కన్నా రాజీనామాతో బిజెపికి చంద్రబాబు షాక్!

Monday, December 23, 2024

మాజీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బిజెపికి రాజీనామా చేయడంతో పాటు టీడీపీలో చేరనున్నట్లు సంకేతం ఇవ్వడం ఒక విధంగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు బిజెపి అగ్రనాయకత్వంకు షాక్ ఇచ్చినట్లయింది. ఏపీలో దుర్మార్గ పాలన సాగిస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అండగా ఉంటున్న కేంద్రంలోని మోదీ ప్రభుత్వంతో సయోధ్యకు చంద్రబాబు గత మూడేళ్ళుగా ఎన్ని సంకేతాలు పంపుతున్నా సానుకూలంగా స్పందన లభించడం లేదు.

పైగా, చంద్రబాబు నాయుడు వంటి ఓ బలమైన నాయకుడు ఆంధ్ర ప్రదేశ్ వంటి ప్రగతిశీల రాష్ట్రంకు ముఖ్యమంత్రి కావడం పట్ల విముఖతను పరోక్షంగా వ్యక్తం చేస్తూనే ఉన్నారు. సిబిఐ కేసులలో ఇరుక్కున్న జగన్ వంటి నేత అయితే తమ చెప్పుచేతలలో ఉంటారనే అభిప్రాయంతో ఉంటున్నారు. అనేక విధాలుగా జగన్ ను  ఆదుకొంటూ వస్తున్నారు.

వైఎస్ జగన్ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి పోటీ చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగంగానే ప్రతిపాదనలు చేసినా బిజెపి ప్రతికూలంగా స్పందిస్తూ వస్తున్నది. పైగా, ఎట్టిపరిస్థితులలో టిడిపి దగ్గరకు పవన్ వెళ్లకుండా చేసేందుకు జగన్ అజెండాను అమలు పరచేందుకు స్వయంగా ప్రధాని మోదీ రంగంలోకి దిగారు కూడా.

ఇటువంటి పరిస్థితులలో సుమారు 15 ఏళ్లపాటు మంత్రిగా పనిచేసిన, ఐదుసార్లు ఎమ్యెల్యేగా ఎన్నికైన కన్నా లక్ష్మీనారాయణ వంటి నేత బిజెపి నాయకత్వంపై తిరుగుబాటు చేసి, టిడిపిలో చేరడం అంటే బీజేపీ నాయకత్వంతో సంబంధం లేకుండానే ఏపీలో తన సత్తా చూపించేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నట్లు స్పష్టం అవుతుంది.

వాస్తవానికి తొలుత జనసేనలో చేరేందుకు కన్నా సుముఖత వ్యక్తం చేసిన్నట్లు వార్తలు వచ్చాయి. ఆ పార్టీ అగ్రనేత నాదెండ్ల మనోహర్ స్వయంగా కన్నాను కలిసి సుదీర్ఘంగా చర్చలు కూడా జరిపారు. అయితే టిడిపి- జనసేన పొత్తు ఇంకా ఖరారు కాకపోవడంతో, ఎన్నికలు వచ్చేవరకు వేచిఉండకుండా ముందే చేరాలని కన్నా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.

ఈ విషయమై గత వారం కొందరు టిడిపి నాయకులు హైదరాబాద్ లో కన్నాను కలసి మంతనాలు జరిపినట్లు తెలుస్తున్నది. కన్నా పోటీచేయాలి అనుకొంటున్న సత్తెనపల్లి నియోజకవర్గంకు కేటాయించేందుకు చంద్రబాబు అంగీకారం తెలిపినట్లు కూడా చెబుతున్నారు.

దానితో రాష్ట్ర వ్యాప్తంగా జగన్ ప్రభుత్వం పట్ల కత్తులు నూరుతున్న కాపు సామాజికవర్గం క్రమంగా చంద్రబాబుకు సన్నిహితం అవుతున్న సంకేతం వెలువడినట్లయింది. రాబోయే రోజుల్లో మరికొందరు కాపు నేతలు సహితం టిడిపిలో చేరే అవకాశాలున్నాయి.

బిజెపిని వీడబోతున్నట్లు కొంతకాలంగా కన్నా సంకేతాలు ఇస్తున్నా ఆయనని వైసీపీలో చేర్చుకోరని, బిజెపితో పొత్తు కోసం ఎదురు చూస్తున్న టీడీపీ, జనసేనలు ఎట్లాగూ చేర్చుకోవనే ధీమాతో ఆ పార్టీ నాయకులు ఇప్పటివరకు పట్టించుకోకుండా ఉన్నారు. అయితే కన్నా ఇప్పుడు పార్టీని విడవడంతో వారి అంచనాలు అన్ని తారుమారయ్యాయి. మరికొందరు ప్రముఖ నేతలు సహితం బిజెపిని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తున్నది.

కన్నా బిజెపిని విడవడంతో ఆ పార్టీలో ఇప్పుడు ఎమ్యెల్యేగా గతంలో పోటీచేసి, చెప్పుకోదగిన ఓట్లు తెచ్చుకున్నవారు, గెలుపొందినవారు ఎవ్వరూ దాదాపుగా లేని పరిస్థితి ఏర్పడింది. విశాఖపట్నంలో మాజీ ఎమ్యెల్యే విష్ణుకుమార్ రాజు వంటి వారున్నా వారు సహితం బీజేపీలో కొనసాగడం అనుమానాస్పదంగా ఉంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles