ఒవైసీని బిజెపి ఏజెంట్ గా కేసీఆర్ అనుమానిస్తున్నారా!

Saturday, January 18, 2025

రాష్ట్ర విభజనను చివరికంటా వ్యతిరేకిస్తూ వస్తున్న ఎంఐఎంతో విభజన జరగడంలో కీలక పాత్ర పోషించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధికారంలోకి వచ్చాక స్నేహం జరపడం, అప్పటి నుండి ఎంఐఎం రాజకీయ ప్రయోజనాలు కాపాడే విధంగా వ్యవహరించడం అందరికి తెలిసిందే. కేవలం ఒవైసీకి భయపడి కేసీఆర్ హిందువులకు అన్యాయం చేస్తున్నాడని నిత్యం బిజెపి నేతలు విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. 

దేశంలో అనేక రాష్ట్రాలలో డిపాజిట్లు రాకపోయినా అభ్యర్థులను  పోటీకి పెడుతున్న అసదుద్దీన్ ఒవైసీ తెలంగాణాలో మాత్రం హైదరాబాద్ పాత బస్తీని దాటి అభ్యర్థులను పోటీకి దింపడం లేదు. కేవలం ముస్లింల ఓట్లన్నీ టిఆర్ఎస్ కు దక్కేటట్లు చేయడం కోసమే ఆ విధంగా  చేస్తున్నట్లు విమర్శలు నెలకొన్నాయి. 

అయితే, కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు చూస్తూ, జాతీయ పార్టీగా బిఆర్ఎస్ ను ఏర్పాటు చేసినప్పటి నుండి ఉద్దేశపూర్వకంగా ఒవైసీని దూరంగా ఉంచుతున్నట్లు కనిపిస్తున్నది. ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా పోరాడుతున్న సమయంలో ఒవైసి రాజకీయాల పట్ల అనుమానాలతోనే దూరంగా ఉంచుతున్నట్లు తెలుస్తున్నది.

ఓ విధంగా ఒవైసీని బిజెపి ఏజెంట్ గా భావిస్తున్నట్లు స్పష్టం అవుతున్నది. టీఆర్ఎస్‌కు మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం ఆ పార్టీ బీఆర్ఎస్‌గా అవతరించాక కనీసం శుభాకాంక్షలు చెప్పకపోవడం గమనార్హం. డిసెంబరు 9న బీఆర్ఎస్ ఆవిర్భావ కార్యక్రమానికి కూడా ఒవైసి హాజరుకాలేదు. కర్నాటక నుంచి జేడీఎస్ నేత కుమరస్వామి, ప్రకాశ్ రాజ్ వంటి వారు హాజరయ్యారు కానీ.. అసదుద్దీన్ ఓవైసీ మాత్రం కనిపించలేదు. 

ఇక ఢిల్లీలో జరిగిన టీఆర్ఎస్ పార్టీ ప్రారంభోత్సంలోనూ ఆయన పాల్గొనలేదు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో అసదుద్దీన్ ఓవైసీ ప్రస్తుతంఢిల్లీలోనేఉన్నప్పటికీ ఆ కార్యక్రమానికి వెళ్లలేదు. ఈ నేపథ్యంలో కేసీఆర్, ఓవైసీల మధ్య దూరం పెరిగినదనే  ప్రచారం జరుగుతోంది. సీఎం కేసీఆర్ కావాలనే ఆయన్ను దూరం పెట్టినట్లు సమాచారం. 

తాజాగా, ఢిల్లీలో కేసీఆర్ ను కలసి తన కూతురి వివాహంకు హాజరు  కావాలని కోరుతూ వివాహ ఆహ్వాన పత్రికను అందించినా బిఆర్ఎస్ గురించిన ప్రస్తావన వచ్చిన్నట్లు తెలియడం లేదు. 

ఉత్తర ప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, గుజరాత్ … తదితర రాష్ట్రాలలో పెద్ద ఎత్తున ఎంఐఎమ్ అభ్యర్థులు పోటీ చేస్తుండటం వల్లన వారు ఎంతో కొంత ముస్లిం ఓటర్లను ఆకర్షిస్తూ, బిజెపి వ్యతిరేక ఓట్లలో చీలిక తెస్తున్నట్లు అనేక రాష్ట్రాల ఎన్నికలు స్పష్టం చేస్తున్నాయి. తాజాగా గుజరాత్ లో బిజెపి రికార్డు స్థాయిలో సీట్లు గెలుచుకోవడానికి సహితం ఆప్, ఎంఐఎం అభ్యర్థులు బిజెపి వ్యతిరేక ఓట్లను చీల్చడమే కారణంగా విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.  

పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో సహితం ఒవైసి అటువంటి ప్రయత్నం చేస్తినా, అక్కడి ముస్లింలు గ్రహించి తిరస్కరించారు. ఒవైసి పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం జరపడానికి, ప్రచారం కోసం ప్రత్యేక విమానాలలో తిరగడానికి సహితం బిజెపి వనరులు సమకూరుస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. అందుకనే, జాతీయ రాజకీయాలలో ఒవైసీ స్నేహం ఇబ్బందికరం కాగలదని కేసీఆర్ గ్రహించినట్లు కనిపిస్తున్నది. 

పైగా, కేసీఆర్ తో సన్నిహితంగా వ్యవహరిస్తున్న అఖిలేష్ యాదవ్, కుమారస్వామి వంటి వారు మొదటి నుండి ఒవైసీని `బిజెపి ఏజెంట్’గా అభివర్ణిస్తున్నారు. అటువంటి సమయంలో ఒవైసీకి సాన్నిహిత్యంగా ఉండడం రాజకీయంగా ప్రతికూలం కాగలదని కేసీఆర్ భావించినట్లు తెలుస్తున్నది. మరోవంక,  ఎంఐఎంతో దోస్తీ కొనసాగిస్తే ఉత్తరాది రాష్ట్రాల్లో హిందూ ఓటర్లకు దూరమవుతామనే భయం సహితం కేసీఆర్ ను వెంటాడుతున్నట్లున్నది. ఈ క్రమంలోనే ఎంఐఎం పార్టీకి దూరంగా ఉంటున్నారని పలువురు భావిస్తున్నారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles