మాజీ మంత్రి, తన బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి ఎన్నికలకు కొద్దీ రోజుల ముందు జరగడంతో ఎన్నికల సమయంలో ప్రజల సానుభూతి పొందేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎంతగానో సహకరించింది. పైగా, హత్య వెనుక ఆ సమయంలో అధికారంలో ఉన్న టీడీపీ నేతల కుట్ర ఉన్నట్లు విస్తృతంగా ప్రచారం కూడా చేశారు.
అయితే నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు తాజాగా సిబిఐ దర్యాప్తులో వెల్లడవుతున్న అంశాలతో ఈ కేసు కడప జిల్లా రాజకీయాలలో అగ్గి రాజేస్తున్నది. అధికార పక్షాన్ని దోషిగా నిలిపేందుకు ప్రతిపక్షాలకు బలమైన ఆయుధంగా మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.
ఇప్పుడు ఈ కేసులో వైఎస్ జగన్ కు సన్నిహితులుగా భావిస్తున్న మరో బాబాయి వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ కావడం, ఆయన కుమారుడు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని కీలక వ్యక్తిగా పేర్కొంటూ అరెస్ట్ చేయాల్సిందే అంటూ సిబిఐ హైకోర్టులో స్పష్టం చేయడంతో ఒక విధంగా జగన్ ఆత్మరక్షణలో పడే పరిస్థితి కనిపిస్తున్నది.
గత నెలలో జరిగిన పట్టభద్రుల ఎమ్యెల్సీ ఎన్నికలలో మొదటిసారిగా పులివెందులలో టీడీపీ ఆధిక్యత సాధించడమే కాకుండా, అక్కడి వ్యక్తి టిడిపి అభ్యర్థిగా గెలుపొందడంతో పులివెందులలో టిడిపి శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. శాసనమండలి ఎన్నికల్లో టిడిపి విజయం సాధించడం వైసిపిలో భూకంపం పుట్టించిందని చంద్రబాబునాయుడు తెలిపారు. ఈ ఎన్నికలలో వైఎస్ వివేకా హత్య అంశం సహితం కొంత ప్రభావం చూపినట్లు భావిస్తున్నారు.
ఇక, 2024 ఎన్నికలలో టిడిపికి కీలక ప్రచార అస్త్రంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కడప జిల్లా పర్యటనకు వెళ్లిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఈ కేసును ప్రధానంగా ప్రస్తావించడం గమనార్హం. వైఎస్ వివేకానందెడ్డి హత్య కేసును ప్రజా కోర్టులో పెడతామని ఆయన ప్రకటించారు. వివేకానందరెడ్డి హత్య కేసులో రోజుకొక్క కథనం ప్రచారంలోకి రావడాన్ని ప్రస్తావిస్తూ ప్రపంచంలోని పోలీసు అధికారులకు ఓ కేస్ స్టడీ అని పేర్కొంటూ నేరం నుంచి తప్పించుకోడానికి వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు.
హత్యలుచేయడం, కేసులు లేకుండా తప్పించుకోవాలనిచూస్తున్నవారిని ప్రజాకోర్టులో శిక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని టీడీపీ అధ్యక్షుడు స్పష్టం చేశారు. వివేకాను చంపినవారికి ఎప్పటికైనా శిక్ష తప్పదని చెబుతూ బాబాయ్ ని చంపినవారు ప్రజల భవిష్యత్ కు ఆశాజ్యోతులా? అని నిలదీశారు. హత్యచేసినవారిని విచారణకుపిలిస్తే శాంతియుత ర్యాలీలు చేయడం ఏమిటని ప్రశ్నిస్తూ చేయాల్సింది శవర్యాలీలని ఎద్దేవా చేశారు.
ఈ కేసులో నిందితులు సీబీఐ అధికారులను సైతం బెదిరించారని, వివేకాను గొడ్డలితో నరికి గుండెపోటుగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. మీకు అడ్డువచ్చిన వారందర్నీ చంపేస్తారా? అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రౌడీల తోకలు కట్ చేస్తామని హెచ్చరించారు. తన తండ్రిని చంపిన వారెవరో తెలియాలని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె పోరాడుతున్నారని చంద్రబాబు పేర్కొన్నారు.
టిడిపి అధికారంలో ఉన్నప్పుడే రాయలసీమలో ఫ్యాక్షనిజంను కట్టడి చేశామని గుర్తు చేస్తూ వైసీపీ ప్రభుత్వం నేరమయ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నదని ఆరోపించారు. విపక్షాల పొలిటికల్ ఎజెండాలో భాగంగానే అవినాష్‌కు వ్యతిరేకంగా వార్తలు ప్రచురిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించడం గమనార్హం. అంటే, వచ్చే ఎన్నికల ప్రచారంలో కడపజిల్లాలో ఈ అంశం ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉన్నట్లు నిర్ణయానికి వచ్చిన్నట్లు స్పష్టం అవుతుంది.
వివేకా కేసును రాజకీయ ఎజెండాలో భాగంగానే టిడిపి వాడుకుంటోందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు క్షుద్ర విన్యాసంలో భాగంగానే ఇదంతా నడుస్తోందని, ఓ ప్లాన్ ప్రకారమే పొలిటికల్ ఎజెండాగా మార్చుకున్నారని ఆయన విమర్శలు గుప్పించారు.
మరోవంక, సిబిఐ దర్యాప్తు తీరుపట్ల కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేసారు. ముందుగా నిర్ణయించుకున్నట్లుగానే దర్యాప్తు చేస్తున్నారని, వైఎస్ భాస్కర్‌రెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డిలను ఇరికించే కుట్రకు తెరలేపారనిఅంటూ ఆరోపించారు. నేరం మోపాలని ముందుగానే నిర్ణయానికి వచ్చారని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.