కందుకూరులో చంద్రబాబు నాయుడు బహిరంగ సభ సందర్భంగా జరిగిన దుర్ఘటనలో ఎనిమిది మంది మృతి చెందిన సంఘటనపై మరుసటి రోజు ఉదయమే ప్రధాని నరేంద్ర మోదీ స్పందించడంతో, కొద్దీ గంటల ముందే ఆయనను కలిసి, ఇంకా ఢిల్లీలోనే ఉన్న ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కంగుతిన్నటు తెలుస్తున్నది. అప్పటి వరకు ముఖ్యమంత్రి గాని, రాష్ట్ర మంత్రులు గాని, కనీసం జిల్లాలోని వైసీపీ నాయకులు గాని ఈ దుర్ఘటనపై కనీసం సానుభూతి వ్యక్తం చేయలేదు. మృతుల కుటుంబాలకు సంతాపం కూడా తెలపలేదు.
“జరిగిన దుర్ఘటన వల్ల తీవ్రంగా కలత చెందానని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు ప్రధాని ట్విటర్ వేదికగా గురువారం ఉదయమే తెలిపారు. అలాగే మృతి చెందిన వారి ఒక్కొక్క కుటుంబానికి పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ. 2 లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రధాని ప్రకటించారు. గాయపడిన వారికి రూ. 50 వేలు ప్రకటించారు.
అప్పుడు తీరుబడిగా జగన్ సహితం సంతాపం ప్రకటించి, ప్రధాని ప్రకటించిన విధంగానే సీఎం సహాయనిధి నుండి సహాయాన్ని ప్రకటించారు. ఆ వెంటనే వరుసగా మంత్రులు, వైసీపీ నేతలు ఈ ప్రమాదానికి చంద్రబాబు నాయుడు కారణం అని, ఆయనను మొదటి ముద్దాయిగా కేసు నమోదు చేయాలి అంటూ ప్రకటనలు ఇవ్వడం ప్రారంభించారు.
ఇరుకైన వీధులలో సభ పెట్టడమే నేరమైతే, శాంతిభద్రతలు పర్యవేక్షింప వలసిన పోలీసులు ఏమి చేస్తున్నారు? పోలీసులు ఎందుకు అనుమతి ఇచ్చారు? అనే ప్రశ్నలు వస్తాయి. భారీగా జనం వస్తున్నప్పుడు వారిని నియంత్రించడం పోలీసుల విధి కాదా? రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర జరుపుతూ ఉంటె కేంద్ర ప్రభుత్వమే భద్రతా వ్యవహారాలు పర్యవేక్షిస్తుంది.
తెలంగాణాలో బండి సంజయ్, వై ఎస్ షర్మిలలు జరుపుతున్న పాదయాత్రలకు తెలంగాణ ప్రభుత్వం బందోబస్తు ఏర్పాటు చేస్తున్నది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్ పాదయాత్ర జరిపిన సమయంలో అవసరమైన భద్రతను నాటి టిడిపి ప్రభుత్వంలో పోలీసులు కల్పించారు.
కానీ జగన్ ప్రభుత్వంలో ప్రతిపక్షాల సభలు, కార్యక్రమాల పట్ల పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నట్లు కందుకూరు దుర్ఘటన స్పష్టం చేస్తున్నది. సాధారణంగా, తుఫానులు, విపత్తులు, వరదలు, వంటి ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా జరిగే దుర్ఘటనలపై ప్రధాని స్థాయిలో వారు ఎక్కువగా స్పందిస్తుంటారు. అయితే ఎక్కడో ఓ జిల్లా స్థాయిలో జరిగిన ఒక రాజకీయ పార్టీ సభలో జరిగిన దుర్ఘటనపై ప్రధాని స్థాయిలో అత్యంత వేగంగా స్పందించటం చాలా అరుదుగా జరుగుతుంటుంది.
దానితో, కందుకూరు ఘటనలో ప్రధాని స్పందనకు రాజకీయంగానూ ప్రాధాన్యం ఏర్పడింది. ఏపీలో చంద్రబాబు ఎక్కడ సభలు జరుపుతున్న జనం పెద్ద సంఖ్యలో వస్తుండటాన్ని కేంద్ర నిఘా వర్గాలు సన్నిహితంగా గమనిస్తున్నట్లు వెల్లడవుతుంది. టిడిపి పనైపోయిందంటూ జగన్ ఢిల్లీ వెళ్ళి ప్రధాని మోదీ, అమిత్ షా లకు ఇచ్చిన నివేదికల డొల్లతనం సహితం ఈ సందర్భంగా బహిర్గతమైన్నట్లు చెప్పవచ్చు.
రాజకీయ కారణాలతోనే ప్రధాని సత్వరం స్పందించారని పరిశీలకులు భావిస్తున్నారు. కేంద్ర నిఘా వర్గాలతో పాటు జాతీయ మీడియా సైతం తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో ఫోకస్ పెట్టిన్నట్లు కనిపిస్తున్నది. దీర్ఘకాలం తర్వాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు గల కారణాలపై ఆసక్తికర కథనాలు ప్రచురించసాగాయి.