ఏపీ బిజెపి అధ్యక్ష పదవికి సత్యకుమార్ లాబీ!

Monday, September 16, 2024

సుదీర్ఘకాలం మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వద్ద వ్యక్తిగత సహాయకునిగా ఉంది, విశేషమైన పలుకుబడి, సంపదను కూడా కూడబెట్టుకున్న బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఇప్పుడు ఏపీ రాష్త్ర అధ్యక్ష పదవికోసమైనా తీవ్రమైన లాబీ చేస్తున్నారు. వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి పదవికి వెళ్లిన తర్వాత కూడా ఆయన కోసం ఓ ప్రత్యేకమైన పోస్ట్ ఏర్పాటు చేసినా, రాజకీయంగా ప్రాధాన్యతలేని ఆ పదవిలో సంపాదన ఏమీ ఉండదని, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా  దగ్గరకు చేసి ఏకంగా బీజేపీ జాతీయ కార్యదర్శి అయ్యారు.

వెంకయ్యనాయుడు వద్ద ఆర్ధిక వ్యవహారాల నిర్వహణలో ఆరితేరిన వ్యక్తి కావడంతో ఆయనను అమిత్ షా దగ్గరకు చేర్చుకున్నారని చెబుతుంటారు. పార్టీ వ్యవహారాలలో ఎటువంటి అనుభవం లేకపోయినా ఏకంగా ఉత్తర ప్రదేశ్ కు సహా ఇన్ ఛార్జ్ చేశారు. అయితే ఆయన దృష్టి అంతా ఏపీ మీదనే ఉంటుంది. ఇక్కడ రాష్త్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు వ్యతిరేకంగా ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకొనే ప్రయత్నం చేశారు.

అయితే ఏపీలో వెంకయ్యనాయుడు అనుచరులు ఎవ్వరూ సత్యకుమార్ దగ్గరకు చేరడం లేదు. దానితో అక్కడక్కడా కొత్తగా వచ్చిన వారిలో కొందరిని దగ్గరకు తీసుకొని, ఒక వర్గంగా ఉండే ప్రయత్నం చేశారు. బీజేపీలో  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వర్గాన్ని దగ్గరకు చేర్చుకొని ప్రయత్నం చేస్తూ వచ్చారు. తాజాగా తన పేరు చివరిలో `యాదవ్’ అని చేర్చుకొని, బిసి వర్గాలకు ప్రాతినిధ్యం ఇవ్వాలంటూ నినాదం లేవదీశారు.

ముఖ్యంగా ఎన్నికల సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి అంటే లాభదాయకమైన పదవి అనే అభిప్రాయం తెలుగు రాష్ట్రాల్లో బలపడుతుంది. సీట్లు ఆశిస్తున్న వారి నుండి, కేంద్రం నుండి వచ్చిన నిధుల నుండి భారీగా వెనుక వేసుకోవడం కొంతకాలంగా కొందరు నేతలు చేస్తూ వస్తున్నారు. అందులో సిద్ధహస్తుడైన సత్యకుమార్ ఎన్నికల సమయంలో రాష్ట్రంలో పార్టీ సారథ్యం కోసం ఆరాటపడుతున్నారు.

అదే సమయంలో టిడిపితో పొత్తు పెట్టుకొని నెల్లూరు లేదా రాజంపేట నుండి పోటీచేసి పార్లమెంట్ కు వెడితే, మోదీ మంత్రివర్గంలో కూడా చేరవచ్చని ఎత్తుగడలు వేస్తున్నట్లు వినికిడి. ప్రస్తుతం వెంకయ్యనాయుడుకు గాని, ఆయన కుటుంభంలో గాని ఎవ్వరికీ ఎటువంటి పదవులు లేనందున ఆయన కోటాలో బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాలనే వాదన కూడా లేవదీస్తున్నారు.

అయితే, ప్రస్తుతం ఏపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న సోము వీర్రాజుకు రాష్త్ర సహా ఇన్ ఛార్జ్ సునీల్ దేవధర్, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు వంటి వారు మద్దతు ఇస్తున్నారు. వీరు ముగ్గురు కలిసి వైఎస్ జగన్ ప్రభుత్వంతో లోపాయికారి ప్రయోజనాలు పొందుతున్నారని విమర్శలు బిజెపి వర్గాల నుండి తలెత్తుతున్నాయి. పైగా వారికి బిజెపి సంస్థాగత ప్రధాన కార్యదర్శి బి ఎల్ సంతోష్ మద్దతు కూడా ఉంది.

వీరందరిని కాదని ఏపీలో సత్య కుమార్ ను అధ్యక్షుడిగా నియమించేందుకు అమిత్ షా ఏమాత్రం చొరవ తీసుకుంటారన్నది ప్రశ్నార్ధకంగా ఉంది. పైగా, బిజెపి వ్యవహారాలలో జోక్యం చేసుకునేందుకు వెంకయ్యనాయుడు సహితం ఆసక్తి చూపడం లేదు. సత్య కుమార్ కు రాష్త్ర బీజేపీ వర్గాలలో సహితం చెప్పుకోదగిన మద్దతు లేదు. మాజీ టిడిపి నేతలు సుజనా చౌదరి, సీఎం రమేష్ వంటి వారితో మాత్రమే సఖ్యతగా ఉంటున్నారు.

ఏపీ బీజేపీలో టిడిపితో పొత్తు కోసం గట్టిగా ప్రయత్నం చేస్తున్న నేతలలో సత్యకుమార్ మొదటివారు. ఆయనను రాష్ట్ర అధ్యక్షునిగా నియమించడం అంటే టిడిపితో పొత్తుకు బిజెపి అగ్రనాయకత్వం సుముఖత వ్యక్తం చేసిన్నట్లే కాగలదు. అయితే, కేంద్రంలో బిజెపి అగ్రనాయకులు ధోరణి మాత్రం తిరిగి వైఎస్ జగన్ ఎలాగైనా గెలుపొందేందుకు చేయవలసిన సహాయం అంతా చేయాలనే వైఖరి స్పష్టంగా కనిపిస్తుంది.

సత్యకుమార్ ను రాష్త్ర అధ్యక్షునిగా చేస్తే టిడిపితో పొత్తు లేకపోయినా ఎన్నికల సమయంలో వైసీపీ దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేయడంలో టిడిపి వ్యూహాలకు మద్దతుగా నిలబడే అవకాశం ఉంది. అందుకనే సత్యకుమార్ వంటి వారు ఇక్కడ బిజెపి అధ్యక్షునిగా ఉండటం సీఎం జగన్ కు సహితం ఇష్టం ఉండకపోవచ్చని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles