ఏపీ సిపిఎంలో ముసలం .. రాఘవులు రాజీనామా!

Tuesday, December 24, 2024

ఏపీ సిపిఎంలో కొంతకాలంగా నెలకొన్న అంతర్గత కుమ్ములాటలు పతాకస్థాయికి చేరుకొన్నాయి. దానితో సీపీఎం అగ్రనేత బివి రాఘవులు పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యత్వానికి రాజీనామా చేసారు. ప్రాథమిక సభ్యత్వం మినహా అన్ని పదవులకు రాఘువులు రాజీనామా చేయడం ఆ పార్టీలో నెలకొన్న ముసలంను బహిర్గతం చేసింది.

సీపీఎం అనుబంధ విద్యార్ధి సంఘం ఎస్‌ఎఫ్ఐ లో పని చేస్తూ క్రమేణా పార్టీలో ఎదిగిన రాఘవులు కీలక బాధ్యతలు నిర్వహించారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా పని చేసారు.  సీపీఎం సంస్థాగత ర్మాణంలో రాఘవులు కీలకంగా వ్యవహరించారు. జాతీయ స్థాయిలోనూ రాఘవులకు పార్టీలో మంచి గుర్తింపు ఉంది.

అయితే, కొంతకాలంగా ఏపీలో పార్టీలో తీవ్రమవుతున్న అంతర్గత కుమ్ములాటలు కారణంగా రాఘవులు రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.  దీంతో రాజీనామా వెనక్కి తీసుకోవాలని అగ్రనేతలు రాఘవులును బుజ్జగిస్తున్నారు. అయినా వెనక్కు తగ్గని రాఘవులు సాధారణ కార్యకర్తగా క్షేత్రస్థాయిలో పనిచేస్తానని వారికి చెప్పినట్లు తెలుస్తోంది.

పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, వరుస ఫిర్యాదులతోనే రాఘవులు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. అయితే రాఘవులు రాజీనామాను పార్టీ పొలిట్ బ్యూరో ఇప్పటివరకు ఆమోదించలేదు. ఏపీలో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు కూడా ఆయన రాజీనామాకు కారణమని పార్టీ వర్గాలంటున్నాయి.

దాదాపు మూడు దశాబ్దాల పాటు ఏపీ సిపిఎంలో అంతా తానే అన్నట్లుగా వ్యవహరించిన రాఘవులు ఎక్కువగా భజనపరులను అందలం ఎక్కించి, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న పలువురు నేతలను పక్కన పెట్టారనే విమర్శలు ఉన్నాయి. అందుచేత చాలామంది పార్టీని వీడారు కూడా.

ఒకనాడు బిజెపి మినహా అన్ని రాజకీయ పార్టీలు సిపిఎంతో పొత్తుల కోసం పోటీ పడుతూ ఉండేవి. ఒకసారి టిడిపితో, మరోసారి కాంగ్రెస్ తో పొత్తులు పెట్టుకొంటూ గౌరవనీయ స్థానంలో అసెంబ్లీ, ఎంపీ సీట్లు పొందుతూ ఉండేవారు. అయితే, 2009 నుండి ఏ పార్టీ కూడా సిపిఎంతో పొత్తు పట్ల ఆసక్తి చూపడం లేదు.

చివరికి తోటి వామపక్షం సిపిఐ సహితం సిపిఎం ధోరణుల పట్ల అసహనంతో ఉంటూ వస్తోంది. రాష్ట్రంలో రాజకీయంగా సిపిఎం ఉనికి ప్రశ్నార్ధకంగా మారడానికి తానే బాధ్యుడిని అన్నట్లు పలువురు ఆరోపణలు చేస్తుండడంతో కలతచెంది ఆయన రాజీనామా చేశారని పలువురు భావిస్తున్నారు.

పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా  ఎన్నికకు పార్టీలో కర్నూలుకు చెందిన మాజీ ఎమ్మెల్యే గఫూర్‌ కు మెజారిటీ మద్దతు ఉన్నప్పటికీ అడ్డుపడి సాంకేతిల అభ్యంతరాలను లేవనెత్తి రాఘవులు తన శిష్యుడు నరసింగరావును కార్యదర్శిగా చేశారనే విమర్శలు ఉన్నాయి. అప్పటి నుండిగఫూర్‌ తీవ్ర అసంతృతీపితో ఉన్నారు. పార్టీకి రాజీనామా చేశారనే వదంతులు కూడా  ఆ మధ్య వచ్చాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles