కన్నా బాటలోనే  నడవనున్న రాజుగారు!

Sunday, November 17, 2024

భారతీయ జనతా పార్టీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా ఆ పార్టీని వీడబోతున్నారా? కమలదళంలో ఉన్నంతవరకు రాష్ట్రంలో భవిష్యత్తు లేదనే ఉద్దేశంతో.. ఆయన కూడా వేరే పార్టీల్లో చేరడానికి నిర్ణయించుకున్నారా? ఏపీలో బీజేపీకి పతన మార్గాన్ని నిర్దేశిస్తున్న రాష్ట్ర సారధి సోము వీర్రాజు వైఖరితో పొసగని కారణంగానే.. విష్ణుకుమార్ రాజు కూడా పార్టీని వీడనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా వరుస వలసలు ఆగకపోతే.. ఏపీలో పార్టీకి చాలా నష్టం జరుగుతుందని పలువురు భావిస్తున్నారు.

2014లో ఏపీలో భారతీయ జనతా పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన విష్ణుకుమార్ రాజు.. ఇప్పుుడు పార్టీలో కొనసాగుతారో లేదో తెలియడం లేదు. ఎందుకంటే.. ఆయన తాజాగా సోమవారం నాడు కన్నా లక్ష్మీనారాయణతో భేటీ అయ్యారు. పార్టీ సారధి మీద విమర్శలు చేసి, పార్టీని వదలిపెట్టిన  నాయకుడితో భేటీ కావడం అంటే.. ఖచ్చితంగా అది ఆలోచించాల్సిన విషయమే. 

విష్ణుకుమార్ రాజు భాజపాకు నమ్మకస్తుడైన కార్యకర్తే. పార్టీకి విధేయుడే. అంతమాత్రాన నాయకులు తమ రాజకీయ భవిష్యత్తును ఆలోచనలను కూడా పణంగా పెట్టేసి త్యాగమూర్తులుగా మారిపోతారని అనుకోవడానికి వీల్లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల్లో నెగ్గేంత ఆదరణ లేదు. జనసేనతో కలిసి అధికారంలోకి రావడం గురించి వారెన్ని మాటలైనా చెప్పొచ్చు గానీ.. అసలు జనసేన వారివెంట ఉంటుందో లేదో కూడా తెలియదు. ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ కు చేసిన ద్రోహానికి ప్రజలు చాలా గట్టిగానే పార్టీని ద్వేషిస్తున్నారు. 

కేంద్రంలోని బిజెపి సర్కారు.. ప్రత్యేకంగా తమకు ఒరగబెట్టాల్సింది ఏమీ లేదు.. తమ రాష్ట్రంపై ప్రత్యేకంగా ప్రేమ కురిపించక్కర్లేదు. విభజన చట్ట ప్రకారం ప్రత్యేకహోదా దగ్గరినుంచి రావాల్సినవన్నీ సకాలంలో ఇచ్చి ఉంటే గనుక.. ఈ రాష్ట్రం రూపురేఖలు, ముఖచిత్రం మొత్తం మారిపోయి ఉండేదనే భావన ప్రజల్లో ఉంది. అది పార్టీ మీద ద్వేషంగా మారింది. ఈ నేపథ్యంలో  కొత్తగా  ఆ పార్టీ రాష్ట్రంలో ఒంటరిగా ఒకటిరెండు సీట్లు కూడా గెలిచే చాన్స్ లేదు. ఏదో కేంద్రంలో పార్టీ అధికారంలో ఉన్నది గనుక.. రాష్ట్రంలో నాయకులు హడావుడి చేస్తున్నారే తప్ప లేకపోతే ఈ పాటికి కనుమరుగైపోయి ఉండేది. 

ఇలాంటి పరిస్థితుల్లో.. తమకు నిజమైన రాజకీయ భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్న వారు.. బిజెపిలో కొనసాగడాన్ని అర్థంలేని చర్యగా భావిస్తున్నారు. పైగా సోము వీర్రాజు నాయకత్వం అనేది పార్టీకి ఒక శాపంగా మారింది. ఆయన ఒంటెత్తు పోకడలు పలువురిని అసహనానికి గురిచేస్తున్నాయి. దాంతో నాయకులు.. తమ దారి తాము చూసుకుంటున్నారు. కన్నా లక్ష్మీనారాయణ పార్టీనుంచి వెళ్లిపోయినప్పుడే.. ఇలాంటి వలసలు ఇంకా ఉంటాయనే గుసగుసలు వినిపించాయి. ఇప్పుడు విష్ణుకుమార్ రాజు వంతు వచ్చినట్టుగా కనిపిస్తోంది. పార్టీ అధిష్ఠానం ఇప్పటికైనా మేలుకుని చర్యలు తీసుకోకపోతే గనుక.. ఇంకా వలసలు అనేకం పార్టీనుంచి జరుగుతాయని అంతా అనుకుంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles