ఓటమి వీరులను చంద్రబాబు వదులుకోగలరా!

Monday, January 20, 2025

ప్రతి ఎన్నికల సమయంలో గెలిచే అవకాశం ఉన్నవారికి, నియోజకవర్గంలో పట్టు ఉన్నవారికే సీట్లు ఇస్తానని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేస్తూ వస్తుంటారు. కానీ తీరా ఎన్నికలు వచ్చేసరికి ఆ మాటమీద నిలబడ్డారు. అందుకు ప్రధాన కారణం ఆయన చుట్టూ చేరిన ప్రజలతో సంబంధం లేని `కోటరీ’ కారణంగా చెబుతూ ఉంటారు. గత ఎన్నికల సమయంలో కూడా జేసీ దివాకరరెడ్డి వంటి నాయకులు వెళ్లి పార్టీ ఎమ్యెల్యేలు తీవ్ర ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటున్నారని, కనీసం 40 మందిని అయినా మార్చితే `గౌరవనీయమైన’ ప్రతిపక్ష స్థానం వస్తుందని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అయితే `కోటరీ’ వత్తిడుల కారణంగా పాతవారికే సీట్లు ఇచ్చి బొక్కబోర్లా పడ్డారు.

ఆ తర్వాత తన చుట్టూ ఉన్న `కోటరీ’ని కొంతకాలం దూరం పెట్టారు. అయితే ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయనగానే వారంతా వచ్చి తిరిగి ఆయన చుట్టూ చేరారు. వారే తిరిగి చంద్రబాబుపై ప్రభావం చూపుతున్నారనే ప్రచారం టీడీపీ వర్గాల్లో ఉంది. క్షేత్రస్థాయి వాస్తవాలు పట్టని వారు రాష్ట్రంలో టీడీపీ ప్రభంజనం వీస్తోందని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.

ప్రజలతో సంబంధం లేని ఈ నేతలో టీడీపీ ప్రధాన కార్యాలయంలో పెత్తనం చేస్తూ,  ఇప్పటికీ బాబుని అడ్డం పెట్టుకుని చక్రం తిప్పుతున్నారు. అలాంటి వారిని పక్కన పెట్టుకుంటే 2024లో పార్టీకి విజయం ఎలా దక్కుతుంది? అని ప్రశ్నలు టిడిపి వర్గాలలో మరోసారి తలెత్తుతున్నాయి. 

గతంలో ఎన్నడూ లేని విధంగా ఓ బలమైన మరో ప్రాంతీయ పక్షంగా వైసీపీ అధికారంలో ఉంది. దాని అధినాయకుడు వైఎస్ జగన్ చంద్రబాబు మాదిరిగా మొహమాటాలు  అన్నవి అసలు లేకుండా  టికెట్ కోసం ఆయన సర్వేలను ఇతరత్రా నమ్ముకుని అన్నీ కుదిరితేనే ఇస్తున్నారు.   కానీ చంద్రబాబు మాత్రం అలా కాదు. తన మనసుకు నచ్చిన వారిని ఓడినా చేరదీస్తుంటారు. పైగా వారి ఆర్ధిక పరిస్థితులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అలా చూసుకుంటే 2004 నుంచి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కీలకమైన నియోజకవర్గం తునిలో యనమల కుటుంభం అయిదు సార్లు ఓడింది. 
యనమల 2004లో ఓడితే ఆయన తమ్ముడు క్రిష్ణుడు 2009, 2014, 2019లలో మూడు సార్లు ఓడారు. అయినా యనమల హవా  గోదావరి జిల్లాలలో తగ్గలేదు. మరోసారి ఆ కుటుంబానికే తుని టికెట్ అని అంటున్నారు. దీంతో ఆశావహులు ఇలా అయితే ఎలా సారూ అని పెదవి విరుస్తున్నారు.  ఇక యనమలకు 2025 వరకూ ఎమ్మెల్సీ పదవి ఉంది. 2024లో టీడీపీ అధికారంలోకి వస్తే ఆయనే మరోసారి ఆర్ధిక మంత్రి అని కూడా వినిపిస్తున్న మాట.

ఇదే తీరున నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హవా చలాయిస్తున్నారు. ఆయన కూడా వరసబెట్టి అయిదుసార్లు ఓటమి పాలు అయ్యారు.  ఆయన 2004 నుంచి ఇప్పటిదాకా తన సర్వేపల్లి నియోజకవర్గంలో గెలిచింది లేదు. అయినా చంద్రబాబు 2014లో అధికారంలోకి వస్తే ఆయన్ని ఎమ్మెల్సీని చేసి మరీ మంత్రిగా నియమించారు. ఇపుడు కూడా ఆయనకే నెల్లూరు జిల్లా పెత్తనం అప్పగించారు అని తమ్ముళ్ళు సణుగుతున్నారు.  వచ్చే ఎన్నికల్లో మరోసారి సోమిరెడ్డికి టికెట్ ఖాయమని, పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవీ ఖాయమని అంటున్నారు.

ఇంకో వైపు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు కూడా పార్టీని శాసిస్తున్నారు. ఆ మధ్యన పార్టీ లేదు బొక్కా లేదు అన్న నోటితోనే ఆయన ఇప్పుడు తెగ పొగుడుతున్నారు.
 ఇక ఆయన ఇంట్లో ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఉన్నారు. ఈసారి కూడా ఉన్న టికెట్లకు అదనంగానే టికెట్లు తీసుకుంటారేమో కానీ ఈ సంఖ్య తగ్గదని అంటున్నారు. అదే విధంగా చూసుకుంటే ఇదే మాదిరిగా సీనియర్లుగా చెప్పుకునే కీలక నేతలు కొందరు టీడీపీలో ఈ రోజుకీ చక్రం తిప్పుతున్నారు.

వీరిని ఎవరైనా ఎదిరిస్తే క్రమశిక్షణా చర్యల పేరిట వేధింపులు ఎదుర్కోవలసిందే. నూతన తరంకు ప్రోత్సాహం ఇస్తామని మాటలకే పరిమితం అవుతున్నారు. గత ఐదేళ్లుగా పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీ కార్యక్రమాలలో కనిపించని వారు ఇప్పుడు తిరిగి ఆక్టివ్ అవుతున్నారు. ఈ ఐదేళ్లు పార్టీకోసం అధికార పార్టీ వేధింపులకు తట్టుకొని, వీధులలో పోరాటాలు చేసిన నవతరం నాయకులను మాత్రం ఎన్నికల సమయంలో పక్కన పెట్టె పరిస్థితి కనిపిస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles