ఐదు జోన్లుగా 175 నియోజకవర్గాల్లో టిడిపి కసరత్తు

Sunday, January 19, 2025

అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సంసిద్దులను కావించడం కోసం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు భారీ కసరత్తు ప్రారంభించారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గా లను ఐదు జోన్లుగా విభజించి ముందస్తు ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని రెండు రోజుల క్రితం జరిగిన పార్టీ స్ట్రాటజీ కమిటీ సమావేశంలో నిర్ణయించారు.

నారా లోకేష్‌ పాదయాత్రతో పాటు రాష్ట్రంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు, అక్రమ కేసులు, ప్రభుత్వం చేస్తున్న అప్పులు, ఉద్యోగులు, ఉపాద్యాయుల వేతనాల్లో జాప్యం తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. ఇదే సందర్భంగా రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఖాయమన్న అభిప్రాయాన్ని చంద్రబాబు మరోసారి నేతలకు స్పష్టం చేశారు.

ప్రతి 35 నియోజకవర్గాలను ఒక జోన్‌గా విభజిస్తున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు. జోన్ల వారీగా ఈ నెల 21 నుంచి 25 వరకు ఐదు రోజుల పాటు సమావేశాలను నిర్వహించాలని కూడా నిర్ణయించారు. ఈ సమావేశాలలో చంద్రబాబు స్వయంగా పాల్గొంటున్నారు. 21న కడపలో, 22న నెల్లూరులో, 23న అమరావతిలో, 24న ఏలూరులో, 25న విశాఖలో పార్టీ జోన్లవారీ సమావేశాలు జరుగుతాయి.

ఈ సమావేశాల్లో నేతలు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో అవలంభించాల్సిన వ్యూహాలు, చేపట్టాల్సిన కార్యక్రమాలపై స్పష్టతనివ్వనున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ వైఫల్యాలను ప్ర జల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు.

రానున్న ఎన్నికల్లో తెదేపా 160 స్థానాలు గెలుచుకోవడం ఖాయమన్న ధీమాను  పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ వ్యక్తంచేశారు.  రాష్ట్రంలో పరిస్థితులు దిగజారడంతో ముందస్తు ఎన్నికల ఆలోచనలో వైసిపి ఉందని తెలిపారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా పార్టీ యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో సిద్ధం చేసేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు.

వైసిపి ఎమ్యెల్యేలలో, కీలక నాయకులలో పార్టీ నాయకత్వం పట్ల తిరుగుబాటు ధోరణులు పెరుగుతూ ఉండడం గమనిస్తుంటే రాష్ట్రంలో తమ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని ఆ పార్టీ నేతలు నిర్ణయానికి వచ్చిన్నట్లే అని టిడిపి నాయకత్వం భావిస్తున్నది. సుమారు 70 మంది వైసిపి ఎమ్యెల్యేలు అసంతృప్తిలో ఉన్నట్లు అంచనాకు వచ్చారు. ఈ పరిస్థితులలో సీఎం జగన్ ఎటువంటి దూకుడు ప్రదర్శించినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండే విధంగా పార్టీ శ్రేణులను సంసిద్ధం చేసేందుకు చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

లోకేష్ పాదయాత్రను అడ్డుకోవడంపై ఆగ్రహం

ఇట్లా ఉండగా, రెండు వారాలుగా పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేస్తున్న `యువగళం’ పాదయాత్రకు అనూహ్య ప్రజా స్పందన లభిస్తుంటే అడుగడుగునా ప్రభుత్వం పోలీసులు అడ్డుకొనే ప్రయత్నాలు చేస్తుండటం పట్ల చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం నిబంధనలు అతిక్రమించాడని లోకేశ్ పాదయాత్రను అడ్డుకుంటున్నారని నిలదీశారు.

బయటికి రాకుండా అందరినీ బెదిరించి చంపేస్తారా? అంటూ మాజీ ముఖ్యమంత్రి మండిపడ్డారు. జగన్ ఓడిపోతారని అన్ని సర్వేలు చెబుతున్నాయని చంద్రబాబు వెల్లడించారు. ఓటమి భయంతోనే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నారని పేర్కొంటూ ముందస్తు ఎన్నికలు వస్తే రాష్ట్రానికి పట్టిన పీడ విరగడవడం ఖాయమని స్పష్టం చేశారు.

కాగా, లోకేష్ పాదయాత్రకు అడుగడుగునా ప్రజలు నీరాజనాలుపలుకుతూ ఉండడంపట్ల టిడిపి శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లోకేష్ సైతం ఎంతో ఉత్సాహంగా పాదయాత్ర చేస్తూ ప్రజల కష్టాలను అడిగితెలుసుకుంటూ, ప్రభుత్వం ఫై విమర్శలు చేస్తుండటం వారిలో కొత్త జోష్ నింపుతున్నది. అయితే పోలీసులు మాత్రం లోకేష్ పాదయాత్రను అడుగడుగునా అడ్డుకోవడం ఫై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles