ఏపీ డిజిపిగా రాజేంద్రనాథ్ రెడ్డిని కొనసాగిస్తారా!

Sunday, December 22, 2024

మరో ఎనిమిది నెలల్లో ఎన్నికలు జరుగనున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ డీజీపీ నియామకం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రాధాన్యత సంతరింప చేసుకుంది. ప్రస్తుతం 16 నెలలకు పైగా డిజిపిగా పూర్తి అదనపు చార్జితో కొనసాగుతున్న రాజేంద్రనాథ్ రెడ్డిని ఇప్పటి వరకు పూర్తిస్థాయి డిజిపిగా నియమించడం పట్ల దృష్టి సారించని ముఖ్యమంత్రి అకస్మాత్తుగా ఆ వైపు కసరత్తు ప్రారంభించారు.

ఎన్నికల సమయంలో ఇన్ ఛార్జ్ కొనసాగడం ఇబ్బందికరం కావచ్చనీయేమో గాని తదుపరి డిజిపి నీయమకంకు ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం యూపీఎస్సీకి పంపినట్టు చెబుతున్నారు.

గత ఏడాది ఫిబ్రవరి 19న ఆంధ్రప్రదేశ్‌ డీజీపీగా ముఖ్యమంత్రి సొంత జిల్లాకు చెందిన కసిరెడ్డి రాజేంద్రనాథ్‌ రెడ్డిని పలువురు సీనియర్ అధికారులను కాదని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అప్పటికే ఏడాది సర్వీస్ ఉన్న దామోదర్‌ గౌతమ్‌ సవాంగ్‌ స్థానంలో అనూహ్యంగా 2022 ఫిబ్రవరి 15న రాజేంద్రనాథ్‌ రెడ్డిని డిజిపిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
రానున్నది ఎన్నికల ఏడాది కావడంతో ప్రభుత్వానికి డీజీపీ నియామకం అత్యంత కీలకం కానుంది. ఓ వైపు శాంతిభద్రతలను అదుపు చేయడంతో పాటు ఎన్నికలను సమర్థంగా నిర్వహించాల్సిన అవసరం కూడా ఉంటుంది. పైగా, ఎన్నికల నిర్వహణలో ఏకపక్షంగా అధికార ఏకపక్షంగా అధికార పక్షంకు బాసటగా నిలబడే అధికారి అయి ఉండాలి.

ప్రస్తుత డిజిపి అధికార పక్షం కనుసన్నలలో పనిచేస్తున్నా దూకుడుగా వ్యవహరించడం లేదని, అవసరమైనప్పుడు కరకుగా వ్యవహరించడం లేదని అధికార పక్ష నేతలలో ఒకింత అసహనం వ్యక్తం అవుతుంది. పైగా, ప్రస్తుతం సీనియారిటీ ఉన్న అధికారులలో ఆయన పేరు చివరిదిగా ఉండటం గమనార్హం.

దానితో ప్రస్తుత డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డిని పూర్తి స్థాయిలో డీజీపీగా నియామకం కోసం లాంఛనాలు పూర్తి చేస్తారా లేదా ఆయన స్థానంలో మరొకరి వైపు సిఎం జగన్మోహన్ రెడ్డి మొగ్గు చూపుతారా అనేది అధికార వర్గాలలో ఉత్కంఠ రేపుతోంది.

రాష్ట్ర ప్రభుత్వం యూపీఎస్సీకి సిఫార్సు చేసిన వారిలో 1987 బ్యాచ్‌కు చెందిన ఏఆర్. అనురాధ, 1989 బ్యాచ్‌కు చెందిన ద్వారకా తిరుమల రావు, 1991కు చెందిన మహమ్మద్ హసన్ రజా, 1992 బ్యాచ్‌కు చెందిన హరీష్‌ కుమార్‌ గుప్తా, పి.సీతారామాంజనేయులు, కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి పేర్లు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

1990 బ్యాచ్‌కు చెందిన అంజనీ కుమార్‌తో పాటు అంజనా సిన్హాలను రాష్ట్ర విభజనలో ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌కు కేటాయించినా కోర్టు ఉత్తర్వులతో తెలంగాణలో కొనసాగుతున్నారు. దీంతో వారి పేర్లను సీనియారిటీ ఆధారంగా పరిగణలోకి తీసుకోలేదు.

1989 బ్యాచ్‌కు చెందిన ఏబి. వెంకటేశ్వరరావుపై పలు ఆరోపణలతో ప్రభుత్వం శాఖాపరమైన చర్యలు తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై ఆయన న్యాయ పోరాటం చేస్తున్నారు. దానితో ఆయన కూడా ఈ జాబితాలో లేరు.

1987 క్యాడర్‌కు చెందిన అనురాధకు ఈ ఏడాది అక్టోబర్‌ వరకు పదవీ కాలం ఉంది. అక్టోబర్‌ నాటికి సార్వత్రిక ఎన్నికల హడావుడి కూడా మొదలైపోతుంది. డీజీపీగా అనురాధ వైపు ప్రభుత్వం మొగ్గు చూపితే మార్చి, ఏప్రిల్ నెలల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నందున పదవీకాలం పొడిగింపుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి కోరాల్సి ఉంటుందని చెబుతున్నారు.

యూపీఎస్సీ షార్ట్‌ లిస్ట్‌లో స్థానం దక్కించుకుని, రాష్ట్ర ప్రభుత్వం అమోదిస్తే ఏపీకి మొదటి మహిళా డీజీపీ అయ్యే అవకాశం అనురాధకు ఉంటుంది.  అయితే, సామాజిక కోణాల దృష్టిలో ఆమె పేరును పరిగణలోకి తీసుకొనే అవకాశాలు కనిపించడం లేదు.

1989బ్యాచ్‌కు చెందిన ఆర్టీసి ఎండి ద్వారకా తిరుమలకు 2025 వరకు పదవీ కాలం ఉంది. ఆయన కూడా డీజీపీ పదవి కోసం తీవ్రంగానే ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.1991 బ్యాచ్‌కు చెందిన అధికారుల్లో డీజీపీ పదవికి అర్హులైన వారిలో మాదిరెడ్డి ప్రతాప్, మహమ్మద్ హసన్ రాజాలు ఉన్నారు.

వీరిలో రజా పదవీ కాలంలో జులైతో ముగియనుంది. మాదిరెడ్డి ప్రతాప్‌కు 2026వరకు వ్యవధి ఉంది. 92 బ్యాచ్‌కు చెందిన మరో సీనియర్ అధికారి హరీష్‌ కుమార్ గుప్తాకు 2025వరకు పదవీ కాలం ఉంది.

1992 బ్యాచ్‌కు చెందిన పిఎస్సార్ ఆంజనేయులు, ప్రస్తుత డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డిల పేర్లు ప్రధానంగా రాజకీయ, అధికార వర్గాలలో ప్రచారంలో ఉన్నాయి.  డీజీపీగా ఉన్న రాజేంద్రనాథ్‌ రెడ్డి ఏడాదికి పైగా ఆ పదవిలో ఉన్నారు. మరో అధికారి పిఎస్సార్ ఆంజనేయులుకు 2026 ఆగష్టు వరకు పదవీ కాలం ఉంది.

 ప్రస్తుతం నిఘా విభాగాధిపతిగా ఉన్న సీతారామాంజనేయులు పేరును కూడా డీజీపీ రేసులో ముందుండే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతున్నాయి. ప్రస్తుత డిజిపిని వద్దనుకొంటే ఆయన పేరువైపు ముఖ్యమంత్రి మొగ్గుచూపే అవకాశం లేకపోలేదు.

ఏసీబీ అధిపతిగా, నిఘా విభాగం అధిపతిగా ఆయన సీఎం జగన్ కనుసన్నలలో పనిచేస్తుంటాం, అవసరమైన్నప్పుడు దూకుడుగా వ్యవహరించే సామర్ధ్యం ఉండడంతో ఎన్నికల సమయంలో ఆయన సేవలను వినియోగించు కొనేందుకు మొగ్గు చూపే అవకాశం ఉంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles