కనిపించని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన!

Monday, January 20, 2025

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంత్రివర్గంలో వ్యక్తిగతంగా సౌమ్యుడిగా, విషయం పరిజ్ఞానం గల వ్యక్తిగా ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి పేరుంది. జగన్ పాలనలో రాష్ట్రం ఆర్థికంగా ఎన్ని సమస్యలను ఎదుర్కొంటున్నా, ప్రతి నెలా సంక్షేమ పథకాలకు నగదు విడుదలకు, జీతభత్యాలు సమస్యలు ఎదుర్కొంటున్నా ఇప్పటివరకు ఏదోవిధంగా సర్దుబాటు చేసుకొంటూ వచ్చారు.

ఏపీ అప్పులపై ఎన్ని విమర్శలు తలెత్తుతున్నాయి ఏదో విధంగా అంతా సవ్యంగా ఉండనే అభిప్రాయం కలిగిస్తూ వచ్చారు. అయితే, ఏపీ బిజెపి అధ్యక్షురాలిగా డి పురందేశ్వరి పదవీ బాధ్యతలు స్వీకరిస్తూనే ఏపీ అప్పుల మీద వరుసగా అస్త్రాలు ప్రయోగిస్తూ రావడంతో వైఎస్ జగన్ ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరి అవుతోంది. నేరుగా సమాధానం చెప్పే సాహసం చేయలేక పోతున్నారు.

పార్లమెంట్ లో డొంకతిరుగుడు జవాబులు ఇవ్వడం ద్వారా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొంతవరకు ఆదుకొనే ప్రయత్నం చేశారు. అయినా తమ పార్టీ సీనియర్ మంత్రి మాటలను సహితం కొట్టిపారవేస్తూ జగన్ ప్రభుత్వంపై తన ప్రచార అస్త్రాలను పురందేశ్వరి సంధిస్తూనే వస్తున్నారు.

ఇటువంటి పరిస్థితులలో ప్రభుత్వం పక్షాన నిలబడి, పురందేశ్వరి మాటల తూటాలను ఎదుర్కొని, ఘాటైన సమాధానాలతో ప్రతిపక్షం నోరు మూసే ప్రయత్నం చేయాల్సిన బాధ్యత ఆర్ధిక మంతిర్పై ఉంటుంది. అయితే ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రజల దృష్టికి దూరంగా ఉండటంతో ఆయన ఆచూకీ చర్చకు దారితీసింది.

వైసీపీ సభ్యులకు కూడా ఆయన ప్రస్తుతం అందుబాటులో లేరని చెబుతున్నారు. నిత్యం ప్రతిపక్షాల విమర్శలను ఘాటుగా తిప్పికొట్టే `సకల శాఖల మంత్రి’గా పేరొందిన సజ్జల రామకృష్ణారెడ్డి సహితం పురందేశ్వరి విమర్శలపై నోరు విప్పలేక పోతున్నారు. రోజా వంటి మంత్రులు, విజయసాయిరెడ్డి వంటి నేతలు ఆమెను `టిడిపి స్క్రిప్ట్’ చదువుతున్నారనో, బీజేపీలో ఉంటూ టిడిపి కోసం పనిచేస్తున్నారనో అర్థంలేని విమర్శలు చేయడం మినహా పురందేశ్వరి లేవనెత్తిన అంశాలకు సూటిగా సమాధానం చెప్పే సాహసం చేయలేక పోతున్నారు.

ఇటువంటి సమయంలో మీడియాను ఉద్దేశించి ప్రసంగించే సామర్థ్యం, ఆకట్టుకునే వక్తృత్వ నైపుణ్యానికి పేరుగాంచిన బుగ్గన కనిపించక పోవడం ప్రజల్లో ప్రశ్నలను దారితీస్తుంది. ఏపీ ఆర్థిక మంత్రి ప్రస్తుతం ఢిల్లీలో ఉండి ఆర్థిక వ్యవహారాలన్నింటినీ పర్యవేక్షిస్తున్నారని అధికార వర్గాలు తెలుపుతున్నాయి.  ఆయన నెలలో ఎక్కువ సమయందేశ రాజధానిలో గడుపుతున్నాడని, రుణాలను పొందేందుకు ఆర్థిక సంస్థలతో నిమగ్నమై ఉంటాడని సమాచారం.

అదనపు నిధులు మంజూరు చేసేందుకు బుగ్గన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులతో నిత్యం `లాబీ’ నడుపుతూ ఉంటారు. అయితే పురందేశ్వరి ఆరోపణలపై మౌనంగా ఉండటం వైసిపి వర్గాలకు సహితం విస్మయం కలిగిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ అప్పులు  రూ. 10 లక్షల కోట్లకు చేరుకున్నాయని పురందేశ్వరి బహిర్గతం చేయడంతో వైసీపీ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ ఎంత అధ్వాన్నంగా ఉంది వెల్లడవుతుంది.  ఇటువంటి సమయంలో ప్రతిపక్షాలను, మీడియాను నేరుగా ఎదుర్కోవడం కంటే బుగ్గన వ్యూహాత్మక మౌనాన్ని ఎంచుకున్నారని తెలుస్తున్నది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles