ఏపీ నుండి పారిపోతానంటున్న వైసీపీ ఎంపీ!

Sunday, December 22, 2024

వైసీపీ ప్రభుత్వంలో అధినేతల వేధింపులు, అరాచకాలకు భయపడి కొత్తగా ఎవ్వరూ ఆంధ్ర ప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం లేదని, ఇప్పటికే నెలకొల్పిన పరిశ్రమలను సహితం పొరుగు రాష్ట్రాలకు తరలించడమో లేదా వాటి విస్తరణను ఆపివేయడమో చేస్తున్నారని అంటూ గత నాలుగేళ్లుగా ప్రతిపక్షాలు విమర్శలు కురిపిస్తున్నాయి. అయితే అవన్నీ తమ అభివృద్ధిని చూసి అసూయతో సాగిస్తున్న దుష్ప్రచారంగా వైసిపి మంత్రులు, నేతలు కొట్టిపారేస్తూ వస్తున్నారు.

అయితే, ఇప్పుడు స్వయంగా అధికార పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు ఒకరు తన వ్యాపారాలను హైదరాబాద్ కు తరలిస్తున్నట్లు ప్రకటించడం కలకలం రేపుతోంది. ఇటీవలతో తన కుటుంభం సభ్యులు కిడ్నప్ కు గురవడంతో ఖంగారు పడిన విశాఖపట్టణం ఎంపీ ఎంవివి సత్యనారాయణ చేసిన ప్రకటన ఏపీలో నెలకొన్న అరాచక పరిస్థితులకు అద్దం పడుతుంది.

‘విశాఖపట్నంలో ఇకపై కొత్త ప్రాజెక్టులు చేపట్టను. ఏడెనిమిది నిర్మాణంలో ఉన్నాయి. వాటిని పూర్తిచేసి హైదరాబాద్‌కు షిఫ్ట్‌ అయిపోతాను. ఇక్కడ వ్యాపారం చేయడం కష్టం’ అంటూ సంచలన ప్రకటన చేశారు. పరిశ్రమలలో లేదా వ్యాపారాలలో భాగస్వామ్యం ఇవ్వమని లేదా భారీగా ముడుపులు చెల్లించామని వైసీపీ నాయకులు చేస్తున్న వేధింపులు, నిబంధనల పేరుతో ప్రభుత్వం పెడుతున్న ఆంక్షలు భరించలేక ఇలా ఇప్పటికే చాలామంది రాష్ట్రం వదిలి వెళ్లిపోయారు.

ఇప్పుడు ఏకంగా వైసీపీ చెందిన విశాఖ ఎంపీయే ఈ మాటలంటున్నారంటే ఏపీలో వ్యాపారులు, పారిశ్రామికవేత్తల పరిస్థితులు ఎంతదారుణంగా మారిపోయాయో తెలిసిపోతోంది.మూడు దశాబ్దాలుగా విశాఖపట్టణంలో వ్యాపారాలు చేసుకొంటూ, అంచలంచెలుగా ఎదుగుతూ వస్తున్న ఆయన ఇప్పుడు ఎంపీగా ఉంటూ నిలబడలేక పోతుండటం గమనార్హం.

రాష్ట్రంలో ఓ వైపు రాజకీయాలు, మరోవైపు వ్యాపారం ఒకేసారి చేయడం కష్టంగా ఉందంటున్నారు సత్యనారాయణ. రాజకీయాలను వ్యాపారాన్ని కలిపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను రాజకీయాల్లో ఉన్నందున కొందరు తనను టార్గెట్ చేస్తున్నారని, ఎవరో ఒకరు, ఏదో ఒకటి అంటుంటే బాధగా ఉందంటుని పేర్కొన్నారు. ప్రజాసేవ కోసం రాజకీయాలు విశాఖలో చేస్తానని, కానీ వ్యాపారం మాత్రం హైదరాబాద్‌లో చేద్దామన్న నిర్ణయానికి వచ్చినట్లు స్పష్టం చేస్తున్నారు.

తాజాగా సత్యనారాయణ కుమారుడిని, భార్యను, స్నేహితుడైన ఆడిటర్‌ జీవీని ఓ ముఠా కిడ్నాప్‌ చేసి నిర్బంధించి.. రూ.1.75 కోట్లు నగదు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. గత మంగళవారం ప్రారంభమైన ఈ వ్యవహారం మూడో రోజు వెలుగులోకి వచ్చింది. అయినా ఇప్పటికీ ఈ కేసులో వాస్తవం ఏమిటో బయటకు రాలేదు.

డబ్బుల కోసం ఆ ముఠా తన కుటుంబాన్ని నిర్బంధించిందని ఎంపీ చెబుతున్నారు. కానీ భూ లావాదేవీలకు సంబంధించిన సెటిల్‌మెంట్‌లో ఆ ముఠా నాయకుడికి ఇవ్వాల్సిన మొత్తం ఇవ్వకపోవడం వల్లే  అతడు కిడ్నాప్‌ చేశాడని ప్రచారం జరుగుతోంది. దీనిపై ఎంపీ గత 4రోజులుగా వివరణలు ఇస్తున్నా స్పష్టత చోటుచేసుకోవడం లేదు.

ఈ సందర్భంగా ఒక టీవీ చానల్‌ డిబేట్‌లో ఆయన మాట్లాడుతూ.. ‘విశాఖలో వేధింపులు ఎక్కువైపోయాయి. ఇక ఇక్కడ వ్యాపారం చేయను. హైదరాబాద్‌కు షిఫ్ట్‌ అయిపోతాను’ అని ప్రకటించారు. ఈ కిడ్నప్ లో కడప, కర్నూల్ గ్యాంగ్ లు ఉన్నాయనే ఆరోపణలు చెలరేగాయి. నిజంగా డబ్బుకోసం కిడ్నప్ చేసి ఉంటె ఎంపీతో బేరాలాడేవారని, అలా కాకుండా ఆయన స్నేహితుడైన ఆడిటర్ ను ఎందుకు పిలిపిస్తారని బీజేపీ మాజీ ఎమ్యెల్యే విష్ణుకుమార్ రాజు అనుమానం వ్యక్తం చేశారు.

సాక్షాత్తూ ఎంపీ ఇక్కడ బతకలేను.. హైదరాబాద్‌ వెళ్లిపోతానన్నారంటే పోలీసు వ్యవస్థకు సిగ్గు అనిపించడం లేదా? అంటూ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. విశాఖలో ఎంపీ భార్య, కుమారుడిని కిడ్నాప్‌ చేశారని.. అధికార పార్టీ ఎంపీ కుటుంబానికే రక్షణ లేదంటే సామాన్యుల పరిస్థితి ఏంటీ? అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.  ముఖ్యమంత్రి జగన్‌ స్వయంగా పరిపాలనా రాజధానిగా ప్రకటించిన విశాఖను వదిలి అధికార పార్టీ ఎంపీ హైదరాబాద్ వెళ్లిపోతాననడం రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది

పైగా, విశాఖపట్టణంలో అరాచక శక్తులు రాజ్యమేలుతున్నాయని అంటూ స్వయంగా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఆరోపణలు చేసిన రెండు, మూడు రోజులకే ఈ తతంగం జరగడంతో అక్కడ మాఫియాలు రాజ్యమేలుతున్నట్లు స్పష్టం అవుతుంది. అందుకనే ఈ వ్యవహారంపై సిబిఐ, ఎన్ఐఏ లతో దర్యాప్తు జరిపించాలని విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles