కన్నాకు ఎసరు పెడుతున్న కోడెల శివరాం!

Wednesday, January 22, 2025

బిజెపి నుండి తెలుగు దేశం పార్టీలో చేరిన మూడు నెలలకే కోరుకున్నట్లు సత్తెనపల్లి ఇన్ ఛార్జ్ గా నియమించడంతో ఉత్సాహంగా ఉన్న మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ వచ్చే ఎన్నికలలో అక్కడి నుండి గెలిచేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. నాలుగేళ్లుగా అనేక నియోజకవర్గాలలో ఇన్ ఛార్జ్ ల విషయం తేల్చకుండా నానబెడుతున్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కన్నా విషయంలో మాత్రమే సత్వరం స్పందించారు.

అయితే, తండ్రి కోడెల శివప్రసాదరావు స్పీకర్ గా ఉన్నప్పటి నుండి సత్తెనపల్లిలో టిడిపి వ్యవహారాలు చూస్తున్న కోడెల శివరాంకు ఈ పరిణామం మింగుడుపడలేదు. వచ్చే ఎన్నికలలో టిడిపి అభ్యర్థిగా పోటీచేసేందుకు రంగం సిద్ధం చేసుకొంటున్న తనకు తండ్రి మరణించిన తర్వాత ఒకసారి కూడా తనకు కలవాలని ప్రయత్నించినా చంద్రబాబు ఇంటర్వ్యూ కూడా ఇవ్వకపోవడంతో ఆగ్రహంగా ఉన్నది.

జిల్లా టిడిపి నేతలు వచ్చి నచ్చచెప్పినా వినకుండా ఏదేమైనా సరే వచ్చే ఎన్నికలలో కన్నా ఏవిధంగా గెలుస్తారో చూస్తా అంటూ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు జరుపుతున్నారు. తండ్రి ఉన్న సమయంలో, ఆ తర్వాత కూడా పార్టీ శ్రేణుల నుండే తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటు వస్తున్న శివరాం ఇప్పుడు ఒకవిధమైన సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు.

సత్తెనపల్లి మండలం పెద్దమక్కెన గ్రామంలో ఇంటింటికి కోడెల, పల్లె నిద్ర కార్యక్రమాన్ని జరిపిన సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పల్నాడు గడ్డ మీద పసుపు జెండా చూడగానే గుర్తొచ్చే నాయకుడు కోడెల శివప్రసాదరావు అంటూ తనను ఒంటరి వాడిని చేసి చుట్టుముట్టి ఎన్నో కుట్రలు చేస్తున్నారని చెబుతూ పార్టీ శ్రేణులపై సానుభూతి అస్త్రం ప్రయోగిస్తున్నారు.

పదవుల కోసం అధికారం కోసం పార్టీలు మారే కుటుంబం తమది కాదని అంటూ పరోక్షంగా కన్నాపై విమర్శలవర్షం కురిపించారు. కాంగ్రెస్ లో సుదీర్ఘకాలం ఎమ్యెల్యేగా, మంత్రిగా ఉంటూ ముఖ్యమంత్రి పదవికోసం కూడా ప్రయత్నం చేసిన కన్నా ఆ పార్టీ ఏపీలో మనుగడ కోల్పోగానే బీజేపీలో చేరి రాష్ట్ర అధ్యక్ష పదవి పొందారు. కాంగ్రెస్ లో చేసిన్నట్లు బీజేపీలో సాధ్యం కాకపోవడంతో ఆ పార్టీ నుండి బైటకు వచ్చి టిడిపిలో చేరారు.

గతంలో కాంగ్రెస్ లో ఉన్నప్పుడు టిడిపిని తీవ్రంగా విమర్శించే నేతగా గుర్తింపు పొందారు. తొలుత ఎన్టీ రామారావు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడుపై వ్యక్తిగత విమర్శలకు దిగేవారు. 2014లో టిడిపి అధికారంలోకి రావడంతో కేవలం రక్షణకోసమే బీజేపీలో చేరారనే ప్రచారం ఉంది. ఇప్పుడు టిడిపిలో చేరి గతంలో తాను గెలుపొందిన పెదకూరపాడు, గుంటూరు-2 నియోజకవర్గాలను కాకుండా సత్తెనపల్లి కోరుకోవడంలోనే ఆయనలో ప్రజలు తిరస్కరిస్తారనే భయం వ్యక్తం అవుతుంది.

ముఖ్యంగా సత్తెనపల్లిలో వైసిపి మంత్రి అంబటి రాంబాబు పట్ల సొంత పార్టీలోనే తీవ్ర ప్రతికూలత ఉండడంతో తనకు కలిసొస్తుందని కన్నా ఈ నియోజకవర్గం ఎన్నుకున్నట్లు స్పష్టం అవుతుంది. అయితే ఒకప్పటి ఆయన సహచరులు, మద్దతుదారులు పలువురు వైసిపిలో చేరడంతో ఒకవిధంగా కన్నా కొంత ప్రతికూలతను ఎదుర్కొంటున్నారు. మరోవంక, కోడెల మద్దతుదారులు ఏమేరకు కన్నాకు హృదయపూర్వకంగా మద్దతు ఇస్తారో చూడాల్సి ఉంది.

కోడెల శివప్రసాదరావు స్థానంలో కన్నాను తీసుకు రావడం పట్ల కోడెల శివరాం అంగీకరింపలేక పోతున్నారు. జిల్లా టిడిపి నేతలు వచ్చి సర్ధిచెప్పినా వినిపించుకోవడం లేదు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసేందుకు సిద్దపడుతున్నారు. అయితే, సొంతగా గెలిచే అవకాశం లేకపోయినా టిడిపి అభ్యర్థి కన్నాను ఓడించే అవకాశం లేకపోలేదని పరిశీలకులు భావిస్తున్నారు.

పల్నాటి పులి కోడెలతో నడచిన తాను పిల్లుల పక్కన నడిచేది లేదని స్పష్టం చేస్తూ కోడెల అభిమానులను రెచ్చగొట్టే ప్రయత్నం శివరాం చేస్తున్నారు. మరోవంక, కన్నాకు సహితం ఈ ఎన్నికలు కీలకమైనవి. ఇప్పటికే 66 ఏళ్ళు దాటినా ఆయన ఇప్పటికే రెండు ఎన్నికలలో ఓటమి చవిచూశారు. మరోసారి ఓటమి చెందితే ఇక రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్ధకరం కావచ్చని భావిస్తున్నారు. అందుకనే గెలుపుకోసం అన్ని అస్త్రాలను ప్రయోగించే అవకాశం ఉంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles