తెలుగుదేశం పార్టీలోన చేరిన సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ వలన ఆ పార్టీకి ఎలాంటి లాభం జరగబోతోంది? ఆయన ఏ పార్టీల నుంచి నాయకులను ప్రభావితం చేసి, వారిని తెలుగుదేశంలోకి తీసుకురావడానికి ఉపయోగపడతారు? ఏయే ప్రాంతాల్లో, ఏయే సామాజిక వర్గాల్లో పార్టీకి ఓట్లు పెరగడానికి ఉపయోగపడతారు? వంటి అనేక చర్చలు పార్టీలో జరుగుతున్నాయి. కన్నా లక్ష్మీనారాయణ సీనియర్ గనుక్.. ఆయన బాటలో ఇతర పార్టీల నుంచి మరి కొందరు నాయకులు కూడా తెలుగుదేశంలో చేరవచ్చుననే అభిప్రాయం పలువురిలో వ్యక్తం అవుతోంది. అదే సమయంలో.. బిజెపికి చెందిన పలువురు నాయకులు తనతో టచ్ లో ఉన్నారని, వారు కూడా త్వరలోనే తెలుగుదేశంలోకి వచ్చే అవకాశం ఉన్నదని కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించారు కూడా.
ఒక రకంగా చూసినప్పుడు.. బిజెపి నాయకులు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడం అనేది పెద్ద విశేషమేం కాదు. ఎందుకంటే బిజెపి నాయకులకు వేరే గత్యంతరం లేదు. బిజెపి ఇన్నాళ్లు రాజకీయాల్లో నీతుల గురించి మాట్లాడుతూ, పార్టీ విధాన నిర్ణయంగా అమరావతికి మద్దతు ఇస్తూ వచ్చి ఇప్పటికిప్పుడు జగన్ కు జై కొడుతూ ఆయన పార్టీలో చేరలేరు. పైగా జగన్ పార్టీలో చేరడం వలన.. 151 మంది సిటింగ్ ఎమ్మెల్యేలుండగా, తమకు ఎలాంటి అవకాశం దక్కుతుందో తెలియదు. ఈ పరిస్థితుల్లో వారు తెలుగుదేశాన్ని మాత్రమే ఎంచుకోవాలి. జనసేన ఒక ప్రత్యామ్నాయంగా ఉంటుంది గానీ.. వివిధ కారణాలవల్ల తెదేపా వైపు మొగ్గేవారే ఎక్కువ.
అయితే కన్నా లక్ష్మీనారాయణ ఎఫెక్ట్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద కూడా ఉంటుందా? అనే అంచనాలు కూడా రాజకీయ వర్గాల్లో సాగుతున్నాయి. ఆయన సీనియర్ నాయకుడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే మంత్రిగా సేవలందించిన వ్యక్తి. అప్పటి వైఎస్సార్ సహచరులు, ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న అనేక మందితో సత్సంబంధాలు ఉన్న నాయకుడు. వైకాపాలో కొనసాగుతున్న అనేకమంది వైఎస్సార్ సహచరులు.. అక్కడ ఇమడలేకపోతున్నారనే ఒక అభిప్రాయం రాజకీయవర్గాల్లో ఉంది. వేరే గత్యంతరంలేక అక్కడ కొనసాగుతున్నారే తప్ప.. జగన్ పట్ల వారిలో అసహనం ఉన్నదనే ప్రచారం కూడా ఉంది. జగన్ వైఖరి, పెత్తందారీ పోకడలతో పడలేక, వచ్చే ఎన్నికల్లో పోటీనుంచి తప్పుకుంటాం అని ఆలోచిస్తున్న సీనియర్లు కూడా ఉన్నారనే ప్రచారం ఉంది. అలాంటి నేపథ్యంలో.. వైసీపీలోని కొందరు కాంగ్రెస్ సీనియర్లను తెలుగుదేశంలోకి తీసుకురావడానికి కన్నా లక్ష్మీనారాయణ ఉపయోగపడతారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వెంకటగిరి ఎమ్మెల్యేగా ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి కూడా తెలుగుదేశంలో చేరబోతుండడంతో.. ఈ ఇద్దరు నాయకులు మరికొందరి మీద ప్రభావం చూపగలరనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి పలువురు నాయకులు తెలుగుదేశం వైపు మొగ్గుతున్నారు. ఆనం, కోటంరెడ్డి వంటివాళ్లు ఇందుకు ఉదాహరణ. నష్టనివనారణ కోసమా అన్నట్టుగా తెలుగుదేశం నుంచి కూడా తమవైపు కొందరు వస్తున్నారని చెప్పుకోడానికి జయమంగళ వెంకటరమణ, సిపాయి సుబ్రమణ్యం లాంటి వాళ్లను వైసీపీలో చేర్చుకున్నారు. అయితే వారికి ఎమ్మెల్సీ పదవుల తాయిలంతోనే చేర్చుకోగలిగారు తప్ప.. మరోటి కాదు. కానీ వైసీపీని వదలి తెలుగుదేశంలోకి వెళుతున్న వారు ఇప్పటికిప్పుడు ఏం దక్కకపోయినా, ఎన్నికల్లో టికెట్ లభిస్తే చాలు అనే సమీకరణాలపై వెళుతున్నారు. ఇలాంటి పరిణామాలు తెలుగుదేశానికి నైతిక స్థైర్యం కలిగిస్తున్నాయని నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.
కన్నా వైకాపా వికెట్లను రాలుస్తారా?
Sunday, November 17, 2024