ఐదోసారి మోదీ  పర్యటనకు కేసీఆర్ దూరం … పోస్టర్ల యుద్ధం!

Sunday, December 22, 2024

ప్రధాన మంత్రి హోదాలో హైదరాబాద్ కు వచ్చిన నరేంద్ర మోదీ కార్యక్రమంలో వరుసగా ఐదోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ గైర్హాజరయ్యారు. ప్రధాని ప్రసంగం సహితం `తెలంగాణను కుటుంభ కుటుంభం పాలన, అవినీతి పాలన నుంచి విముక్తి కలిగిస్తాం’ అంటూ కేసీఆర్ ప్రభుత్వంనే లక్ష్యంగా చేసుకొంటూ బహిరంగసభలో ప్రసంగించారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎప్పటిలాగే మోదీకి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆహ్వానం పలికారు.

మరోవంక, ప్రధాని పర్యటన నేపథ్యంలో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడిచింది. అభివృద్ధి కార్యక్రమాలను రాజకీయాలకు బీజేపీ వాడుకుంటోందని బీఆర్ఎస్ ఆరోపిస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి సహకరించడం లేదని బీజేపీ విమర్శిస్తోంది. ఈ క్రమంలో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పోస్టర్ల వార్ కూడా నడుస్తోంది. మోదీకి వ్యతిరేకంగా హైదరాబాద్‌లో ఫ్లెక్సీలు వెలవగా.. తాజాగా కేసీఆర్‌కు వ్యతిరేకంగా వెలిసిన ఓ పోస్టర్ కలకలం రేపుతోంది.

మోదీ పర్యటన నేపథ్యంలో పరేడ్ గ్రౌండ్ వద్ద ఉన్న మెట్రో పిల్లర్ మీద వెలసిన పోస్టర్ కలకలం రేపింది. ‘బండి సంజయ్ వచ్చిండు.. మోడీ కమింగ్.. కేసీఆర్ ఎస్కేపింగ్.. లిక్కర్ క్వీన్ గెట్ రెడీ టు గో జైల్’ అంటూ పోస్టర్లు వెలిశాయి. అలాగే మోదీ సభలో రాహుల్, కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఓ కార్యకర్త ప్రదర్శించిన పోస్టర్ వివాదాస్పదంగా మారింది.

రామ భక్త అంటూ పక్కన మోదీ ఫొటో ఉండగా.. రాహుల్ గాంధీని ఉద్దేశించి రోమ్ భక్త, కేసీఆర్‌ను ఉద్దేశించి రమ్ భక్త అంటూ ఈ పోస్టర్‌లో ఉంది. ఈ పోస్టర్ వివాదానికి తెరలేపుతోంది. ఈ పోస్టర్‌కి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

మోదీ పర్యటన నేపథ్యంలో బీజేపీలో కుటుంబ పాలనను ఎత్తిచూపుతూ హైదరాబాద్‌లో ఫ్లెక్సీలు వెలిశాయి. కుటుంబ పాలనకు వ్యతిరేకమంటూ తరచూ ప్రగల్భాలు పలికే మోదీ, బీజేపీ నేతలపై సెటైర్‌ వేస్తూ కాషాయ పార్టీ నేతలు, వాళ్ల వారసుల పేరిట పలువురు సికింద్రాబాద్‌ ప్రధాన రహదారుల్లో ఈ పోస్టర్లను ఏర్పాటు చేశారు. పరివార్‌ వెల్‌కమ్స్‌ యూ మోదీజీ అనే క్యాప్షన్‌తో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.

అటు సభలో మోదీ మాట్లాడుతూ కేసీఆర్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు కురిపించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందడం లేదని, తెలంగాణలో కేంద్రం చేపడుతున్న అనేక ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనివల్ల ప్రాజెక్టుల పనులు ఆలస్యం అవుతున్నాయని, ప్రజలకు ఎంతో నష్టం జరుగుతుందని చెప్పారు

మరోవంక, కేసీఆర్ కోసం ఎదురుచూశామని, ఆయనకు బహిరంగసభ వేదికపై ఓ సీట్ కూడా ఏర్పాటు చేశామని చెబుతూ రాకపోవడానికి  సీఎంకు ఏం పనులు ఉన్నాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  ప్రశ్నించారు. కేసీఆర్‌ను సన్మానించేందుకు శాలువా కూడా తీసుకొచ్చానని పేర్కొన్నారు.

దేశ ప్రధాని రాష్ట్రానికి వస్తే కేసీఆర్ ఎందుకు రాలేదని, కేసీఆర్ షెడ్యూల్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ అభివృద్ధి నిరోధకుడిగా మారారని మండిపడుతూ కేసీఆర్ ఇప్పటికైనా డెవలప్‌మెంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సహకరించాలని సంజయ్ కోరారు.

ప్రోటోకాల్ ప్రకారం బహిరంగసభ వేదికపై సీఎం కేసీఆర్‌తో పాటు స్ధానిక ఎంపీ అయినా టిపిసిసి అధ్యక్షుడు  రేవంత్ రెడ్డికి కూడా కుర్చీని ఏర్పాటు చేశారు. అలాగే మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, మహబూద్ అలీకి కూడా వేదికపై కుర్చీలు కేటాయించారు. కానీ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మోదీ అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉన్నాయి. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles