భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఇప్పుడు ఏ పార్టీలో చేరుతారు అనేది ఆసక్తికరంగా మారుతోంది. కన్నా లక్ష్మీనారాయణకు జనసేన పార్టీ నుంచి ఆహ్వానం ఉంది. ఆ పార్టీలో నెంబర్ 2 పొజిషన్లో ఉన్న నాదెండ్ల మనోహర్, ఇటీవల కన్నా ఇంటికి వెళ్లి మరీ మంతనాలు జరిపారు. ఆయనను జనసేన పార్టీలోకి ఆహ్వానించినట్లుగా అప్పట్లో గుసగుసలు వినిపించాయి. అయితే గుంటూరు జిల్లాలో స్థానిక రాజకీయ సమీకరణలను దృష్టిలో ఉంచుకొని కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం లో చేరడానికే మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. కన్నా చేరిక తెలుగుదేశానికి ఆ జిల్లాలో అదనపు బలం అవుతుందనటంలో సందేహం లేదు. అయితే కన్నా లక్ష్మీనారాయణ తో కొన్ని దశాబ్దాల శత్రుత్వాన్ని కొనసాగిస్తున్న రాయపాటి సాంబశివరావు మాత్రం దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. . కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం లో చేరడానికి వీలులేదని, ఆయన చేరితే అప్పుడు ఏం చేయాలో తనకు తెలుసునని రాయపాటి అంటున్నారు. కన్నా అడుగు పెట్టడానికి ముందే, రాయపాటి తిరుగుబాటు ధ్వని వినిపిస్తున్నారు.
ఇప్పుడు పార్టీ వర్గాలలో ఒకటే చర్చ నడుస్తోంది. కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం లో చేరకుండా మోకాలు అడ్డడం అనేది రాయపాటి సాంబశివరావు సాధ్యమేనా అని! ఒకప్పటిలో ఈ ఇద్దరు కాంగ్రెస్ నాయకులే. రాష్ట్ర విభజన నేపథ్యంలో రాయపాటి సాంబశివరావు తెలుగుదేశం లో చేరితే, కన్నా లక్ష్మీనారాయణ కమల తీర్థం పుచ్చుకున్నారు. రాయపాటి సాంబశివరావు వయసు రీత్యా రాజకీయ ఆక్టివిటీ తగ్గించారు. పోలవరం నిర్మాణ కాంట్రాక్టు మాత్రం ఆయన సంస్థ చేతిలో ఉండేది. గత ఎన్నికలలో ఆయన పోటీ కూడా చేయనేలేదు. కానీ కన్నా లక్ష్మీనారాయణ రాజకీయంగా ఇంకా యాక్టివ్‌గా ఉన్నారు.
గుంటూరు జిల్లాలో తమకు కన్నా అదనపు బలం అవుతారని తెలుగుదేశం విశ్వాసం. అలాగే బిజెపికి రాష్ట్ర సారథిగా పనిచేసిన నాయకుడు కావడం వలన.. కాపు సామాజిక వర్గంలో రాష్ట్రంలోనే బలమైన నాయకులలో ఒకరు కావడం వలన.. మరి కాస్త అదనపు అడ్వాంటేజీ వస్తుందని కూడా తెలుగుదేశం భావిస్తోంది. ఆయన రాకపట్ల వారు ఇన్ని సానుకూల అంశాలను చూస్తుండగా, కేవలం తన వ్యక్తిగత వైరం కారణంగా వ్యతిరేకిస్తున్న రాయపాటి సాంబశివరావు తన మాటకు మన్నన దక్కించుకోగలరా? అనేది పార్టీ వర్గాలలో ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంటోంది.