ఓవరాక్షన్‌తో చిక్కులు కొని తెచ్చుకున్న విజయసాయి!

Monday, November 25, 2024

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పార్లమెంటరీ పార్టీ సారధి విజయసాయిరెడ్డి ఇప్పుడు సొంత పార్టీని చిక్కుల్లోకి నెట్టారు. నోటి దూకుడుకు, లేకి మాటలకు, రాజ్యసభ ఎంపీ వంటి అత్యున్నత హోదాకు అనుచితమైన రీతిలో, అసహ్యమైన భాషలో చేసే వ్యాఖ్యలకు పేరు మోసిన విజయసాయిరెడ్డి .. తన మాట తీరు మార్చుకోకుండా న్యాయవ్యవస్థను కించపరిచేలా సభలో చేసిన ప్రసంగం ఇప్పుడు అత్యంత వివాదాస్పదం అవుతోంది. విజయసాయిరెడ్డి ప్రసంగంలో వాడిన భాష, చేసిన వ్యాఖ్యల పట్ల సాక్షాత్తు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ నివ్వెర పోవడం గమనార్హం. ప్రజాస్వామ్య వ్యవస్థకు అత్యంత కీలకమైన మూడు విభాగాలలో ఒకటైన న్యాయ వ్యవస్థపై ఇలాంటి నిందలు వేసే ముందు మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో చెప్పాలంటూ రాజ్యసభ చైర్మన్ విజయసాయిరెడ్డిని నిలదీయడం నిర్దేశించడం గమనించాల్సిన విషయం.
విజయసాయిరెడ్డి మూడు రాజధానుల టాపిక్‌ను మళ్లీ హాట్ హాట్‌గా వార్తల్లోకి తేవాలని అనుకున్నారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల సమాన అభివృద్ధి లక్ష్యంతో తమ ప్రభుత్వం అధికార వికేంద్రీకరణ మూడు రాజధానుల ఆలోచన చేసిందని ఆయన చెప్పుకొచ్చారు. అయితే న్యాయవ్యవస్థ ఓవర్‌రీచ్ వలన ఆ వికేంద్రీకరణ ఫలాలు ప్రజలకు అందలేదని ఆయన వ్యాఖ్యానించారు. అంటే న్యాయవ్యవస్థ చేసిన నిర్వాకం వలన తాము ప్రజలకు తలపెట్టిన మంచి జరగలేదు అని విజయ సాయి వ్యాఖ్యానించారు. ఈ మాటలు కాస్తా వివాదాస్పదం అయ్యాయి.
ఓవర్‌రీచ్ అనే పదానికి వంచించడం, మోసం చేయడం అనే అర్థాలు ఉండడంతో న్యాయ వ్యవస్థను ఉద్దేశించి ఆ పదం వాడడం పట్ల అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. గౌరవ రాజ్యసభ సభ్యుడు సాక్షాత్తూ పార్లమెంటులోనే ఇలాంటి వ్యాఖ్య చేయడం సంచలనంగా మారుతోంది. అసలే న్యాయమూర్తుల మీద అత్యంత నీచమైన సోషల్ మీడియా పోస్టులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరువు పోగొట్టుకుంది. తాజాగా ఇంగ్లీషు భాషలో అనుచితమైన వ్యాఖ్యలు అర్థం తెలిసి చేశారో తెలియకుండా చేశారు గానీ మరోసారి న్యాయవ్యవస్థ మీద బురదజల్లే ప్రయత్నం విజయసాయిరెడ్డి చేశారు.
మూడు రాజధానులకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పుకోవడానికి విజయసాయిరెడ్డి చాలా ప్రయత్నించారు. రాజధాని అనేది పూర్తిగా రాష్ట్రం పరిధిలోని వ్యవహారం అని, కేంద్ర ప్రభుత్వం గానీ న్యాయ వ్యవస్థ గాని అందులో జోక్యం చేసుకోలేవు అని ఆయన చేసిన వ్యాఖ్యానాలు మరో వివాదానికి కారణం అవుతున్నాయి. ఇలాంటి మాటలు చెప్పడానికి ఆయన రాజ్యాంగంలోని కొన్ని అధికరణాలను ఉదాహరించారు గాని వాటిని కూడా తన దృష్టి కోణంలో నుంచి అర్థం చేసుకొని తప్పుడు వ్యాఖ్యానాలతో భాష్యం చెబుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి విజయసాయిరెడ్డి తన ఓవరాక్షన్ ద్వారా చిక్కులను కొని తెచ్చుకున్నారు. రాజ్యసభ చైర్మన్ ఆదేశాల మేరకు ఆయన ఏ సాక్ష్యాలు ఆధారాలు చూపి తన పరువు కాపాడుకుంటారు గమనించాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles