జనం కోసం అమరావతియే ఏపీకి రాజధాని అని అంటున్నప్పటికీ బిజెపి నేతలు మానసికంగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి దాసోహం అయ్యారని, ఆయన చెబుతున్న మూడు రాజధానులకు మద్దతుగా ఉంటున్నారని అప్పుడప్పుడు బయటపడుతూనే ఉంది. తాజాగా, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి విశాఖపట్నం పర్యటన సందర్భంగా ఈ విషయం బయటపడింది.
అమరావతి రాజధాని అంటూ బీజేపీ స్పష్టమైన వైఖరి వ్యక్తం చేస్తున్నప్పటికీ విశాఖను రాజధానిగా కిషన్ రెడ్డి పేర్కొనడం ఆ పార్టీలో కలకలం రేపింది. రెండు రోజుల పాటు విశాఖపట్టణంలో నిర్వహించిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులో రెండో రోజు పాల్గొన్న కిషన్ రెడ్డి ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర పట్టభద్రుల బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థి పీవీఎన్ మాధవ్ ప్రచార సభలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములం కావాలంటే రాజధానిలో మన ప్రతినిధి ఉండాలంటూ పరోక్షంగా ఏపీ రాజధాని విశాఖ అనే ధోరణిలో మాట్లాడారు. ఈ మాటలు విని అక్కడున్న బిజెపి నేతలంతా అవాక్కయ్యారు. ఆ వెనువెంటనే రాజధాని కేంద్రంలో కావొచ్చు..జిల్లా ప్రధాన కేంద్రంలో కావొచ్చంటూ మాటలు మార్చే ప్రయత్నం చేసినప్పటికీ విశాఖ రాజధానికి అనుకూలమనే సంకేతాలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి.
అమరావతి రాజధానికి మద్దతు ఇవ్వడంతో పాటు అక్కడి రైతులకు మద్దతుగా బిజెపి ఆందోళనలు కూడా చేసింది. ఇలాంటి తరుణంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బీజేపీని అంతర్మథనంలోకి నెట్టాయి. గతంలో తమకు మద్దతు కోడదీసుకోవడం కోసం అమరావతి రైతులు హైదరాబాద్, ఢిల్లీలలో కిషన్ రెడ్డిని కలసిన సందర్భాలలో సహితం ఆయన తప్పించుకొనే ధోరణిలో మాట్లాడారని విమర్శలున్నాయి.
ఢిల్లీలో సీఎం జగన్ ప్రయోజనాలకు అండగా ఉంటున్నవారిలో కిషన్ రెడ్డి కూడా ఒకరనే ప్రచారం ఉంది. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఏపీ సిఐడి పోలీసులు అరెస్ట్ చేసి, నిర్బంధించిన సమయంలో ఆయన కుమారుడు సహాయం కోసం కిషన్ రెడ్డిని సంప్రదించడానికి ప్రయత్నిస్తే స్పందించలేదు. దానితో నేరుగా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాను సంప్రదించారని తెలిసింది.
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా మొదట్లో రాజధాని ఒక్క అమరావతిలోని ఎందుకు, జిల్లాకో రాజధాని ఉండాలంటూ ఎగతాళిగా మాట్లాడారు. అయితే డిసెంబర్, 2021లో తిరుపతిలో ప్రజలలో పార్టీ బలం పెంచుకోవాలంటే ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఆవలంభించక తప్పదని చురకలు అంటించిన తర్వాతనే అమరావతికి అనుకూలంగా మాట్లాడటం ప్రారంభించారు.