కన్నా రాజీనామా మరుసటి రోజే పురందేశ్వరి ఎదురు దాడి

Monday, September 16, 2024

ఏపీలో బీజేపీని భ్రష్టుపట్టిస్తున్నారని అంటూ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావులపై మండిపడుతూ పార్టీకి సీనియర్ నాయకుడు, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా చేసిన రోజుననే రాష్ట్ర పార్టీ నాయకత్వంపై మరో సీనియర్ నేత ఎదురుదాడి జరిపారు.

పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి నేరుగా జివిఎల్ ను లక్ష్యంగా చేసుకొని మండిపడ్డారు. ఎన్టీఆర్, వైపురందేశ్వరి ఎస్సార్ లను ఉద్దేశించి  జీవీఎల్ చేసిన వ్యాఖ్యలపై ఆమె తీవ్రంగా స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.

‘అన్నీ ఇద్దరి పేర్లేనా’ అంటూ జీవీఎల్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన పురందేశ్వరి ఆ ఇద్దరు అనే పదాన్ని హైలైట్ చేస్తూ ఆ ఇద్దరు కాదు ఆ మహానుభావులు అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చారు. వారు రాష్ట్రానికి చేసిన సేవల్ని ప్రస్తావిస్తూ ఆమె ట్వీట్ చేశారు.

 ‘‘ఒకరు తెలుగు జాతికి గుర్తింపు తీసుకొని వచ్చి, పేదలకు నిజమైన సంక్షేమం అందించారు. 2 రూపాయలకే కిలో బియ్యం, పక్కా గృహాలు, జనతా వస్త్రాలు, మహిళా విశ్వవిద్యాలయం వంటివి ప్రజలకు అందించారు. మరొకరు ఫీజు రీయింబర్స్‌మెంట్, 108 ఉచిత అంబులెన్సు సేవలు, ఆరోగ్యశ్రీ అందించారు’’ అంటూ ట్వీట్ చేశారు. ‘‘ఆ ఇద్దరు కాదు.. ఆ మహానుభావులు’’ అని మరో ట్వీట్ చేశారు.

రాష్ట్రంలో రాజకీయంగా ఉనికిలేని జివిఎల్ కాపుల మద్దతు కూడదీసుకోవడం కోసం ఈ మధ్య ఒక సారి కాపు రిజర్వేషన్ అంటూ, మరోసారి ఒక జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలంటూ రాజ్యసభలో మాట్లాడుతున్నారు. రంగా పేరును ప్రస్తావిస్తూ రాష్ట్రంలో చాలా కాలంగా అన్నింటికీ ఆ ఇద్దరు పేర్లే కనిపిస్తున్నాయంటూ పరోక్షంగా ఎన్టీఆర్, వైఎస్సార్ లను ఉద్దేశించి జీవీఎల్ చేసిన వాఖ్యలపై ఆమె ధ్వజమెత్తారు.

జివిఎల్ చేసిన వ్యాఖ్య‌ల వీడియోను ఆమె త‌న ట్వ‌ట్ట‌ర్ ద్వారా షేర్ చేశారు. బిజెపిలో ఉంటూ వైఎస్ ని, ఎన్టీఆర్ ప‌థ‌కాల‌ను పురంథీశ్వ‌రీ స‌మ‌ర్ధించ‌డంలో రాజ‌కీయాల‌లో సంచ‌ల‌నం క‌లిగించింది.

‘‘రాష్ట్రంలో రాజకీయాలు.. కేవలం రెండు పార్టీలకో, కుటుంబాలకో పరిమితం కాదు. ఏది చూసినా ఆ కుటుంబం.. లేదా ఈ కుటుంబం. ఆ పార్టీ.. ఈ పార్టీ. అన్నీ ఇద్దరి పేర్లేనా? మిగతా నాయకులెవరూ కనిపించరా?’’ అని జీవీఎల్  గురువారం కాపు సామాజిక వర్గాల నేతలతో సమావేశం అనంతరం ప్రశ్నించారు.

పురందేశ్వరి సహితం ఏపీలో జివిఎల్, సోము వీర్రాజు కలిసి చేస్తున్న రాజకీయాలపట్ల చాలా కాలంగా తీవ్ర అసంతృప్తితో ఉంటున్నారు. తనకు, తన మద్దతుదారులకు రాష్ట్ర పార్టీలో ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారని ఆమె మండిపోతున్నారు. ఆమెకు రాజ్యసభ సీట్ ఇవ్వాలని, రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలని పార్టీ కేంద్ర నాయకత్వం భావిస్తున్న సమయంలో వీరిద్దరూ కేంద్రంలో సహితం అడ్డుపడుతున్నట్లు ఆమె భావిస్తున్నారు.

దానితో, 2024 ఎన్నికల సమయానికి తన రాజకీయ భవిష్యత్ గురించి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైనదని ఆమె భావిస్తున్నారు. చాలాకాలంగా ఆమె కుటుంబానికి, చంద్రబాబు నాయుడు కుటుంబానికి గల దూరం ఈ మధ్య తగ్గినట్టు స్పష్టం అవుతుంది. అందుకనే, ఈ ఏడాది అయినా రాజ్యసభ సీటు ఇవ్వని పక్షంలో తాను ఆమె సహితం పార్టీకి దూరమయ్యే అవకాశం లేకపోలేదని స్పష్టం అవుతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles