ఎమ్యెల్సీ ఎన్నికల పర్వం పూర్తికాగానే రాష్ట్ర మంత్రివర్గంలో స్వల్పంగా మార్పులు జరుగుతాయని, ముగ్గురు నుండి ఐదుగురి మంత్రులను తొలగించే, వారి స్థానంలో ఎమ్యెల్సీలను మంత్రులుగా నియమిస్తానని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో ఎమ్యెల్సీ ఎవ్వరు లేరు. గతంలో ఉన్న ఇద్దరు ఎంఎల్సీలు – సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలను రాజ్యసభకు పంపడంతో, ఆ తర్వాత ఎమ్యెల్సీలు ఎవ్వరినీ మంత్రులుగా చేయలేదు.
తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశం సందర్భంగా కూడా ఇద్దరు, ముగ్గురు మంత్రుల పనితీరు పట్ల జగన్ ఆగ్రహం వ్యక్తం చేసిన్నట్లు వార్తలు వచ్చాయి. మంత్రులను మార్చడం ముఖ్యమంత్రి ఇష్టం. అయితే ఇక్కడ జగన్ పెట్టిన టెస్ట్ వారి పట్ల శాపంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చేవారం జరుగనున్న ఎమ్యెల్యేల నుండి ఎమ్యెల్సీ ఎన్నికలలో వైసీపీకి చెందిన అభ్యర్థులను గెలిపించే బాధ్యతను ఆయన మంత్రులపై ఉంచారు.
ఒకొక్క మంత్రికి ఏడుగురు నుండి ఎనిమిది మంది ఎమ్యెల్యేలను కేటాయిస్తానని చెప్పారు. వారందరూ పార్టీ అభ్యర్థులకు ఓటువేసేటట్లు చూడటం మంత్రుల బాధ్యతగా స్పష్టం చేశారు. వారిలో ఎవరైనా ఓటువేయకపోతే సంబంధిత మంత్రికి ఉద్వాసన తప్పదనే సంకేతం ఇచ్చారు. అసలు ఈ ఎన్నికలలో అధికార పార్టీకి పోటీ ఉండబోదని, పార్టీకి చెందిన ఏడుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికవుతారని మొదట్లో అనుకున్నారు.
కానీ, చివరి నిముషంలో అనూహ్యంగా టిడిపి మాజీ విజయవాడ మేయర్ పంచుమర్తి అనురాధను అభ్యర్థిగా నిలబెట్టడంతో పోటీ అనివార్యమైంది. దానితో టిడిపి నుండి ఎన్నికై వైసీపీతో తిరుగుతున్న నలుగురు ఎమ్యెల్యేలు ఇప్పుడు టిడిపి అభ్యర్ధికి ఓట్ వేయకపోతే తమ శాసనసభ్యత్వం కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. మరోవంక, పలువురు వైసిపి ఎమ్యెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని అంటూ మాజీ హోమ్ మంత్రి చినరాజప్ప ఓ బాంబు పేల్చారు.
వైసీపీలో అసమ్మతి ఎమ్యెల్యే కోటంరాజు శ్రీధరెడ్డి ఎమ్యెల్సీ ఎన్నికలలో ఆత్మప్రబోధం అనుసారం ఓటు వేస్తానని స్పష్టంగా ప్రకటించారు. అంతేకాదు ఎమ్యెల్యేలు అందరూ అదేవిధంగా వేయాలని పిలుపిచ్చారు. మరో అసమ్మతి ఎమ్యెల్యే ఆనం రామారాయణ రెడ్డి మొదటిరోజు టిడిపి బెంచ్ లలో అసెంబ్లీలో కూర్చొని కలకలం రేపారు.
వచ్చే ఎన్నికలలో జగన్ తమకు తిరిగి సీట్ ఇవ్వరని నిర్ధారణకు వచ్చిన మరికొంతమని ఎమ్యెల్యేలు కూడా ఇదేవిధంగా పోలింగ్ సమయంలో బయటపడితే ఏమిటనే ఆందోళన మంత్రులను వెంటాడుతున్నది.