ఏపీ బీజేపీలో ప్రకంపనలు సృష్టిస్తున్న కన్నాతో నాదెండ్ల భేటీ!

Friday, November 22, 2024

తమకు మిత్రపక్షంగా చెప్పుకొంటున్న జనసేన పార్టీకి చెందిన కీలక నేత, మాజీ అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తమ పార్టీ కీలక నేత కన్నా లక్ష్మీనారాయణతో భేటీ కావడం ఏపీ బిజెపిలో ప్రకంపనలు సృష్టిస్తున్నది. వైఎస్ జగన్ `బి టీం’గా వ్యవహరించడంతో 2019లో నోటా కన్నా తక్కువ ఓట్లు వచ్చినా ఇంకా ఆ పార్టీ కోవర్టులుగా రాష్ట్ర నాయకులు వ్యవహరిస్తూ ఉండడంతో రాష్ట్రంలో బిజెపికి  భవిష్యత్ లేదని సీనియర్ నేతలు తలోదారి చూసుకుంటున్నారా? అనే అనుమానం కలుగుతుంది. 

రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో పొసగక పోవడం, రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి  తప్పించిన తర్వాత పార్టీలో తనకు ఎటువంటి ప్రాధాన్యత కల్పించకపోవడంతో కన్నా లక్ష్మీనారాయణ కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. జనసేనతో పొత్తు ముందుకు వెళ్ళక పోవడానికి సోము వీర్రాజు వైఖరియే కారణం అంటూ ఈ  మధ్య బహిరంగంగానే విమర్శించారు. 

రాజ్యసభ సభ్యత్వం ఇస్తారనుకుంటే నిరాశే ఎదురైంది. కనీసం పార్టీలో ఏమి జరుగుతుందో కూడా తనతో ఎవ్వరు చర్చలు జరపడం లేదు. దానితో అసంతృప్తితో ఉన్న కన్నా కొంతకాలంగా పక్క చూపులు చూస్తున్నట్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నుండి ఆయనకు ఆహ్వానం వచ్చినట్లు చెబుతున్నారు. 

తాజాగా, విజయవాడలో టిడిపి నేతలు గంటా శ్రీనివాసరావు తదితరులతో భేటీ కావడం గమనార్హం. కొద్దీ రోజుల క్రితం అమరావతి రైతుల ఆధ్వర్యంలో జరిగిన ఒక సమావేశంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుతో కలసి వేదిక పంచుకున్నారు. 

ఇప్పటికి బిజెపి తమ మిత్రపక్షం అని చెబుతున్నప్పటికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ పార్టీ నాయకత్వం పట్ల అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల విశాఖ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలిపించుకొని మాట్లాడినప్పటికీ బిజెపి వ్యవహారంలో ఎటువంటి మార్పు లేదని అసంతృప్తితో ఉంటున్నారు. 

ఈ సందర్భంగా టీడీపీ, జనసేన కలిసి ఎన్నికలకు వెడతాయనే అంచనాలు వెలువడుతున్నాయి. పొత్తుల గురించి తమ వ్యూహం చెప్పక పోయినప్పటికీ వచ్చే ఎన్నికలలో కొన్ని సీట్లు గెల్చుకొనే విధంగా ఉండాలని జనసేన నేతలు పట్టుదలగా ఉన్నారు. అందుకోడం బిజెపితో మిత్రత్వం ఏమాత్రం సహకరించదని నిర్ధారణకు వచ్చారు. 

ఈ లోగా బలమైన అభ్యర్థుల కోసం జనసేన అన్వేషణ ప్రారంభించారు. ఆ ప్రయత్నంలో భాగంగానే కన్నాను మనోహర్ కలిసి ఉంటారని పలువురు భావిస్తున్నారు. అయితే ఇది సాధారణ సమావేశంగానే చెబుతున్నా ఇప్పటి వరకు జనసేన నేతలు ఎవ్వరు బిజెపి నేతల ఇంటికి వెళ్ళక పోవడం గమనార్హం. 

పైగా, పదేళ్ల కాంగ్రెస్ పాలనలో కన్నా మంత్రిగా ఉన్న సమయంలో మనోహర్ డిప్యూటీ స్పీకర్, స్పీకర్ గా ఉన్నారు. ఇద్దరు ఒకే జిల్లాకు చెందిన వారైనప్పటికీ ప్రత్యర్థి వర్గాలుగా ఉండేవారు. వారి మధ్య చెప్పుకోదగిన సాన్నిహిత్యం కూడా లేదు. 

టిడిపి, జనసేనలతో పొత్తు ఏర్పర్చుకొంటే బీజేపీలో కొనసాగి పోటీ చేయాలని, లేని పక్షంలో ఆ రెండు పార్టీలలో ఏదో ఒక పార్టీలో చేరాలని ఇప్పటికే పలువురు బిజెపి నేతలు నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. 

కన్నా సహితం టిడిపితో పొత్తు లేని పక్షంలో బిజెపి అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధంగా లేరని స్పష్టం అవుతున్నది. తాను లోక్ సభకు, తన కుమారుడు, మాజీ మేయర్ నాగరాజును అసెంబ్లీకి పోటీ చేయించడం కోసం సన్నాహాలు చేస్తున్నారు. అందుకోసం టీడీపీ, జనసేనలలో ఏదో ఒక పార్టీలో చేరే అవకాశం ఉందనే  సంకేతాలు వెలువడుతున్నాయి. 

రాష్ట్ర బిజెపి నేతలు కొందరు వైసిపి కోవర్టులుగా వ్యవహరిస్తున్నారని అంటూ కన్నా పార్టీ కేంద్ర నాయకత్వానికి పలు పర్యాయాలు ఫిర్యాదు కూడా చేశారు. స్వయంగా అమిత్ షా అధికార పార్టీతో సన్నిహితంగా ఉంటె రాజకీయ మనుగడ ఉండబోదని రాష్ట్ర నాయకత్వాన్ని హెచ్చరించారు. జగన్ ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వం సన్నిహితంగా వ్యవహరిస్తున్న కారణంగా వైసీపీకి బిజెపి సన్నిహితంగా వ్యవహరింప రాదనీ స్పష్టం చేశారు. 

పైగా, వైసిపి ప్రభుత్వం అవినీతి చర్యలపై ఛార్జ్ షీట్ ను విడుదల చేసి, వచ్చే ఎన్నికల కోసం విస్తృతంగా ప్రచారం చేయమని స్వయంగా ప్రధాని మోదీ విశాఖ పర్యటన సందర్భంగా చెప్పినా రాష్ట్ర నాయకులు ఖాతరు చేయడం లేదు. దానితో పలువురు నాయకులు అసహనంతో పార్టీని విడవడం కోసం సిద్ధపడుతున్నట్లు తెలుస్తున్నది. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles