ఐటీ, ఈడీ దాడుల ప్రభావంతోనే కేటీఆర్ ఢిల్లీ యాత్ర!

Wednesday, January 22, 2025

తెలంగాణ మంత్రి కేటీఆర్ అకస్మాత్తుగా ఢిల్లీ యాత్ర జరిపి, వరుసగా కేంద్ర మంత్రులను కలవడం అధికార పార్టీ వారికి కూడా ఆశ్చర్యం కలిగించింది. కేంద్ర మంత్రులను నిత్యం ఘాటుగా విమర్శించడమే గాని, కలవడం ఎప్పుడో మానేసిన కేటీఆర్ ఇప్పుడు అకస్మాత్తుగా కీలక మంత్రులైన రాజనాథ్ సింగ్, పీయూష్ గోయల్ వంటి వారిని కలవడం, హోమ్ మంత్రి అమిత్ షాను సహితం కలిసే ప్రయత్నం చేయడం ఆయన చెబుతున్నట్లు తెలంగాణ సమస్యల గురించి కాదని అందరికి తెలుసు.

కేంద్ర మంత్రులకు కేటీఆర్ ఇచ్చిన వినతి పత్రాలలో కొత్త అంశాలను ఏవీ లేవు. ఇప్పుడే ఏర్పడిన సమస్యలు కూడా లేవు. ఇటీవల ఐటి, ఈడీ అధికారులు వరుసపెట్టి బిఆర్ఎస్ ఎమ్యెల్యేలు, మంత్రులు, ఇతర ముఖ్యులపై దాడులు చేస్తుండడంతో ఎన్నికల ముందు అధికార పార్టీ నేతలు భయాందోళనలకు గురవుతున్నారు. అందుకనే వాటి ఉధృతిని తగ్గించమని వేడుకొనేందుకే వెళ్లారని భావిస్తున్నారు.

కేటీఆర్ ముఖ్యంగా ఢిల్లీ వెళ్ళింది అమిత్ షాను కలవడం కోసం. అప్పుడే జమ్మూ కాశ్మీర్ పర్యటన నుండి రావడం, మణిపూర్ హింసాకాండపై అఖిలపక్ష సమావేశం ఉండటం .. వంటి తీరికలేని పనులలో ఉన్నప్పటికీ ఆయన రాత్రి 10.10 గంటలకు కలిసే అవకాశం ఇచ్చారు.

అయితే, ఆ సమావేశానికి కొద్దిసేపటికి ముందే అమిత్ షాను కలిసిన ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి తాము కలుస్తున్నప్పుడే కేటీఆర్ ను కలవడం తెలంగాణ ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపుతుందని వారించడంతో అమిత్ షా ఆ అప్పోయింట్మెంట్ ను అర్ధాంతరంగా రద్దుచేసుకున్నారు.

అమిత్ షాను కలవలేక పోవడంతో కేటీఆర్ కొంత నిరాశకు గురైనా, తాను ఎందుకు కలవాలి అనుకొంటున్నానో సమాచారం మాత్రం హోమ్ మంత్రికి పంపినట్లు తెలుస్తున్నది. అందుకనే టిపిసిసి అధ్యక్షడు రేవంత్ రెడ్డి మరోసారి బిఆర్‌ఎస్, బిజెపి పార్టీలది ఫెవికల్ బంధం అంటూ ధ్వజమెత్తారు.

ఐటి దాడుల నుంచి బిఆర్‌ఎస్ నేతలను కాపాడడం కోసమే మంత్రి కెటిఆర్ ఢిల్లీకి వెళ్లారని రేవంత్ ఆరోపించారు. ”ఇటీవల కెటిఆర్ సొంత కంపెనీపై ఐటి దాడులు జరిగాయి. ఈ క్రమంలో కెటిఆర్ రహస్య ఆస్తుల వివరాలు బయటపడ్డాయి. ఐటి దాడుల నుంచి బయటపడేందుకే కెటిఆర్, బిజెపి పెద్దలను కలిసేందుకు ఢిల్లీకి వెళ్లారు. అంతేకానీ, రాష్ట్ర సమస్యల కోసం కాదు” అంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు.

ఆదాయపన్ను శాఖ అధికారులు ఇద్దరు బిఆర్ఎస్ ఎమ్యెల్యే, ఒక ఎంపీ లకు సంబంధించిన కార్యాలయాలు, వారి సన్నిహితులపై మూడు రోజుల పాటు దాడులు జరిపారు. ఆ తర్వాత విచారణకు హాజరు కమ్మనమని వారికి నోటీసులు కూడా ఇచ్చారు. ప్రభుత్వ భూములను రియల్ ఎస్టేట్ సంస్థలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడిగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నట్లు కూడా కనుగొన్నారు.

ఆ వెంటనే ఈడీ అధికారులు బిఆర్ఎస్ నేతలకు సంబంధించిన ప్రైవేట్ మెడికల్ కాలేజీలపై దాడులు జరిపారు.  యాజమాన్యం కోటాలో అక్రమంగా సీట్లు అమ్ముకొని కోట్లాది రూపాయల కుంభకోణానికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీటిల్లో ఒక కాలేజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధినించింది కూడా ఉంది. అక్కడ భారీగా నగదు కూడా జప్తు చేశారు.

ఈ భారీ ఆర్ధిక లావాదేవీలలో చాలావరకు బినామీ లావాదేవీలనే ఆరోపణలున్నాయి. వీటిల్లో కేటీఆర్ కు కూడా సంబంధాలున్నట్లు ఆరోపణలు చెలరేగుతున్నాయి. అందుకనే కేంద్ర సంస్థలు తీవ్రమైన చర్యలు తీసుకోకుండా ఉండే విధంగా చూసుకునేందుకు కేటీఆర్ అర్థాంతరంగా ఢిల్లీ ప్రయాణమయ్యారని చెబుతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles