కనిపించినంత ఐక్యత ఇం.డి.యా.లో ఉందా?

Friday, November 15, 2024

ఐక్యత అనేది ఒక్కటే పరమ లక్ష్యంగా వారందరూ కూడా జట్టు కట్టారు. ప్రధానిగా నరేంద్ర మోడీని గద్దె దించి, భాజపాయేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే వారికి ఉన్న ఒకే ఒక్క ఆశయం. నరేంద్ర మోడీ మూడోసారి కూడా గెలిచి పరిపాలనలో పాతుకుపోతే తమ తమ పార్టీలు ఉంటాయో, అంతర్ధానమైపోతాయో అనేది వారి భయం. ఇలాంటి భయాలతో జుట్టుకట్టిన పార్టీలు నిజానికి కొన్ని త్యాగాలు చేసి అయినా మరింత సమైక్యంగా ఉండవలసిన పరిస్థితి. ప్రస్తుతానికి మూడుసార్లు భేటీ అయిన ఇం.డి.యా. కూటమిలోని విపక్ష పార్టీలు, ప్రస్తుతానికి ఐక్యంగానే కనిపిస్తున్నాయి. అయితే కనిపిస్తున్నంత ఐక్యత వారి మధ్య నిజంగానే ఉన్నదా? ఎలాంటి పొరపొచ్చాలు, అభిప్రాయ భేదాలు, తగాదాలు లేకుండా పాలు పార్లమెంటు ఎన్నికల బరిలో నిలవడం సాధ్యమేనా అనే చర్చ ఇప్పుడు నడుస్తోంది.

విపక్షపార్టీల ఇండియా కూటమి ముంబైలో ముచ్చటగా మూడోసారి సమావేశం అయింది. సీట్ల సర్దుబాటు గురించి చర్చలు సాగించడం, కూటమి కన్వీనరును ఎంపిక చేసుకోవడం, కూటమికి ఒక ప్రత్యేక లోగోను జెండాను ఏర్పాటు చేసుకోవడం ఈ సమావేశం యొక్క ప్రధాన లక్ష్యాలు. అయితే ఈ ప్రధాన లక్ష్యాలలో ఏ ఒక్కటి కూడా పూర్తికాకుండానే రెండు రోజులపాటు జరిగిన ముంబాయి భేటీ ముగిసింది. కూటమి కన్వీనరును ఎంపిక చేయడానికి విపక్ష పార్టీలు భయపడిపోతున్నట్లుగా కనిపిస్తోంది. కన్వీనర్ పోస్టుకు చాలామంది రేసులో ఉన్న కారణంగా ఏ ఒక్కరిని ఎంపిక చేసినా సరే మిగిలినవారు అసంతృప్తికి గురి అయ్యే ప్రమాదం ఉన్నదని వారు ఆందోళన చెందుతున్నారు. అదే జరిగితే విపక్ష కూటమిలో బీటలు వారుతాయనే భయం వారికి ఉంది. అందుచేత కన్వీనరు రూపంలో కాకుండా 14 మంది సీనియర్ నాయకులతో సమన్వయ కమిటీ ఏర్పాటు ద్వారా ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నారు.

ఐక్యత ప్రధాన అవసరం అయిన ఈ కూటమికి కనీసం జెండా లోగోలను కూడా తేల్చుకోలేకపోవడం గమనార్హం. అశోక చక్రం లేని జాతీయ జెండా ఉండాలనే ప్రతిపాదన కాంగ్రెస్ వైపు నుంచి వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే అది కాంగ్రెస్ జెండా లాగానే కనిపిస్తుందనే భావనతో పలువురు విభేదించారని కూడా సమాచారం. అలాగే ప్రతిపాదిత లోగోలో కూడా అనేకమంది విపక్ష పార్టీల నాయకులు పేర్కొన్న మార్పు చేర్పులు చేసి వచ్చే సమావేశం నాటికి మళ్ళీభేటీ ఎదుట  పెడతారని అంటున్నారు.

సీట్ల సర్దుబాటు సంగతి ఇక చెప్పాల్సిన అవసరమే లేదు. జెండాను ఎజెండానే తేల్చుకోలేకపోయిన వారు సీట్ల సర్దుబాటు విషయంలో అంత త్వరగా ఒక కొలిక్కి వస్తారని అనుకోవడం భ్రమ. సాధ్యమైనంతవరకు కలిసి పోటీచేయాలని ముంబాయి సమావేశం తీర్మానించడం గమనిస్తే.. ఎన్నికల నాటికి కూడా సీట్ల సర్దుబాటు, ఏకాభిప్రాయం విషయంలో వీరి మధ్య నూరు శాతం సయోధ్య కుదరడం కష్టమే అని అనిపిస్తోంది. ఇన్ని లుకలుకల నడుమ ఇం.డి.యా. పేరుతో అడుగులు వేస్తున్న విపక్ష కూటమి ఏం సాధిస్తుందో వేచి చూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles