నుంచి తన చేతల పట్ల విమర్శలు రాకుండా ఉంటే చాలుననే జగన్మోహన్ రెడ్డి ఆశ ముందు ముందు అయినా తీరుతుందో లేదో చూడాలి. ఆ పార్టీలో కొందరు నాయకులను జగన్ మేనేజ్ చేయగలుగుతున్నా… మరికొందరు ఆయనకు కొరుకుడుపడడం లేదనే మాట రాజకీయ వర్గాల్లో వినవస్తోంది.