జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసివస్తే కాపు సామాజికవర్గం ఎక్కువగా ఉన్న ఓ 20 నియోజకవర్గాలలో ప్రయోజనం కలుగుతుందని ఇంతకాలం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఎదురు చూస్తూ వచ్చారు. అయితే జగన్ వ్యతిరేక ఓట్లు చీలకూడదంటూ బిజెపిని కూడా తీసుకొస్తానని పవన్ చెబుతుంటే బిజెపికి నోటాకు మించి ఓట్లు లేకపోయినా, ఎలక్షన్ మానేజ్మెంట్ సులభంగా ఉంటుందని, జగన్ ప్రభుత్వ అక్రమాలను ఎన్నికలలో ఎదుర్కోవచ్చని టిడిపి నేతలు సహితం సిద్ధపడ్డారు.
అయితే ఈ విషయమై ఢిల్లీ వెళ్లిన పవన్ కళ్యాణ్ కు బిజెపి ధోరణి స్పష్టమైనది. బిజెపి, జనసేన కలిసి ఈ ఎన్నికలలో టిడిపిని ఓడిస్తే, 2029 ఎన్నికల నాటికి ఆ పార్టీ మనుగడలో ఉండబోదని, అప్పుడు మనమే అధికారంలోకి రావచ్చని కొత్త లాజిక్ ను ముందుకు తీసుకొచ్చారు. దానితో పవన్ కళ్యాణ్ సహితం ఎటూ తేల్చుకోలేక పోతున్నట్లు స్పష్టం అవుతుంది.
అందుకనే జనసేన, బీజేపీలతో పొత్తుకోసం ఎదురు చూడకుండా సొంతంగా పోటీచేసేందుకు చంద్రబాబు నాయుడు సిద్ధపడుతున్నట్లు తెలుస్తున్నది. జనసేన రాకుంటే వామపక్షాలతో పొత్తుకు వెళ్లేందుకు సై అంటున్నారు. పట్టభద్రుల ఎమ్యెల్సీ సీట్లు గెలుచుకోవడంలో వారి సహకారం కీలక పాత్ర వహించింది. కనీసం డజన్ సీట్లలో వామపక్షాల ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
మరోవంక, జనసేన ఒంటరిగా పోటీచేస్తే కాపు సామజిక వర్గం గంపగుత్తుగా ఆ పార్టీకి ఓటు వేసే అవకాశాలు లేవని అంచనా వేస్తున్నారు. వైఎస్ జగన్ ను ఓడించడమే లక్ష్యంగా పెట్టుకోవడంతో, ఓడించగల సత్తాగలవారికి ఓటు వేసే అవకాశం ఉంటుంది. అందుకనే గంటా శ్రీనివాసరావు, కన్నా లక్షనారాయణ, వంటవీటి రాధాలను కాపుల ప్రాబల్యం గల సుమారు 25 నియోజకవర్గాలపై దృష్టి సారింపచేసే బాధ్యతలు అప్పచెప్పుతున్నారు.
ఆయా అనియోజకవర్గాలలో కాపు సామాజికవర్గంకు చెందిన నేతలతో సమావేశాలు జరుపుతూ వారి ఓట్లలో చీలిక నివారించేందుకు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించారు. ఏదేమైనా, వారి ఓట్లు గంపగుత్తుగా జనసేనకు పడకుండా చేయడం ద్వారా టిడిపి అభ్యర్థులను గెలిపించుకునే ఎత్తుగడ వేస్తున్నారు. మరోవంక, జనసేనతో నేరుగా పొత్తులేకపోయినా లోపాయికారి అవగాహనకు సిద్దపడుతున్నారు.
జనసేన బలంగా ఉంది, టిడిపి గెలుపొందే అవకాశాలు లేని చోట్ల పోలింగ్ చివరి రోజులలో జనసేన అభ్యర్థులకు స్థానికంగా మద్దతు ఇవ్వడం ద్వారా వైసిపి అభ్యర్థులు గెలుపొందకుండా అడ్డుకొనేందుకు వ్యూహం రూపొందిస్తున్నారు. 2009లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం అధికారంలోకి రాకుండా చేయడం కోసం నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు లోపాయికారి అవగాహనతో సుమారు 40 నియోజకవర్గాలలో ప్రజారాజ్యం అభ్యర్థులను ఓడించినట్లు అంచనా వేస్తున్నారు.
ఏదేమైనా 2024లో వైసీపీ తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా, టీడీపీ అధికారంలోకి వచ్చేటట్లు, బిజెపి ఎత్తుగడలు ఫలవంతం కాకుండా అడ్డుకోనేటట్లు చంద్రబాబు నాయుడు అనూహ్యమైన వ్యూహాలు రూపొందిస్తున్నట్లు కనబడుతున్నది.